భారత రాజ్యాంగం అధికరణ 48 ఎ ప్రభుత్వం పర్యావరణాన్ని, అడవులను, వన్యప్రాణులను కాపాడాలని నిర్దేశిస్తుంది. అయితే ఈ దిశగా కేంద్రంకానీ, రాష్ట్రాలు కానీ పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. పర్యావరణానికి హాని కలిగించేవాటిలో ప్లాస్టిక్ కూడా ఒకటి. 20వ శతాబ్దం మొదట్లో ప్లాస్టిక్ వాడకం మొదలైనప్పుడు ఇది సమాజానికి ఎంతో మేలైన, చౌకగా దొరికే వస్తువని అనుకున్నారు. రాను రానూ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చివరకు దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం తప్పని సరైంది.
ప్లాస్టిక్‌ను రకరకాల ఆకారాలలో సులభంగా మలచవచ్చు, అందువలన ఎన్నో రకాలుగా వాడుకలోని వస్తువులను ప్లాస్టిక్‌తో తయారుచేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ మందం ప్లాస్టిక్‌తో తయారైన చేతి సంచులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ కప్పులు, ప్లేటులు, చెంచాలు, టేబుళ్లపై పరిచే షీట్లు, థర్మకోల్‌తో తయారుచేసే చాలా వస్తువులు ప్రజల ఆరోగ్యంపై పెను ప్రమాదం చూపిస్తున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులు వరద కాలువలలో చిక్కుకొని నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఏర్పడి నీరు రోడ్లపైకి రావడం, రోడ్డు చెడిపోవడం జరుగుతోంది. అలాగే ప్లాస్టిక్ సంచులు పంట పొలాలలోనికి పోయి వాననీరు భూమిలోనికి ఇంకకుండా అడ్డుపడతాయి. పట్టణాలలో జంతువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్వ్యర్థాలు పర్యావరణానికి పెనుప్రమాదంగా పరిణమిస్తున్నాయి. ప్లాస్టిక్ అన్నది ఒక రసాయన పాలిమార్ (కెమికల్ పాలిమార్). ఇది డిగ్రేడ్ కావడానికి వందల సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చినప్పుడు ప్రమాదకరమైన వాయువులు వెలువడి అవి పర్యావరణానికి, జీవరాశికి ఎంతో హాని కలిగిస్తాయి.
ప్లాస్టిక్ చాలా పరిశ్రమలలో వాడుతున్నారు. లోహాలు, కర్ర వంటి స్థానాలలో నేడు ప్లాస్టిక్ వాడకం జరుగుతోంది. అదీకాక ప్లాస్టిక్ వస్తువుల తయారీ వల్ల ఎంతో మందికి జీవనోపాధి కలుగుతున్నది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్లాస్టిక్ పదార్థాలను నిషేధించడం వీలు కాకపోవచ్చు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించడంపై చాలా చర్చలు జరిగాయి. కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి చాలా రాష్ట్రాలలో ఒకసారి వాడే ప్లాస్టిక్‌లపై నిషేధం విధించడం జరిగింది.
ప్లాస్టిక్ వాడకంపై ఆంక్షలు
మన రాష్ట్ర ప్రభుత్వం 2013లో జీవో46 ద్వారా ప్లాస్టిక్ వాడకంపై కొన్ని ఆంక్షలు విధించింది. ప్లాస్టిక్ కంపెనీలు, సంచులు ఇతర వస్తువులు తయారుచేయునప్పుడు నిషేధించిన రసాయనాలు వాడకూడదు. అలాగే పాలిథిన్ సంచులు 40 మైక్రాన్స్ కంటే తక్కువ మందం ఉండకూడదు. ఈ రూలు అమలుచేయడానికి మునిసిపాలిటీలను బాధ్యులుగా చేశారు. ఈ రూల్సు పాటించనివారిపై 50 వేల రూపాయిల జరిమానా విధించే అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. అయితే ఈ జీవో అమలుకు నోచుకోలేదు.
కర్ణాటక, హిమాచల్ వలె చేయాలి
అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్న చందాన చట్టాలు ఎన్ని చేసినా అధికారులలో చిత్తశుద్ధి లోపించి అమలుకు నోచుకోవడం లేదు. ప్లాస్టిక్ నిషేధం- రూల్సును అమలుచేయుట స్థానిక సంస్థలైన మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లపై ఉంచడం జరిగింది. వారు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లెన సన్నని ప్లాస్టిక్ సంచులు, ప్లేట్లు, టీ కప్పులు రోడ్ల వెంబడి, నాలాలలో, పంటపొలాలలో దర్శనమిస్తాయి. పట్టణాలలో పరిస్టితి ఇంకా దారుణంగా ఉంది. వేడి తినుబండారాల వంటి వస్తువులను ప్లాస్టిక్ కప్పులలో, గిన్నెలో, ప్లేట్లలో ఉంచినప్పుడు ప్టాస్టిక్‌లోని సూక్ష్మ పదార్థాలు తినుబండారాలలో కలసి, తిన్నవారు అనారోగ్యం పాలవుతున్నారు.
ముఖ్యంగా కేన్సర్ వంటి వ్యాధులకు బలవుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి చాలా రాష్ట్రాలలో నిషేధించిన మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వాడకంపై నిషేధించాలి. అలాగే ప్రజలు కూడా జనప, బట్ట సంచులు వాడాలి. ప్లాస్టిక్ కప్పులలో టీ, కాఫీ వంటివి తీసుకోకూడదు. ప్రజలు, ప్రభుత్వం సహకరించి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకసారి వాడి పడేసే వాటిపై నిషేధం ఉంది
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ రూల్సు ఇవ్వడం జరిగింది. ఈ రూల్సు ప్రకారం ఉత్పత్తిదారులు పాలిథిన్ సంచులు 50 మైక్రాన్‌ల కంటే తక్కువ మందంగల వాటిని తయారుచేయకూడదు. ప్రజలు కూడా వాటిని వాడరాదు. ఇంకా 2022 తరువాత గుట్కా, పొగాకు, పాన్ మసాలా ప్యాకింగ్ చేసే ప్యాకెట్లు 120 మైక్రాన్‌ల కంటే తక్కువ ఉండకూడదని నిర్దేశించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్లాస్టిక్ సంచులు 20 మైక్రాన్ లేదా 50 మైక్రాన్‌ల తయారీ ఒకేవిధంగా ఉంటుంది. అలాగే సామాన్యులు ప్లాస్టిక్ సంచుల మందం కొలత చేయలేరు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని చాలా రాష్ట్రాలు ఒకసారి వాడి పారేసే వాటిపై పూర్తి నిషేధం చేస్తూ చట్టాలు చేయడం జరిగింది. చట్టాలను ఉల్లంఘించిన వారిపై పెద్ద ఎత్తున జరిమానాలు కూడా విధించారు. తెలంగాణలో డిసెంబర్ 2022 నుంచి 120 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం గల సింగిల్ యూజ్ వస్తువుల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకంపై నిషేధం విధించారు.