-
డబుల్బెడ్రూం ఇళ్లలోకి నిరుపేదలు
-
ఖాళీ చేయించిన పోలీసులు
కమలాపూర్, వెలుగు: డబుల్బెడ్రూం ఇండ్లు పూర్తయినా పంపిణీ చేయకపోవడంతో పేదలంతా వెళ్లి ఆక్రమించుకున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో నిరుపేదల కోసం 320 డబుల్‌బెడ్ రూం ఇండ్లు కడుతున్నారు. ఇందులో 160 వరకు ఇండ్ల పనులు 6 నెలల క్రితం పూర్తయ్యాయి. ఇంకా వాటర్, కరెంట్‌పనులు మాత్రం చేయాల్సి ఉంది. గతంలో ఇంటి స్థలాలు కేటాయించాలంటూ ఇదే ప్లేస్‌లో భూపోరాటం చేసిన పేదలు ఇండ్లు లేక అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నామని, డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయించాలని పలుసార్లు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులను కలిశారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 100 మంది నిరుపేదలు డబుల్బెడ్రూం ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకుని నిరుపేదలతో మాట్లాడారు. ఇండ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కట్టిన ఇండ్లు ఇస్తలేరంటూ పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూడు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు మండలాల పోలీసులు పెద్దఎత్తున మోహరించి నిరుపేదలను ఇండ్లలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీపీఐ, ఏఐటీయూసీ లీడర్లను అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్రాణి నిరుపేదలతో మాట్లాడారు. నిర్మాణాలు మొత్తం పూర్తయ్యాక అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేస్తామని నచ్చజెప్పడంతో శాంతించారు.