
- బీఆర్ఎస్కు 7,కాంగ్రెస్‌కు 4
- దుబ్బాక సిట్టింగ్ స్థానం పోగొట్టుకున్న బీజేపీ
- సిద్దిపేటలో హరీశ్‌రావుకు తగ్గిన మెజార్టీ
- గజ్వేల్లో కేసీఆర్‌కు 45,174 మెజార్టీ
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : మెతుకుసీమలో కారు జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్హవా కొనసాగినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. బీఆర్ఎస్7 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2018లో 11 స్థానాల్లో బీఆర్ఎస్10 చోట్ల, కాంగ్రెస్ ఒక్కచోట గెలుపొందింది.
ఈ సారి మూడు స్థానాల్లో సిట్టింగ్‌లను కోల్పోయింది. బీఆర్ఎస్ 7 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకోగా బీజేపీ ఉన్న ఒక్క స్థానాన్ని పోగొట్టుకుంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు దక్కించుకుని పరువు కాపాడుకుంది. కాంగ్రెస్4 స్థానాలు కైవసం చేసుకుని నూతనోత్సాహాన్ని నింపుకుంది. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ 3 చోట్ల గెలువగా కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించింది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో స్థానంలో గెలిచింది. సిద్దిపేట జిల్లాలో 3 చోట్ల బీఆర్ఎస్ గెలవగా, ఒక చోట కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంది.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హవా చాటాయి. ఐదు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్ఎస్3 స్థానాల్లో గెలిచి పరువు నిలబెట్టుకుంది. ఆందోల్, నారాయణఖేడ్ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోగా పటాన్చెరు, జహీరాబాద్‌లో సిట్టింగ్‌లు గెలిచి, సంగారెడ్డిలో బీఆర్ఎస్ పాగా వేసింది. అయితే సంగారెడ్డి సెగ్మెంట్‌నుంచి బీఆర్ఎస్తరపున పోటీ చేసిన చింతా ప్రభాకర్ కాంగ్రెస్ క్యాండిడేట్జగ్గారెడ్డి మీద 9,297 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పటాన్చెరు సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌గౌడ్‌పై 7,070 ఓట్లతో విజయం సాధించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్అభ్యర్థి మాణిక్యరావు13,293 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ పై గెలుపొందారు. ఆందోల్‌లో సిట్టింగ్ ఎమెల్యే బీఆర్ఎస్ క్యాండిడేట్ చంటి క్రాంతికిరణ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ్మ 28,193 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నారాయణఖేడ్‌లో సిట్టింగ్ఎమ్మెల్యే బీఆర్ఎస్అభ్యర్థి భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ క్యాండిడేట్ పట్లోళ్ల సంజీవరెడ్డి 5,675ఓట్లతో విజయం సాధించారు.
సిద్దిపేటలో..
జిల్లాలో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం హుస్నాబాద్ సీటును కోల్పోగా, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్లో గెలుపొందింది. మూడు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులే ప్రతి రౌండ్ లో ఆధిక్యం సాధించగా, హుస్నాబాద్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అన్ని రౌండ్లలో ఆధిక్యాన్ని సాధించారు.
సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచినా గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీకంటే తక్కువ మెజార్టీ వచ్చింది. సిద్దిపేట నుంచి హరీశ్‌రావు 83,025 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, గజ్వేల్లో సీఎం కేసీఆర్ 45,174 ఓట్ల మెజార్టీతో, దుబ్బాకలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకరరెడ్డి 53,707 ఓట్లతో, హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 19,344 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పడిపోయిన హరీశ్‌రావు మెజార్టీ
సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన తన్నీరు హరీశ్‌రావు గత ఎన్నికల్లో పొందిన దాని కంటే తక్కువ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం1,78,420 ఓట్లు పోలవగా హరీశ్‌రావుకు 1,04,109 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిపై 83,025 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణకు 22,489, బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డికి 22,332 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ కు16,314 ఓట్లు రాగా నోటాకు1260 ఓట్లు లభించాయి.
గజ్వేల్లో కేసీఆర్ హ్యాట్రిక్ విజయం
నువ్వా నేనా అన్నట్టుగా సాగిన గజ్వేల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. సీఎం కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై 45,174 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,31,086 ఓట్లు పోలవగా కేసీఆర్‌కు 1,11,244 ఓట్లు వచ్చాయి. ఈటల రాజేందర్‌కు 65,961 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డికి 32,322 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పొలైన ఓట్లలో లక్షకు పైగా కేసీఆర్ సాధించడం విశేషం.
మెదక్ జిల్లాలో..
జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక చోట కాంగ్రెస్, మరో చోట బీఆర్ఎస్ గెలుపొందాయి. 2014, 2018 ఎన్నికల్లో రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా ఈ సారి ఎన్నికల్లో మెదక్ స్థానాన్ని బీఆర్ఎస్కోల్పోయింది. మెదక్ స్థానంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిపై 10,157 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ రోహిత్ కాంగ్రెస్‌లో చేరి టికెట్సంపాదించి బరిలో నిలిచారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. నర్సాపూర్స్థానంలో హోరాహోరీగా జరిగిన పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీఆర్ఎస్ హైకమాండ్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని కాదని సునీతారెడ్డికి టికెట్ ఇవ్వగా ఆమె కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించారు.