హైకోర్టు చెప్పినా.. సర్కార్ బేఖాతర్
ఆర్టీఐ కమిషనర్లు, టీఎస్‌పీఎస్సీ, హెచ్‌ఆర్‌సీ అంశాలపై ఉన్నత న్యాయస్థానం సీరియస్
వ్యవస్థలను పట్టించుకోక పోవడంపై నిలదీస్తున్నా..లెక్కలేనట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు : హైకోర్టు వరుస మొట్టికాయలు వేస్తున్నా రాష్ట్ర సర్కార్ తీరులో మార్పు రావడం లేదు. ఆర్టీఐ కమిషనర్ల నియమాకం, ఎస్టీ, ఎస్టీ కమిషన్లు, మానవ హక్కుల కమిషన్, పోలీసు కంప్లయింట్స్ అథారిటీలు, స్టేట్ సెక్యురిటీ కమిషన్లకు ఆఫీస్‌లు.. ఇలా అనేక అంశాలపై విచారణ సందర్భంగా సర్కారుపై హైకోర్టు సీరియస్ అయింది. టీఎస్పీఎస్సీలో సభ్యుల నియామకం విషయంలోనూ సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా ఇవేమీ తమకు పట్టవన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ మీటింగుల్లో బిజీ అయిపోయింది. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పలు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు నెలలు అవుతున్నా.. హెచ్‌ఆర్‌సీ లేదాయే
మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్, సభ్యులు లేరు. సమస్యలు చెప్పుకోవడానికి ఆఫీసులో ఎవరూ లేని పరిస్థితి. 2019 డిసెంబర్ 24న రాష్ట్ర హెచ్‌ఆర్‌సీ మొట్టమొదటి చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య బాధ్యతలు చేపట్టారు. సభ్యులుగా విశ్రాంత జిల్లా సెషన్స్ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. వీరి పదవీకాలం గత డిసెంబర్‌తో ముగిసింది. ఆరు నెలలుగా చైర్మన్, సభ్యులు లేని కమిషన్‌గానే టీఎస్హెచ్ఆర్సీ మిగిలిపోయింది. ఏప్రిల్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ALSO READ:ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్ ప్రపోజల్.. 52 వారాల గరిష్టానికి షేరు
ఆర్టీఐపై చెప్పినా పట్టించుకుంటలే
రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకంపై కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 4 నెలలుగా ఒక్క కమిషనర్ లేకుండా సమాచార కమిషన్ ఉండీ ఉపయోగం ఏమిటని ప్రశ్నించింది. సమాచార కమిషనర్ల నియామకానికి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కమిషనర్లను ఎప్పుడు నియమిస్తారో.. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) లేదా అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) హాజరై వివరణ ఇవ్వాలని చెప్పింది. సమాచార కమిషన్‌లో 2020 ఆగస్టు నుంచి ప్రధాన కమిషనర్ లేరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అయిదుగురు కమిషనర్ల పదవీకాలం ముగిసింది. ఇప్పటికే లక్షల్లో ఆర్టీఐ అప్పీల్స్ మూలుగుతున్నాయి.
వాళ్ల అర్హతలేంటి?
టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపైనా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులైన బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్. సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, ఆరవెల్లి చంద్రశేఖర్ నియామకం పరిశీలించాలని స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులు నియామకాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ఈ నెల 16న హైకోర్టులో విచారణ జరిగింది. ఆరుగురు సభ్యుల అర్హతలు పరిశీలించాలని, మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని సూచించింది.
ఆఫీస్, స్టాఫ్, వాహనాలు ఉండాలి కదా?
పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ (పీసీఏ), స్టేట్ సెక్యురిటీ కమిషన్ (ఎస్సీ)లకు రెండు నెలల్లో ఆఫీస్‌లు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించి, వాహనాలను కేటాయించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పీసీఏ, ఎస్సీలను ఏర్పాటు చేసినా, సిబ్బందిని నియమించలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థతోపాటు న్యాయవాది మామిడి వేణుమాధవ్ వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ చైర్మన్, సభ్యులను నియమించుకోగానే కాదని.. వాళ్లు పనిచేయాలంటే ఆఫీస్, స్టాఫ్, వాహనాలు ఉండాలి కదా? అని హైకోర్టు ప్రశ్నించింది.
ఇంకెంత టైమ్ తీసుకుంటరు?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియామకం విషయంలో వివరణ ఇవ్వాలంటూ సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా సర్కారు స్పందించడం లేదు. దళిత, గిరిజన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉంటే...అక్కడ వారి గోడును వెళ్లబోసుకుంటారు. న్యాయం పొందుతారు. దళితులపై రాష్ట్రంలో దాడుల విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ కలుగజేసుకునే పరిస్థితి నెలకొన్నది. ఎస్సీ, ఎస్టీ రెండు కమిషన్లు వేర్వేరుగా చేపడుతామని ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. అయితే ఈ కసరత్తు మొదలుపెట్టి రెండేండ్లు అవుతున్నది. ఇదే విషయమై హైకోర్టు తాజాగా సీరియస్ అయింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. నియామకాలకు ప్రభుత్వం ఇంకెంత టైమ్ తీసుకుంటుందని హైకోర్టు నిలదీసింది.