విద్యార్థుల ప్రాణాలు పోతున్నా.. సర్కారుకు పట్టిలేదు

రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం, ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన గురుకులాలు సర్కారు నిర్లక్ష్యంతో దారుణంగా తయారయ్యాయి. ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులను వదిలేసి ఉజ్వల భవిష్యత్తు కోసం గురుకులాల్లో చేరుతుంటే, అక్కడి వాస్తవ పరిస్థితులు వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పురుగుల అన్నం, నీళ్ల చారుతో స్టూడెంట్స్​ నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడా సౌలత్​లు సక్కగ లేవు. రాష్ట్రవ్యాప్తంగా పదులో సంఖ్యలో స్టూడెంట్స్​చనిపోతున్నా.., వందల సంఖ్యలో ఫుడ్​పాయిజన్​ కేసులు వెలుగు చూస్తున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా చోద్యం చూస్తున్నది.

సవరించని మెస్​చార్జీలు

రాష్ట్రవ్యాప్తంగా 326 గురుకులాలు,400కు పైగా కేజీబీవీలు,669 ఎస్సీ, 419 బీసీ ప్రీమెట్రిక్ హాస్టల్స్, 204 ఎస్సీ, 278 బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్,136 ఎస్సీ హాస్టల్స్​ కలిపి సుమారు 3.6 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారు. వీళ్లకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్కారు మూడు నుంచి ఏడో తరగతి చదివే స్టూడెంట్లకు 950 రూపాయలు, 8,9,10 తరగతులకు రూ.1100, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రూ.1500 చెల్లిస్తోంది. అంటే తరగతులకు బట్టి ఒక్కో స్టూడెంట్ కు రోజుకు రూ.30 నుంచి రూ.50 మాత్రమే ఇస్తున్నది. ఇందులోంచి వంటగ్యాస్ కు రూ. 5 పోతే, మిగిలేది 25 నుంచి 45 రూపాయలు మాత్రమే. తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో ఈ మెస్ చార్జీలను ఖరారు చేశారు. ఆ తర్వాత ఏడేండ్లుగా వాటిని సవరించలేదు. రెండేండ్లలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. పెరుగుతున్న రేట్ల ప్రకారం ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచలేదు. 

నాసిరకం సరుకులు

మార్కెట్​రేట్ల ప్రకారం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోవడంతో సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఉన్న డబ్బులతో నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారు. పురుగులు పట్టిన బియ్యం, పాడైన కూరగాయలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. నాలుగు సార్లు పెట్టాల్సిన మాంసాహారం రెండుసార్లు పెడుతున్నారు. ఒక్క పూటకు వడ్డించాల్సిన భోజనం రెండు పూటలకు సరిపెడుతున్నారు. మెనూలో కోతలు పెడుతూ10 కేజీల పప్పు అవసరం కాగా, 5 కేజీలతో సరిపెడుతున్నారు. కొన్నిచోట్ల సాంబారుతోనే పూట గడుపుతున్నారు. ఐదు రోజులు గుడ్డు అందించాల్సి ఉండంగా మూడు రోజులే ఇస్తున్నారు. ఫుడ్ క్వాలిటీగా లేదని విద్యార్థులు ఎన్నిసార్లు చెప్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. వంటవాళ్లు, హెల్పర్లు కూడా సరిగా లేరు. వందమంది స్టూడెంట్లకు ఒక హెడ్ కుక్ ఇద్దరు హెల్పర్స్ ఉండాలి. కానీ మూడు వేల మంది విద్యార్థులు ఉన్నచోట కూడా ఒకరిద్దరితోనే సరిపెడుతున్నారు. దీంతో ఫుడ్​పాయిజనై వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్ష నిర్వహించడం లేదు. గురుకులాల బాధ్యత తమది కాదు అన్నట్లు సర్కారు తీరు కనిపిస్తున్నది. 

అధ్వానస్థితిలో హాస్టళ్లు

కామారెడ్డి బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్​లో 10 సంవత్సరాల బాలుడు పాముకాటుతో మృతిచెందడం రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నది తేటతెల్లం చేస్తున్నది. హాస్టల్ పరిసరాలు శుభ్రంగా లేక పాములు సంచరిస్తున్నప్పటికీ పట్టించుకోనిది ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రైవేటు బడిలో వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేని పేదలు వారి బిడ్డలను గురుకులాల్లో చేర్చి చదివించుకోవాలనుకోవడం తప్పా? పాము కాటుతో మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? పేదోడి బిడ్డ ప్రాణాలకు లెక్కలేదా? సర్కారు నిర్లక్ష్యానికి ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు పొగొట్టుకున్నారు. కనీస రక్షణ లేని వసతి గృహాలు, బాలికల హాస్టళ్లలో చెప్పుకోలేని బాధలెన్నో ఉన్నాయి. భోజనం సరిగా లేక, కనీసం టాయిలెట్లు కూడా లేక పేద విద్యార్థినులు సంక్షేమ హాస్టళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆడపిల్లల చదువు దేశానికి వెలుగు. మరి తెలంగాణ ఆడబిడ్డల చదువులు, వారి సౌలత్​ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఇదేనా? హాస్టళ్లలో కనీసం వీళ్లు చెప్పుకోలేని ఇబ్బంది పడుతున్నట్లు ఆడపిల్లలు రోడ్డుపై ఆందోళన చేస్తూ చెప్పిన బాధాకర మాటలకు యావత్తు తెలంగాణ కంటనీరు పెట్టుకున్నది. కానీ రాష్ట్ర సర్కారు చీమకుట్టినట్లు కూడా లేదు.

ఆడబిడ్డల గోస అర్థం కాదా?

రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని తెలిపే ఓ పోస్టు గత రెండు రోజులుగా సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతున్నది. ‘బడి మొదలై మూడు నెలలైనా బడిపిల్లలకు యూనిఫామ్​ ఇయ్యలేదు కానీ, నెల రోజుల ముందే పంపిణీకి సిద్ధంగా బతుకమ్మ చీరలు” అనేది ఆ పోస్టు సారాంశం.  వాస్తవానికి బతుకమ్మ చీరలు ఎవరూ అడగలే. కానీ బడి పిల్లలకు స్కూలు డ్రెస్, తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో చదువుకోవడానికి సరైన సౌలత్​లు కావాలని అడుగుతున్నారు. మహిళలు అడగక ముందే చీరలు ఇస్తున్న రాష్ట్ర సర్కారు.. రోడ్డెక్కి గొంతు పోయేలా అరిచి, డిమాండ్​ చేస్తున్నా బిడ్డల గోస పట్టించుకుంట లేదు. ఎందుకంటే బడికిపోయే బిడ్డలకు ఓట్లు లేవు కదా?  ప్రభుత్వం ఇకనైనా పేద విద్యార్థుల భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టాలి. 

- చింతకాయల ఝాన్సీ, లా స్టూడెంట్ , ఓయూ