
కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రూ.50,65,345 కోట్ల బడ్జెట్ గ్రామీణ పేదల పొట్టకొట్టి బడా కార్పొరేట్ల కడుపు నింపే విధంగా ఉంది. బడ్జెట్ సమావేశాల కంటే ముందు ఆర్బీఐ, ఎన్ఎస్ఎస్ సర్వే రిపోర్టులు పేదల కొనుగోలు శక్తి పడిపోయిందని, నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం రేటు 11శాతానికి పెరిగిందని, నిరుద్యోగం 7% పైగా పెరిగిందని పేర్కొన్నాయి.
భారతదేశ జనాభా 143 కోట్లలో 100 కోట్ల మంది రోజువారీ ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక అప్పులు చేస్తున్నారని, కానీ, 10 శాతం కార్పొరేట్ల దగ్గర 57.7% సంపద పోగైందని బ్లూమే వెంచర్స్ రిపోర్టు 2024 పేర్కొన్నది. నివేదికల ఆధారంగా ప్రజలకు శక్తిని పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని అందరూ ఆశించారు. అయితే ఆచరణలో పేదల సంక్షేమానికి రాయితీలపై కోత విధించి కార్పొరేట్ వ్యవస్థకు రాయితీలు పెంచారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ప్రత్యేక నిధుల గురించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడకపోవడం ఆందోళనకరం.
దేశ జీడీపీలో వాటా 16% పైగా వ్యవసాయ రంగం నుంచి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2013–14 లో ఉపాధి కల్పన 44.1 శాతం ఉండగా 2023–24 నాటికి 46.1 శాతానికి పెరిగింది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 76% మందికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి రంగాన్ని ఆదుకోవడం కోసం బడ్జెట్లో నిధులు పెంచకపోగా గతంలో కేటాయించిన నిధులకు భారీ కోత విధించారు.
వ్యవసాయ రంగానికి రూ.10 వేల కోట్లు ఈ బడ్జెట్లో తగ్గించారు. గత బడ్జెట్లో యూరియాకు రూ.1.19 లక్షల కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ. 1.08 లక్షల కోట్లకు కుదించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తూ చట్టం తీసుకురావాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలి. అన్ని పంటలకు బోనస్, బీమా సౌకర్యం కల్పించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోకపోవడం చూస్తే రైతే రాజు అని చెప్పే ప్రధాని మోదీ మాటలు బూటకం అని తేలుతోంది.
బడా కార్పొరేట్లకు రాయితీలు
బడా కార్పొరేట్లకు పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించారు. ఆర్బీఐ రిపోర్ట్ 2024 ప్రకారం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ 11 సంవత్సరాల్లో రూ.16.61 లక్షల కోట్లను పారు బకాయిల పేరుతో రద్దు చేశారు. మొత్తం అప్పుల్లో 16 శాతం రికవరీతో రుణమాఫీ పొందిన బడా కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలు 50 శాతం పైగా ఉన్నారు. కానీ, దేశానికి అన్నం పెడుతున్న 18.74 కోట్ల మంది రైతాంగం చేసిన అప్పు 32 లక్షల కోట్లు రద్దు చేయమని దేశవ్యాప్తంగా రైతాంగం గొంతెత్తి నినదించినా.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వీటి రద్దుకు సిద్ధపడలేదు.
పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇతర సంక్షేమ పథకాలు అమలుచేయడం వలన ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా సోమరిపోతులవుతున్నారు అని కామెంట్ చేసిన సుప్రీంకోర్టుకు కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు కనపడకపోవడం శోచనీయం. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం ఐక్యంగా పోరాడి తిప్పికొట్టిన మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన అమలుకు కుట్ర చేస్తోంది. వ్యవసాయ మార్కెట్ ముసాయిదా చట్టంను రిలీజ్ చేసింది.
ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి తప్పుకోవాలని...
దేశంలో 89.95 లక్షల కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 89.95 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులలో 2.81 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రజా పాలనలో మరో 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లుగా రాష్ట్ర మంత్రి ఉత్తమకుమార్ ప్రకటించారు. వీరందరికీ మనిషికి 5 కేజీల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. బడ్జెట్లో నిధులు పెంచకపోగా ఉన్నవాటికి కోత విధించారు. గత బడ్జెట్లో 2.75 లక్షల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 2.04 లక్షల కోట్లకు కుదించింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు సంవత్సరానికి రెండు కోట్ల ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం ఆచరణలో దానికి తగిన నిధులను కేటాయించలేదు. పైగా గతంలో కేటాయించిన నిధులు కోత విధించారు. గతంలో ఈ పథకానికి 54,500 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 32,486 వేల కోట్లకు కుదించారు.
కార్మిక హక్కులపై దాడి చేసే విధంగా బడ్జెట్
అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా 44 కార్మిక చట్టాలను కార్మికులు సాధించుకున్నారు. వీటిలో 29 చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్లుగా మార్చి అమలుచేయాలని ప్రయత్నిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చామని ప్రచారం చేసుకోవడం వట్టి బూటకం. ఆచరణలో 30 శాతం పన్ను వసూలు చేయాలని చెప్పడం మోసం చేయడమే. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత మన దేశ అప్పు మూడు రెట్లు పెరిగి రూ.1.90 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇది దేశ జీడీపీలో 56.1%గా ఉంది. 2018–19లో ఒక కుటుంబ అప్పు రూ.46,898 వేలుగా ఉంటే 2023–2024 నాటికి రూ.86,713కు పెరిగింది. అంటే 50% పైగా కుటుంబాలకు పెరిగింది. ఇది జీడీపీలో 41 శాతంగా ఉంది. మరోవైపు 10% గా ఉన్న కార్పొరేట్ల సంపద 57.7 శాతానికి పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ఓ) వారానికి 55 గంటల మించి పనిచేస్తే ఉద్యోగి మానసిక స్థితి దెబ్బతింటుందని, ఆరోగ్యం పాడవుతుందన్న ప్రకటనను పాలకులు పరిగణనలోకి తీసుకోవడం లేదు .
పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. డిమానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ సంస్థలను, వాటాలను, భూములను అమ్మకానికి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే ఎల్ఐసీబీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరిచారు.
ఉపాధి హామీకి భారీ కోత
గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పనికి గత సంవత్సరం ఖర్చు చేసిన రూ. 89,154 లక్షల కోట్లను కుదించి రూ.86 లక్షల కోట్లను కేటాయించారు. మరోపక్క 7.5 కోట్ల జాబ్ కార్డులను
వివిధ కారణాలతో తొలగించామని పార్లమెంటులో ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పథకం అమలువల్లనే ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా 2008 ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిందని అనేకమంది ఆర్థిక నిపుణులు చెప్పారు.
కరోనా కాలంలో పట్టణాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు పట్టణాల నుంచి గ్రామాలకు వలస వచ్చిన ఆరు కోట్ల మందికి పైగా కార్మికులకు కడుపు నిండా తిండి పెట్టిందని బీజేపీ ప్రభుత్వమే నాడు ప్రకటించింది. జాబ్ కార్డుదారులందరికీ పని కల్పించాలంటే బడ్జెట్లో రూ. 2.50 లక్షల కోట్లు కేటాయించాలన్న ప్రజా సంఘాల డిమాండ్‌ను పక్కన పెట్టారు.
పని దినాలు 200 రోజులకు, రోజు కూలి రూ.800కు పెంచాలి, పట్టణ ప్రాంత పేదలకు ఉపాధి హామీ పనులు పెట్టాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. కేరళలోని వామపక్ష సీపీఎం ప్రభుత్వం మాత్రమే ప్రత్యేక నిధులను కేటాయించి పట్టణ ప్రాంతాలలో పేదలకు ఉపాధి పని పెడుతున్నారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం 726 రూపాయలు అమలుచేస్తున్నారు.
-బి. ప్రసాద్,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం