సూర్యాపేట కమలంలో.. కనిపించని జోష్‌‌‌‌

  • సంకినేని, సైదిరెడ్డి మధ్య కోల్డ్‌‌‌‌వార్‌‌‌‌
  • శానంపూడి చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంకినేని
  • ఎవరికి వారుగా వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న లీడర్లు
  • ప్రచారానికి దూరంగా వెంకటేశ్వరరావు వర్గీయులు
  • సంకినేనిని బుజ్జగించేందుకు హైకమాండ్‌‌‌‌ ప్రయత్నాలు

సూర్యాపేట, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ సూర్యాపేట కమలం పార్టీలో మాత్రం జోష్‌‌‌‌ కనిపించడం లేదు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి బీజేపీలో చేరి పార్లమెంట్‌‌‌‌ టికెట్‌‌‌‌ దక్కించుకున్న సైదిరెడ్డి సీనియర్లను సమన్వయం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. సైదిరెడ్డి చేరికను మొదటి నుంచి వ్యతిరేకించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. నాయకులు సైతం ఎవరికి వారే పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌లో ఇంకా ప్రచారమే ప్రారంభం కాలేదు. దీంతో పార్టీ హైకమాండ్‌‌‌‌ ఇటీవల సంకినేనిని హైదరాబాద్‌‌‌‌ పిలిచి ఎంపీ ఎన్నికల్లో సైదిరెడ్డికి సహకరించాలని బుజ్జగించే ప్రయత్నాలు చేసింది.

సైదిరెడ్డి చేరికపై మొదటి నుంచీ వ్యతిరేకతే..

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేత, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడం సూర్యాపేట జిల్లాలో పెద్ద దుమారం లేపింది. ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలైన నాటి నుంచే స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్‌‌‌‌ నాయకుడైన సంకినేని వెంకటేశ్వరరావును కనీసం సంప్రదించకుండా డైరెక్ట్‌‌‌‌గా పార్టీలో జాయిన్‌‌‌‌ కావడం, హైకమాండ్‌‌‌‌ సైతం ఓకే చేయడంతో సంకినేని మొదటి నుండి అసహనంతో ఉన్నారు. బండి సంజయ్ సూర్యాపేట జిల్లాకు వచ్చిన టైంలో ఆయన పర్యటనను అడ్డుకొని, బీజేపీ లీడర్లపై దాడులు చేయించిన సైదిరెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకోవడాన్ని వ్యతిరేకించారు. సీనియర్లను అవమానిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం సరికాదన్న ఆగ్రహంతో ఉన్నారు. 

తుంగతుర్తి, సూర్యాపేటలో సంకినేని కేడర్‌‌‌‌

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధిక ఓట్లు సాధించిన బీజేపీ క్యాండిడేట్‌‌‌‌ సంకినేని వెంకటేశ్వరరావు. సంకినేనికి 40 వేలు ఓట్లు పడగా మిగిలిన క్యాండిడేట్లు ఎవరూ కూడా కనీసం 5 వేల ఓట్లు సాధించలేకపోయారు. గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన సంకినేనికి ఆ నియోజకవర్గంతో పాటు సూర్యాపేటలోనూ సొంత కేడర్‌‌‌‌ భారీగానే ఉంది. అయితే ఎంపీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ప్రచార సభల్లో ఎక్కడా కూడా సంకినేని పేరు, ఫొటో లేకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. సంకినేని ప్రమేయం లేకుండానే చేరికలు జరుగుతుండడం వల్లే ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఆయన లేకుండా ప్రచారం చేస్తే తాము కూడా రాలేమని కార్యకర్తలు సైతం స్పష్టం చేస్తున్నారు. 

గ్రూప్‌‌‌‌ రాజకీయాలతో బీజేపీ డీలా

సూర్యాపేటలో గ్రూప్‌‌‌‌ రాజకీయాల కారణంగా బీజేపీ డీలా పడుతోంది. సైదిరెడ్డిపై అసంతృప్తితో ఉన్న సంకినేని సూర్యాపేట జిల్లాలో ప్రచారం చేసేందుకు ఇంట్రస్ట్‌‌‌‌ చూపడం లేదు. ఇక్కడి ఎన్నికలను పక్కన పెట్టి భువనగిరి నియోజకవర్గ ప్రచారంలో మునిగిపోయారు. ఓ వైపు సైదిరెడ్డి లేకుండా సంకినేని వర్గీయులు, సంకినేని లేకుండా సైదిరెడ్డి వర్గీయులు వేర్వేరుగా మీటింగ్‌‌‌‌లు నిర్వహించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంకినేని ఎక్కడా కనిపించలేదు. మరో వైపు ఈ నెల 6న నడ్డా మీటింగ్‌‌‌‌ ఉండడంతో ఇందుకోసం శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి సైదిరెడ్డి దూరంగా ఉన్నారు.

మా మధ్య ఎలాంటి వైరం లేదు 

సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నా. మా ఇద్దరి మధ్య ఎలాంటి వైరం లేదు. సమయం తక్కువగా ఉండడంతో సూర్యాపేటలో ప్రచారం చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. సూర్యాపేటలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి సంకినేని హాజరవుతారు.
- శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంట్ క్యాండిడేట్‌‌‌‌

పార్టీ పెద్దల మంతనాలు..

పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో సంకినేని సపోర్ట్‌‌‌‌ లేకపోతే సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌ పరిధిలో వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా సంకినేనిని ఇటీవల హైదరాబాద్‌‌‌‌కు పిలిపించి బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సైదిరెడ్డికి సపోర్ట్‌‌‌‌ చేసి గెలిపిస్తే భవిష్యత్‌‌‌‌లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే సైదిరెడ్డిని చేర్చుకోవడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ పార్టీ అనుసరించిన పద్ధతే సరైంది కాదని సంకినేని పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది.