ఎమ్మెల్సీ షెడ్యూల్ వచ్చినా.. క్యాండిడేట్లు ఖరారు కాలే!

ఎమ్మెల్సీ షెడ్యూల్ వచ్చినా.. క్యాండిడేట్లు ఖరారు కాలే!
  • ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌‌ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు
  • ఇంకా అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్, బీఆర్ఎస్
  • ఈ రెండు పార్టీల నుంచే పోటీకి పలువురు ఆశావహుల ఆసక్తి 
  • ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 
  • టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్లను ప్రకటించిన ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయినా.. ఇంకా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఒకటి, రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక  బీఆర్ఎస్ పోటీ చేస్తుందా.. లేదా అనే సస్పెన్స్ నెలకొంది. 

కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్యను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే.  సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరునే కాంగ్రెస్ అధిష్టానానికి పంపినప్పటికీ.. ఆయన పోటీకి ఆసక్తి చూపినట్లు తెలిసింది. ఆయనకు కాకుంటే అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావుతోపాటు డిగ్రీ కాలేజీ లెక్చరర్(వీఆర్ఎస్) ప్రసన్న హరికృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో నరేందర్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం 
నిర్వహిస్తున్నారు. 

బీఆర్ఎస్ అధినేత నిర్ణయంపైనే..

ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా రవాణా శాఖ ఆఫీసర్ చంద్రశేఖర్ గౌడ్ కు బయటి నుంచి మద్దతిచ్చారు. ఈసారి కూడా అభ్యర్థిని బరిలోకి దింపాలా వద్దా అనే విషయంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ చేస్తే తమకే చాన్స్ ఇవ్వాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఓయూ జేఏసీ మాజీ నేత, విద్యార్థి ఉద్యమకారుడు రాజారాం యాదవ్ కోరుతున్నట్లు తెలిసింది.

ఇండిపెండెంట్లుగా పలువురు..

తొలుత బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయాలని భావించినప్పటికీ.. ఆ పార్టీ నుంచి టికెట్ రాదని గ్రహించిన ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఇండిపెండెంట్ గా ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్పీ గంగాధర్  జాబ్ కు  రాజీనామా చేసి ఎమ్మెల్సీ గా పోటీకి రెడీ అయ్యారు.  కరీంనగర్ కు చెందిన డాక్టర్ రాజ్ కుమార్ కూడా ఇండిపెండెంట్ గా బరిలోకి పోటీలో ఉన్నారు. 

ALSO READ : కొత్త సీఎస్​ ఎవరు: ఏప్రిల్ 7న శాంతికుమారి పదవీ విరమణ

టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా.. 

టీపీటీఎఫ్-, యూటీఎఫ్​సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై. అశోక్ కుమార్, సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థిగా తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి , తపస్ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్ నుంచి మహేందర్‌‌రెడ్డి  పోటీ పడుతున్నారు. 

రికార్డు స్థాయిలో ఎన్ రోల్ మెంట్ 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో  2019 ఎన్నికల్లో 1.96 లక్షల మంది నమోదు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 30 వరకు 3,41,313 మంది ఎన్ రోల్ అయ్యారు.  వీరిలో 2,18,060 మంది పురుష, 1,23,250 మంది మహిళ, ముగ్గురు థర్డ్ జెండర్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1,62,464 మంది ఉండడంతో పార్టీలు, అభ్యర్థుల చూపు ఈ జిల్లాపైనే ఉంది. అలాగే టీచర్ ఎమ్మెల్సీకి  25,921 మంది టీచర్లు ఎన్ రోల్ అయ్యారు.  వీరిలో పురుష టీచర్లు 16,364 మంది, మహిళా టీచర్లు 9,557 మంది ఉన్నారు. గత డిసెంబర్ 31 నుంచి ఈనెల 29 వరకు 11,056 మంది గ్రాడ్యుయేట్లు, 2,148 మంది టీచర్లు ఓటు కోసం  అప్లై చేసుకున్నారు. .