ట్విట్టర్ ని కొనుగోలు చేసినప్పటినుంచి ఎలన్ మస్క్ ప్రక్షాళన మొదలుపెట్టాడు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ నుంచి బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ వరకు రోజుకొక కొత్త నిర్ణయం తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే, తాజాగా ఐఫోన్ యూజర్లపై తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ కోసం వినియోగదారులు 8 డాలర్ల చెల్లించాలని అక్టోబర్ నెలలో కొత్త రూల్ పాస్ చేశాడు. అయితే, ఇప్పుడు ఐఓఎస్ వాడేవాళ్లంతా బ్లూ టిక్ సబ్ స్క్రిప్సన్ కోసం రూ. 900 చెల్లించాలని కొత్త నిబంధన తీసుకొచ్చాడు.
అయితే, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాప్‌ల ద్వారా చేసే పేమెంట్స్‌పై యాపిల్ కంపెనీ 30శాతం కోత విధించింది. దీనిపై వ్యతిరేకంగా ‘యాపిల్ కంపెనీకి కమీషన్ కట్టేబదులు యుద్దానికి వెళ్దాం’ అని పోస్ట్ చేశాడు. ‘గో టూ వార్’ అనే మీమ్స్ ని కూడా ట్యాగ్ చేశాడు. యాపిల్ నిర్ణయాలకు కౌంటర్‌గా మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ నిర్ణయం వల్ల యాపిల్ కంపెనీకి ఎలా నష్టం కలుగుతుందో గానీ, వినియోగదారులపై మాత్రం భారం పడుతుంది.