ప్రజలు తిరస్కరించినా మార్పురాలే

 ప్రజలు తిరస్కరించినా మార్పురాలే

కాంగ్రెస్‌ ఇచ్చిన అడ్డగోలు హామీలు, ప్రలోభాలకు లొంగి ఆ పార్టీని గెలిపించారని ఆ పార్టీకి ఉన్న వనరులు, వసతులు వాడుకునే తెలివిలేదని ఇష్టమొచ్చినట్లు కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలిచ్చిందని కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పదేపదే ప్రతిరోజూ వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించినందుకు ప్రజలు బాధపడుతున్నారని కూడా కేటీఆర్‌ అంటున్నారు.  

కాంగ్రెస్‌ హామీల మాయలోపడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయారనడం కేటీఆర్​ అజ్ఞానం.  ఇప్పటికే మా నాలుగు నెలల పాలనను ఈ ఎన్నికల్లో రెఫరెండంగా భావిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సవాల్‌కు కేసీఆర్‌ నిలబడతారా? తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను, ఈ నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనను రెఫరెండంగా తీసుకొని ఎన్నికలకు వెళ్లటానికి కేసీఆర్‌ సిద్ధం కావాలి. 

బీఆర్ఎస్​ తొమ్మిదిన్నరేళ్ల పాలన ఎంత సక్కగా ఉన్నదో  ప్రతిరోజూ పత్రికలు చదువుతుంటే తెలుస్తున్నది. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని  కుటుంబ పాలన, తెలంగాణను నిలువు దోపిడీ చేసిన విషయం ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు చూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వెయ్యలేదు. బీఆర్​ఎస్​ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జరిగిన దోపిడీ, దగా, మోసపూరిత పాలన చూసి ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. బీఆర్ఎస్​ పాలన మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటుంటే, టిక్కెట్లు ఇచ్చినవాళ్లు సైతం  మాకొద్దంటూ ఇతర పార్టీల్లోకి పారిపోతున్నారు ఎందుకు?

కాళేశ్వరం బండారం బట్టబయలు

కోటి ఎకరాలకు నీళ్లిస్తానని చెప్పి లక్ష కోట్లతో కాళేశ్వరం  ప్రాజెక్టును  నిర్మించారు.  ఇంజినీర్లను కాదని తానే ఇంజినీర్‌ అవతారమెత్తి కాళేశ్వరంను నిర్మించారు. ఈ ప్రాజెక్టు గురించి దేశ విదేశాల్లో భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తిపోతల పథకాన్ని ఎవరూ నిర్మించలేదని చెప్పుకుంటూ దానిని ఒక టూరిజం ప్లేస్‌గా మార్చారు. రాష్ట్రానికి ప్రముఖులెవ్వరు వచ్చినా ఈ ప్రాజెక్టు దగ్గరికి తీసుకెళ్లి తమ గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుందని  ప్రచారం చేశారు. 

చివరకు ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే బ్యారేజీలు కుంగిపోయి అందులో ఉన్న నీటిని బయటకు వదిలి సముద్రం పాలు చేశారు. ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీళ్లివ్వకుండా రూ.10వేల కోట్లు కరెంట్‌ బిల్లులు కట్టారు. నీళ్లు లిఫ్ట్‌ ద్వారా పైకి ఎత్తిపోయడం, తిరిగి తిప్పిపోసి  సముద్రం పాలు చేయడం తప్ప ఈ ప్రాజెక్టు కారణంగా రైతులకు ఒరిగింది సున్నా. 3వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నాయని మేము కాళేశ్వరం ద్వారా నీటిని సద్వినియోగం చేస్తున్నామని ప్రగల్భాలు పలికారు. 

ఎంత గొప్పగా సద్వినియోగం చేసింది, మూడేళ్లు గడిచేటప్పటికి కాళేశ్వరం బండారం మొత్తం బట్టబయలైంది. కాళేశ్వరం ద్వారా వచ్చిన వనరులను, ఫలితాలను రైతులు అనుభవించలేదు కానీ కేసీఆర్‌ కుటుంబం బాగా అనుభవించింది. కేసీఆర్‌ కుటుంబం పాల్పడిన అవినీతికి లక్ష కోట్ల కాళేశ్వరం బలైంది.  కాంగ్రెస్‌ పాలనలో నాగార్జునసాగర్‌, శ్రీశైలం, సింగూరు, శ్రీరాంసాగర్‌ వంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మించి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేయటం కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు తెలిసిన విద్య.

ధరణి మాయ

మూడు సంవత్సరాలపాటు నేను, చీఫ్‌ సెక్రటరీ కలిసి తీవ్రంగా కసరత్తు చేసి ధరణి పోర్టల్‌ను తెచ్చామని, తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి భూ లావాదేవీలు అద్భుతంగా సాగుతాయని, రైతులకు ఇక భూ వివాదాలే ఉండవని కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ తెస్తూ చెప్పారు. ఈ ధరణి పోర్టల్‌ తన అద్భుత మేధాశక్తి నుంచి పుట్టిన గొప్ప మానస పుత్రిక అంటూ అభివర్ణించారు.

 కానీ, ఈ పోర్టల్‌ రాకతో రైతుల కష్టాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా అయ్యాయి. ధరణి సాఫ్ట్​వేర్‌లో ఉన్న లోపాలతో రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్లు కాక లక్షలాది మంది రైతులు కలెక్టరేట్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా వారి సమస్యలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. ఇది కేసీఆర్‌ అద్భుత మేధాశక్తికి ఒక మచ్చు తునక. 

ప్రేలాపనలు

రాష్ట్రంలో 90వేలకు పైగా ఉద్యోగాలు నింపుతున్నామని నిరుద్యోగులకు ఇక పండగేనని అసెంబ్లీలో కేసీఆర్‌ అట్టహాసంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో బీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌ ఫొటోకు పాలాభిషేకాలు చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించగా పేపర్లు లీకై పరీక్షలు రద్దయి నిరుద్యోగులు దారుణంగా మోసపోయారు. కేసీఆర్‌ వనరులను వాడిన తెలివికి ఇదో పెద్ద ఉదాహరణ. కాంగ్రెస్‌ మెడలు వంచే అంకుశం బీఆర్‌ఎస్‌ అని కూడా కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌ మెడలు మీరు వంచడం కాదు..తెలంగాణ ప్రజలే  ఒక్కో అంకుశమై  దొర అహంకారాన్ని ఓటు అనే ఆయుధంతో పాతాళానికి తొక్కారు.  కుటుంబ పాలన, అవినీతి, అహంకార, నిరంకుశ పాలనకు తెలంగాణ ప్రజలు శాశ్వతంగా అంతం పలికారు. ప్రజలు అధికారం నుంచి దించి వేశారనే అక్రోశంతో, బాధతో కేసీఆర్‌, ఆయన కుమారుడు చేస్తున్నవి  ప్రేలాపనలు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడటానికి బలమైన  ప్రతిపక్షం ఉండాలని కేసీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని అసెంబ్లీలో ఫిరాయింపులు ఘనంగా జరిపారు.  ప్రతి పక్షం అసెంబ్లీలో నోరెత్తితే మెడబెట్టి బయటకు గెంటించారు. సెషన్స్‌ ముగిసే వరకూ మొత్తం ప్రతిపక్షాలను సస్పెండ్‌ చేసి ఏకపక్షంగా అసెంబ్లీని నడిపించుకున్నారు. ప్రతిపక్షాలకు సభలో, బయట ఎక్కడా ప్రశ్నించే హక్కులేకుండా నిరంకుశ పాలన సాగించారు.
 
నిర్బంధాలు పెట్టిన కేసీఆర్​ ధర్నా చేస్తాడా?

 కేసీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ధర్నా చేస్తానని చెప్పడం వింతగా ఉంది. మీ పాలనలో ధర్నా చౌక్‌ను ఎత్తివేసి ధర్నాలు చేయాల్సిన అవసరమే లేదని చెప్పారు. ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయని తెలిస్తే వారి ఇళ్లల్లోకి అర్ధరాత్రి చొరబడి తలుపులు పగలగొట్టి, బెడ్‌రూమ్‌ల్లోకి పోలీసులు చొరబడి దొంగలు, టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అటువంటిది ఈరోజు నాలుగు నెలలకే ధర్నాలు చేస్తామని కేసీఆర్‌ చెప్పడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.  పాలనను గాలికి వదిలి  ఫామ్‌హౌస్‌లో రెస్ట్‌ తీసుకునే కేసీఆర్‌ను అధికారం నుంచి దింపి రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితిని ప్రజలు తెచ్చారు. ప్రజాస్వామ్యం గొప్పతనం ఇది.

ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన ఫోన్ ​ట్యాపింగ్​

బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు వాడిన వనరుల ఫలితాలను చూసి తెలంగాణే కాదు దేశ ప్రజలందరికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఫోన్‌ ట్యాపింగ్‌ను బీఆర్​ఎస్​ వాడుకున్నంతగా దేశ చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వం వాడలేదు. వందల మంది పోలీసులను ట్యాపింగ్‌ కోసం ఉపయోగించి వేలాది మంది ప్రతిపక్ష నాయకులు, సొంత పార్టీ నాయకులు, జడ్జీలు, సినిమా, వ్యాపార వేత్తల ఫోన్లను ట్యాప్‌ చేయించారు. చివరకు భార్యాభర్తల ఫోన్లలో మాటలు సైతం విన్నారు. మహిళల ఫోన్లు ట్యాపింగ్​ చేసి అనేక మంది మహిళలను లైంగికంగా వేధించిన విధానం చూసి దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. 

ఫోన్లను ట్యాప్‌ చేసి ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బతీశారు. దీనితోపాటుగా  అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన డబ్బును పోలీసు వాహనాల్లో తరలించారు.  మాఫియా వ్యవస్థ మాదిరిగా తమ సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను కేసీఆర్‌ ఉపయోగించుకున్నారు. చివరకు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున 40కిపైగా హార్డ్‌ డిస్క్​లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడవేసి ఎటువంటి ఆధారాలు దొరకకుండా చేశారు. మాఫియా ముఠాలకు, దొంగలకు కూడా ఇంతటి క్రిమినల్‌ బ్రెయిన్‌ ఉండదేమో! పోలీసులను ఇంత గొప్పగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుకునే తెలివి ఏ పార్టీకి లేదు.

- బండ్రు శోభారాణి, 

ఉపాధ్యక్షురాలు, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ