హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని కొందరు ఉన్నతాధికారులు రిటైర్ అయినా ఇంకా ఆ కుర్చీని మాత్రం వదలడం లేదు. మళ్లీ ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న ఓ ఉన్నతాధికారి.. మరోసారి పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల రిటైరైన ఇద్దరు ఆఫీసర్లు కూడా ఇదే బాటలో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతున్నది. ఈఎన్సీగా పనిచేసిన ఓ అధికారి మూడు నెలల కింద రిటైరయ్యారు. ఆయనకు ప్రభుత్వం మూడు నెలల పాటు ఎక్స్‌టెన్షన్‌ను ఇచ్చింది. అయితే, ప్రస్తుతం ఎక్స్టెన్షన్ ముగుస్తుండడంతో మరోసారి ఆయన తన పదవీకాలం పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారట.
కొద్ది రోజుల కింద రిటైరైన ఓ సీఈ.. మూడు నెలల కింద రిటైరైన మరో సీఈ కూడా ఎక్స్టెన్షన్ల కోసం చక్కర్లు కొడ్తున్నట్లు టాక్.ఇప్పటికే డిపార్ట్మెంట్ నుంచి వారి ఎక్స్టెన్షన్ ఫైళ్లు సెక్రటరీ వద్దకు చేరినట్లు అధికారుల్లో డిస్కషన్ నడుస్తున్నది. ప్రస్తుతం వారి ఎక్స్టెన్షన్ ‘యాక్టివ్ కన్సిడరేషన్’లో ఉన్నట్టుగా తెలిసింది. ఇక, 15 ఏండ్ల క్రితం రిటైరైన మరో సీఈ స్థాయి అధికారి కూడా మళ్లీ ఆ పోస్టులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి వచ్చేందుకు ఆయన అప్లికేషన్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇరిగేషన్ శాఖ సలహాదారు వద్ద పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ను తప్పించినా.. అనధికారికంగా ఇంకా కొనసాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ప్రమోషన్ల మాటేంది?
ఎక్స్టెన్షన్ల కోసం రిటైరైన ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుండడంతో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న పలువురు అర్హత ఉన్న డిప్యూటీ సీఈ, ఎస్ఈ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైరైన వారి ప్లేస్‌లో అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో కొందరు అధికారులు రెండు మూడేండ్ల వ్యవధిలో రిటైరైపోనున్నారు. కాబట్టి ఇప్పటికే రిటైరైన వారిని మళ్లీ తీసుకోకుండా అర్హత ఉన్న తమకు ప్రమోషన్లు ఇవ్వాలని పలువురు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎక్స్టెన్షన్లకు వ్యతిరేకమని తొలుత ప్రకటించిందని, అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళ్లాలని వారు అంటున్నారు.