రాహుల్.. చలి.. ఓ ప్రొటీన్! : హన్మిరెడ్డి యెద్దుల

రాహుల్.. చలి.. ఓ ప్రొటీన్! : హన్మిరెడ్డి యెద్దుల

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర షురూ జేసినప్పటి నుంచీ యాత్రలోని అసలు ముచ్చట్ల కంటే కొసరు ముచ్చట్లే ఎక్కువగా సోషల్ మీడియాల, అసలు మీడియాలో చక్కర్లు కొడ్తున్నయ్. నూటా ఎనిమిది దినాలు. కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా 3,122 కిలోమీటర్లు. ఎండ కొట్టినా.. చలివెట్టినా.. వాన పడినా.. అదే డ్రస్– టీషర్ట్, ప్యాంట్. యాభై యేడేండ్ల బ్యాచిలర్ లీడర్ రాహుల్ గాంధీకి సలిపెడ్తలేదా? ఉక్కపోస్తలేదా? అసలు ఆ టీషర్ట్ లోనే ఏదో ఉంది. ఉక్కపోయకుండా కూల్ గా ఉండే టెక్నాలజీ అందులో ఉందని కొందరు, సలిపెట్టకుండా హీటింగ్ టెక్నాలజీ ఉందని మరికొందరు.. ఇట్లా ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహాగానాలు సాగించారు. యాత్రలో రాహుల్ వేసుకుంటున్న తెల్ల టీషర్ట్ బ్రిటన్ కంపెనీ బబరీకి చెందిన లగ్జరీ టీషర్ట్ అని, దాని రేటు రూ. 41 వేలపైనే అంటూ బీజేపోళ్లు మొదట్లోనే విమర్శలు షురూ జేసిండ్రు. యాత్ర ఢిల్లీకి చేరేసరికి గజగజ వణికే చలి. ఏడు డిగ్రీల సల్లటి ఇగంలో కూడా రాహుల్ గాంధీ ఢిల్లీల టీషర్ట్, ప్యాంట్ తోనే తిరగడంతో కాంగ్రెసోళ్లకు ఆయనలో ఒక సూపర్ హ్యూమన్, యోగి, శ్రీరాముడు కన్పించిండు. స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్ లు పెట్టుకున్నా, ఢిల్లీలో చలికి తామంతా గజగజా వణుకుతుంటే.. రాహుల్ జీ మాత్రం కేవలం టీషర్ట్, ప్యాంట్ వేసుకుని నెహ్రూ, ఇందిర, రాజీవ్, వాజ్ పేయి సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారని, ఆయన సూపర్ హ్యూమన్ అని, రాముడు, యోగి అంటూ ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షిద్ యువ నాయకుడిని ఆకాశానికెత్తేసిండు. రాహుల్ గాంధీ రాముడిలాంటి వాడని.. శ్రీరాముని పాదుకలను భరతుడు తీసుకెళ్లినట్టుగా.. తాము రాహుల్ పాదుకలను యూపీకి తెచ్చామని, తర్వాత రాముడు(రాహుల్) వస్తాడనీ స్వామిభక్తిని సైతం చాటుకున్నడు. కాంగ్రెస్ చోటా మోటా నేతలు, కార్యకర్తలు కూడా తమ నాయకుడి ఫిట్ నెస్ చూసి అబ్బురపడుతూ సోషల్ మీడియాను పోస్టులతో ముంచెత్తిండ్రు. ఇదీ మా నాయకుడి దమ్ము.. ఇది మీ లీడర్లలో ఉందా? అంటూ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను వెక్కిరించిన్రు. అయితే, ఈ దేశంలో కార్మికులు, రైతులకు చలి పెట్టడం లేదా? అని మాత్రం ఎవరూ అడగరని, తనకు చలిపెడుతోందా? లేదా? అని ఫోకస్ మాత్రం పెడుతున్నరంటూ రాహుల్ ఎర్రకోట వద్ద స్పీచ్ సందర్భంగా మీడియాకు గట్టిగనే బదులిచ్చిండు. అయినా సరే.. రాహుల్ కు చలి ఎందుకు పెడ్తలేదన్న చర్చ మాత్రం ఆగనే లేదు.

అసలు ముచ్చట ఏందంటే..

మనలో కొంతమంది కొంచెం చలికి, కొంచెం వేడికే అల్లాడిపోతుంటరు. మరికొందరు కొంచెం ఎక్కువ చలికి, ఎక్కువ వేడికీ తట్టుకుంటుంటారు. ఇట్ల ఒక్కొక్కళ్లకు ఒక్కోలా ఎందుకైతున్నదన్న డౌట్.. స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్ స్టిట్యూట్  సైంటిస్టులకు కూడా వచ్చింది. ఇంకేం.. నిరుడు రాత్రీ పగలూ కష్టపడి రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చివరకు.. ఆల్ఫా యాక్టినిన్–3  అనే ప్రొటీనే దీనికంతటికీ కారణమని తేల్చిండ్రు. కొంతమందికి స్కెలెటల్ మజిల్ ఫైబర్స్(బోన్స్ పై ఉండే కండరాల్లోని ఫైబర్స్)లో ఆల్ఫా యాక్టినిన్–3 అనే ప్రొటీన్ ఉండదని, అందుకే వారు విపరీతమైన చలిని, వేడిని తట్టుకోగలుగుతున్నారని కనిపెట్టిండ్రు. ఆటల్లో అథ్లెట్లు రాణించేందుకు కీలకంగా భావించే ఏసీటీఎన్3 జీన్ ద్వారా ఈ ప్రొటీన్ ఎన్ కోడ్ అవుతుందట. ఈ ప్రొటీన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 800 కోట్ల మంది జనంలో దాదాపు150 కోట్ల మందికి లేదని కూడా సైంటిస్టులు అంచనా వేశారు. అయితే, రాహుల్ గాంధీ బాడీలోని స్కెలెటల్ మజిల్ ఫైబర్స్ లో కూడా ఈ ఆల్ఫా యాక్టినిన్–3 అనే ప్రొటీన్ లోపించి ఉంటుందా? లేదా? అన్నది మాత్రం చెప్పలేం!

- హన్మిరెడ్డి యెద్దుల, సీనియర్ జర్నలిస్ట్