
చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు పోరాటం ముగిసింది. ఆటగాళ్లను దేశ ఆర్మీకి అప్పగించి కొండలు, గుట్టలు ఎక్కించినా.. స్పెషల్ కోచ్‌లను పెట్టి విలువైన సూచనలు ఇప్పించినా.. జట్టును మాత్రం విజయాలు వరించలేకపోయాయి. ఆడిన రెండింటిలో ఓడిన పాక్.. అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన పాక్.. ఆ తరువాత టీమిండియా చేతిలో చావుదెబ్బ తిన్నది. దాయాదుల పోరులో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయిందన్న పేరు తప్ప.. మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఎక్కడా ఉత్కంఠ లేదు. పాక్ పైచేయి సాధించింది లేదు. దాంతో, ఆ జట్టుపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా దాయాది జట్టు ప్రదర్శనపై ఆ దేశ మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ సనా మీర్(Sana Mir) స్పందించింది.
చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్లను చూసినప్పుడే.. పాకిస్తాన్ జట్టు ఓడిపోయిందని మీర్ చెప్పుకొచ్చింది. ఈ 15 మంది ఆటగాళ్లను.. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అప్పగించినా ఏమీ చేయలేడని ఎద్దేవా చేసింది.
"(పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు) ఎంపికైన 15 మందికి ఎంఎస్ ధోనీని లేదా యూనిస్ ఖాన్‌ను కెప్టెన్‌గా చేసినా ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఎంపికైన 15 మంది ఆట పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేయబడలేదు.."
"దుబాయ్ పిచ్‌లపై కనీసం ఒక మ్యాచైనా ఆడాల్సి ఉంటుందని ఎంపిక చేసిన సెలెక్టర్లకూ తెలుసు. మరి జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఒకరే ఎందుకు..? ఇద్దరు పార్ట్‌టైమ్ స్పిన్నర్లను ఎలా తీసుకున్నారు..? అబ్రార్ వన్డేలకు కొత్త. గడిచిన ఐదారు నెలల్లో జట్టులోకి వచ్చాడు. అతనిపై ఎలా నమ్మకం ఉంచాలనిపించింది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీసుల్లో ఆడిన ఆటగాళ్లను తొలగించారు.." అని మీర్ ఒక ఇంటర్వ్యూలో వారి క్రికెటర్ల గాలి తీసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్తాన్.. మార్చి 16 నుండి ఏప్రిల్ 5 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇది సుధీర్ఘ పర్యటన. ఇరు జట్ల మధ్య ఐదు టీ20లు, రెండు వన్డేలు జరగనున్నాయి.