మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటింగ్ రోజూ ప్రలోభాలు ఆగడం లేదు. చాలా చోట్ల విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాంపల్లి మం. టీపీగౌరారంలో టీఆర్ఎస్ ప్రలోభాలకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డబ్బులు పంపిణీ చేస్తోన్న ఓ వాహనాన్ని అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ వాహనం ఎమ్మెల్సీ కోటిరెడ్డి అనుచరులదిగా అనుమానిస్తున్నారు. ఈ వాహనంలో నోట్లకట్టలతో పాటు టీఆర్ఎస్ పార్టీ జెండాలుండడం గమనార్హం.
మద్యం, డబ్బుల పంపిణీపై సీఈవో ఆఫీసుకు ఇప్పటికే 60కి పైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. లోకల్ అధికారులు పట్టించుకోవడం లేదని పలు కంప్లైంట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్లు మునుగోడులో మకాం వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మునుగోడు వ్యాప్తంగా ఇష్టారీతిన విపరీతంగా డబ్బు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మునుగోడు ప్రజల నుంచి దాదాపు 60కి పైగా ఫోన్స్ ద్వారా ఫిర్యాదులందాయని బుద్దవనం ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మర్రిగూడలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో పట్టుబడిన నగదును పోలీసులు సీజ్ చేస్తున్నారు.