ఒక్క టీఎంసీ కూడా కష్టమే! .. మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ

ఒక్క టీఎంసీ కూడా కష్టమే! ..  మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ
  • 3 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గనున్న లిఫ్టింగ్​ కెపాసిటీ
  • మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ
  • డెడ్​ స్టోరేజీని 3 టీఎంసీలలోపు కుదించే చాన్స్​
  • సీకెంట్ ​పైల్స్​పై మరింత భారం పడకుండా చర్యలు
  • రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్​
  • కట్టినప్పటి నుంచి నాలుగేండ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే
  • అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే
  • బ్యారేజీకి రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్​డీఎస్​ఏ
  • ‘ప్రాణహిత’ను రివైవ్​ చేయడమే బెటర్​ అంటున్న ఇంజనీర్లు

హైదరాబాద్, వెలుగు:  మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి మేడిపండు చందంగా తయారైంది. బ్యారేజీకి జరిగిన డ్యామేజీతో దాని పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తామని గొప్పలు చెప్పి కట్టిన ఆ బ్యారేజీ నుంచి కనీసం ఒక్క టీఎంసీ కూడా ఎత్తిపోసే పరిస్థితి కనిపిస్తలేదని ఇంజనీర్లు అంటున్నారు. 2022లో కన్నెపల్లి పంపుహౌస్  మునిగిపోవడం, ఏడు నెలల కింద మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి ఘటనలతో అసలు భవిష్యత్​లో కొత్త ఆయకట్టును ఎంత వరకు సృష్టిస్తారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రిపేర్లు చేసినా బ్యారేజీకి గ్యారెంటీ ఇవ్వలేమని ఇప్పటికే నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) మధ్యంతర నివేదికలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే రిపేర్లు చేసినా బ్యారేజీలో కెపాసిటీ మేరకు నీటిని నిల్వ చేసి లిఫ్ట్​ చేయవస్తుందా అన్న చర్చ ఇంజనీర్స్​ సర్కిల్స్​లో నడుస్తున్నది. రోజుకు 3 టీఎంసీలు కాదు కదా.. కనీసం ఒక్క టీఎంసీ కూడా ఎత్తిపోయడం గగనమేనని పలువురు ఆఫీసర్లు అంటున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరించి కట్టుకోవడమే మార్గమని ఆఫ్​ ద రికార్డ్​లో చెప్తున్నారు. 

మేడిగడ్డ బ్యారేజీని మొత్తంగా 16.1 టీఎంసీలను నిల్వ చేసుకునేలా నిర్మించారు. డెడ్​స్టోరేజీని 5 టీఎంసీల వరకు పెట్టారు. వాస్తవానికి మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తొలుత 3 టీఎంసీల డెడ్​ స్టోరేజీతో నిర్మించాలని ప్రపోజల్​ పెట్టారు. కానీ, ఆ తర్వాత 5 టీఎంసీలకు పెంచారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. డెడ్​ స్టోరేజీ కెపాసిటీని ఎక్కువ పెట్టడం వల్లే సీకెంట్​ పైల్స్​పై భారం పడి మేడిగడ్డ బ్యారేజీ బ్రీచ్​ అయి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఫ్లడ్​ సీజన్​లో వచ్చే వరదను కుంగిన మేడిగడ్డ ఎంత మేరకు తట్టుకుంటుందన్న సందేహాలు ఇంజనీర్లలో వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీపై భారం పడకుండా స్టోరేజీ కెపాసిటీనీ భారీగా తగ్గించుకోవాల్సిందేనని రిటైర్డ్​ ఇంజనీర్లు సూచిస్తున్నారు. డెడ్​ స్టోరేజీ కెపాసిటీని కూడా 3 లేదా అంతకన్నా తక్కువకు తగ్గించేస్తేనే మేలని అంటున్నారు. దీంతో రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోయాలనుకున్న చోట ఒక్క టీఎంసీని ఎత్తిపోసుడు కూడా కష్టమేనని అధికారులు చెప్తున్నారు. టెంపరరీ మెజర్స్​కింద మేడిగడ్డ ఎగువన జియోబ్యాగ్స్​ పెట్టి నీళ్లను ఎత్తిపోయాలని కొందరు ఇంజనీర్లు సూచిస్తున్నా..  దాన్ని ఎన్ని రోజులని కొనసాగిస్తారన్న వాదన కూడా ఉంది. 

పెద్దగా ప్రయోజనం లేదు

భవిష్యత్​లో ఎక్కువ ఎకరాలకు మేడిగడ్డ ద్వారా నీళ్లివ్వడం సాధ్యపడకపోవచ్చని, బ్యారేజీ దెబ్బతినడమే ఇందుకు కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి కూడా దాని వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని పలువురు రిటైర్డ్​ ఇంజనీర్లు, నీటిపారుదల నిపుణులు చెప్తున్నారు. 37 లక్షల ఎకరాలకు (18.75 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18.25 లక్షల ఎకరాల స్థిరీకరణ) నీళ్లిస్తామని నాటి సర్కార్​ గొప్పలు చెప్పుకున్నా.. లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్లిచ్చిందిలేదు. 2022 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నాలుగేండ్లలో ఎత్తిపోసిన నీళ్లు 168 టీఎంసీలే. కరెక్ట్​గా అంచనా వేస్తే రోజుకు 3 టీఎంసీల చొప్పున ఒక ఏడాది ఫ్లడ్​ సీజన్​లో రెండు నెలల్లోనే ఎత్తిపోయాల్సిన నీళ్లను.. నాలుగేండ్లలోనూ గత సర్కారు ఎత్తిపోయలేకపోయింది. 2019లో 60 టీఎంసీలు, 2020లో 35 టీఎంసీలు, 2021లో 35 టీఎంసీలు, 2022లో మరో 38 టీఎంసీలను ఎత్తిపోసింది. మొత్తంగా 168 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసినా తిరిగి అందులో 118 టీఎంసీలు సముద్రంపాలే అయ్యాయి. 2022 జులైలో వచ్చిన వరదలతో కన్నెపల్లి పంపుహౌస్  మునిగిపోయింది. పాడైపోయిన పంపులు, మోటార్ల రిపేర్లూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి నీళ్లను ఎత్తిపోసిందీ లేదు. వచ్చిన వరదను వచ్చినట్టే బ్యారేజీల నుంచి కిందికి వదిలేశారు. ఇక, నిరుడు అక్టోబర్​లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ బుంగలు పడడంతో భవిష్యత్​లో వాటితో ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతున్నది. 

‘ప్రాణహిత’నే ప్రత్యామ్నాయం

16.40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో 2008లో ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం అనుమతులిచ్చింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి 160 టీఎంసీలను ఆ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని భావించారు. అయితే, ఐదు ప్యాకేజీల పనులు పూర్తయ్యాక ఆ ప్రాజెక్టును.. గత బీఆర్​ఎస్​ సర్కార్​ పక్కనపెట్టేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రాణహిత ప్రాజెక్టునూ రివైవ్​ చేయాల్సిన అవసరముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తుమ్మిడిహెట్టి వద్ద కాకుంటే మరో ప్రాంతంలోనైనా ప్రాణహిత నదిపై బ్యారేజీ కట్టి నీటిని తోడుకుంటే మేలు కలుగుతుందన్న చర్చ జరుగుతున్నది. మేడిగడ్డను అలాగే వదిలేయకుండా బ్యారేజీ తట్టుకునే స్థాయిలో వీలైనంత మేరకు నీటిని స్టోర్​ చేసుకుని దాని ద్వారా ఎంత ఎత్తిపోసుకోవస్తుందో అంత తోడుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. దానికి తోడు ప్రాణహిత రివైవల్​ ద్వారా అదనంగా నీటిని తీసుకుంటే కొత్త ఆయకట్టును సృష్టించేందుకు వీలవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2015లో అనంతరాములు నేతృత్వంలో వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందన్న చర్చ జరుగుతున్నది.