- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు
- పట్టించుకోని ఆఫీసర్లు.. ఇబ్బందులు పడుతున్న జనం
- ఆరేండ్లయినా పూర్తి కాని వీపనగండ్ల– గోవర్ధనగిరి రోడ్డు పనులు
- మూడు రోజుల కింద కొల్లాపూర్ ఎమ్మెల్యేను నిలదీసిన స్థానికులు
వనపర్తి, వెలుగు: జిల్లాలో రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేస్తున్నారు. అగ్రిమెంట్ నాటికి పనులు పూర్తి చేయకుండా ముఖం చాటేస్తుండడంతో చాలా చోట్ల పనులు పెండింగ్ పడుతున్నాయి. దీంతో వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి– వీపనగండ్ల , తూంకుంట వరకు రోడ్డు నిర్మాణ పనులు ఆరేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై జనం తిరగలేక నరకయాతన పడుతున్నారు. దీంతో బుధవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు నిలదీశారు. ఆరేండ్ల కింద రూ.23 కోట్లతో శాంక్షన్ అయిన పనులను నేటికీ పూర్తిచేయని కాంట్రాక్టర్ పై చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఎక్కడి బ్రిడ్జిలు అక్కడే..
అదే విధంగా జిల్లా లోని మదనాపురం మండలం లోని సరళాసాగర్ వాగు పై మదనాపురం ఆత్మకూరు మధ్య బ్రిడ్జి నిర్మాణం గత ఎనిమిదేండ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. ఇప్పటికి రెండు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టడం లేదు. దేవరకద్ర నియోజక వర్గం పరిధిలోకి వచ్చే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. 15 రోజుల కింద ఈ రోడ్డు పై ఆత్మకూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ లెక్చరర్ బైక్‌తో సహా రోడ్డు పై నుంచి ప్రవహించిన వాగులో పడి కొట్టుకుపోయి చనిపోయాడు. బ్రిడ్జి సకాలంలో నిర్మిస్తే వ్యక్తి చనిపోయేవాడు కాదని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని కుటుంబ సభ్యు లు ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పెబ్బేరు కు వెళ్లే ప్రధాన రహదారి కూడా అధ్వాన్నంగా తయారై, చిన్నపాటి వర్షం వచ్చినా చేపలవాగు ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగేది. దీంతో 3 కిలో మీటర్ల రోడ్డు రిపేర్ కోసమని రూ.6.8 కోట్ల ను ప్రభుత్వం శాంక్షన్ చేసింది.అగ్రిమెంట్ప్రకారం.. ఈ పనులను ఎప్పుడో పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. చేపలవాగు పై బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినప్పటికీ మిగిలిన రోడ్డుపై బీటీ వేయకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం జిల్లాలో 10 బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల ఫండ్స్శాంక్షన్ చేయగా వెంకటాపూర్, చేపలవాగు, కేతేపల్లి, గోపాల్ పేట, శేరుపల్లి , జెర్రిపోతుల మైసమ్మ వాగు బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వీటిని గడువు లోపల పూర్తి చేయించడంలో ఆర్ అండ్ బీ ఆఫీసర్లు విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు కమీషన్ల కక్కుర్తితోనే..
మరో పక్క ఎమ్మెల్యేలకు కమీషన్లు ముట్టడం వల్లే వీరు కాంట్రాక్టర్ పై పెదవి విప్పడం లేదని విమర్శిస్తున్నారు. అయితే టెండర్లు పొందిన కాంట్రాక్టర్లలో చాలా మంది అధికార పార్టీ కాంట్రాక్టర్లు కావడంతో ఎమ్మెల్యేలు సైతం వారి పై ఒత్తిడి తేవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్లే పనులు చేయడం లేదని మరికొందరు ప్రజాప్రతినిధులు వారిని వెనకేసుకువస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లో రూ.100 కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు ప్రభుత్వం కట్టాల్సి ఉందని అందుకే మళ్లీ కొత్త అప్పులు తెచ్చి పనులు చేయలేకపోతున్నారని పనులు పొందిన కాంట్రాక్టర్లు చెబుతున్నారు. వెంటనే బిల్లులు చెల్లిస్తే ఏ పని ఆపమని, బిల్లుల కోసం ఏళ్లతరబడి వేచి చూడాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరునెలల్లో పనులు పూర్తి చేస్తాం
వనపర్తి జిల్లాలో ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో బ్రిడ్జిల నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. మదనాపురం మండలంలోని సరళాసాగర్ వాగుపై రూ. 9.25 కోట్లతో జరగాల్సిన పనులను కాంట్రాక్టర్ చేస్తలేడు. నోటీసులు ఇస్తాం. అదే విధంగా వనపర్తి రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన మూడు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కావచ్చింది. పెబ్బేరు వనపర్తి రోడ్డు పనుల్లో రెండు మూడు రోజుల్లో బ్లాక్ టాప్ నిర్మాణం పూర్తి అవుతుంది.
– దేశ్యానాయక్,
ఈఈ, ఆర్ అండ్ బీ, వనపర్తి