- అప్రోచ్‌రోడ్లు లేక రాకపోకలకు ఇబ్బందులు
- వానలకు కొట్టుకుపోతున్న తాత్కాలిక రోడ్లు
- పనులు మొదలు పెట్టిన చోట్లా.. కంప్లీట్ కాలే
కామారెడ్డి, వెలుగు : కాజ్‌వేలు, వాగుల మీద బ్రిడ్జిలు కట్టినా .. వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించలేదు. కొన్ని చోట్ల రోడ్ల పనులు మొదలుపెట్టినా పూర్తి చేయలేదు. దీంతో కామారెడ్డి జిల్లాలోని చాలా గ్రామాల ప్రజలను రవాణా కష్టాలు వెంటాడుతున్నాయి. రూ. కోట్లు ఖర్చు చేసి కాజ్‌వేలు, బ్రిడ్జిలు నిర్మించినా అటూఇటూ బీటీ రోడ్లు వేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. వర్షాకాలం ప్రారంభం అయినందున రోడ్ల పనులు అసంపూర్తిగా ఉండడంతో అక్కడంతా బురదగా మారి వెహికల్స్ మీద వెళ్తున్నవారు నానా అవస్థలు పడాల్సివస్తోంది. టూవీలర్స్‌పై వెళ్లే చాలామంది జారిపడ్డ ఘటనలు అనేకం ఉన్నాయి. చాలాచోట్ల తాత్కాలికంగా మట్టి రోడ్డు వేయగా. వానలకు కోట్టుకుపోయాయి. రాజంపేట, రామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, కామారెడ్డి మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
- లింగంపేట మండలం నాగారం వాగుపై 5ఏండ్ల కిందటే బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయ్యింది. నిరుడు భారీ వర్షాలకు బ్రిడ్జికి ఇరుపక్కల రోడ్డు కొట్టుకుపోయింది. తాత్కలికంగా రోడ్డు నిర్మించారు. ఈ మట్టి రోడ్డు కూడా సగం కొట్టుకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి మీదుగా నల్లమడుగు, నాగారం, బాణాపూర్ తదితర గ్రామాల వారు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డును బ్రిడ్జిని కలుపుతూ రెండు వైపులా బీటీ రోడ్డు వేయకపోవడం ఇప్పుడు మళ్లీ వర్షాలకు మట్టి రోడ్డు కొట్టుకుపోతుంది. రోడ్డుకు ఒక వైపు మట్టి కొట్టుకుపోయి ఇరుకుగా మారింది. రాత్రిపూట ఇది కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
- రాజంపేట మండలం కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి మధ్య రెండు చోట్ల వాగులపై బ్రిడ్జిలు నిర్మించారు. ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభించగా ఇటీవలే కంప్లీట్ అయ్యాయి. బ్రిడ్జికి రెండువైపుల బీటీ రోడ్డు వేయాల్సిఉన్నా ఒక వైపు నిర్మించలేదు. వర్షానికి రోడ్డంతా బురదగా మారడంతో వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. బ్రిడ్జి దగ్గర రోడ్డుకు ఇరుపక్కల సైడ్ వాల్స్ నిర్మించలేదు. ఈ రూట్లో కామారెడ్డి నుంచి మెదక్, రాజంపేట, నాగిరెడ్డిపేట మండలాలకు రోజు వందల సంఖ్యలో వెహికల్స్ వెళ్తుంటాయి. కొండాపూర్ నుంచి ఎల్లారెడ్డిపల్లి, గుండారం, సిద్ధాపూర్‌తో పాటు నాగిరెడ్డిపేట, లింగంపేట మండలంలోని గ్రామాలకు, మెదక్ జిల్లాకు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి.
- కామారెడ్డి మండలం అడ్లూరు, ఇస్రోజివాడిల మధ్య రోడ్డుపై కాజ్వే ఉంది. దీనిపై నుంచి వర్షకాలంలో వరద నీరు ప్రవహిస్తోంది. ఈ కాజ్వే దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి రూ. 90 లక్షలు శాంక్షన్ అయ్యాయి. ఏడాదిన్నర దాటినా ఇంకా పనులు మొదలు పెట్టలేదు. ఈ రూట్లో కామారెడ్డి నుంచి రామారెడ్డి మండలంలోని రంగంపేట, పోశానిపేట, మోషంపూర్, ఉప్పల్వాయి, గిద్ద గ్రామాలకు వెళ్తుంటారు. బ్రిడ్జి నిర్మించకపోవడంవల్ల వర్షకాలంలో ఈ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రామారెడ్డి సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు కూడా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి-,
- కామారెడ్డి మండలం టేకిర్యాల్ మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరిగింది. కొద్ది రోజుల క్రితం పనులు కంప్లీట్అయినా రోడ్డు వేయకపోవటంతో వాహనాలు వెళ్లటానికి ఇబ్బందవుతోంది.