నేడు ప్రతి నగరం ఒక కాలుష్య కాసారంలా మారుతున్నది. వాహనాలు, భవన నిర్మాణాలు, పరిశ్రమలు, చెత్త కాల్చడం వంటి భారీ ‘కాలుష్య’ కారణాలతో పాటు, విమానాల వల్లా కాలుష్యం వెలువడుతున్నది. విమానాల పొగలో సాధారణ రోడ్డు వాహనాల్లో ఉండే కర్బన ఉద్గారాలతో పాటు కొన్ని ప్రమాదకర వాయువులు ఉంటాయి. అదీ గాక, ఈ పొగ ఎక్కువ శాతం నేరుగా ఆకాశంలో వెలువడుతున్నది. రోడ్డు మీద సాగే వాహన పొగ కాలుష్యం రోడ్డు మీద ఉండే వ్యక్తుల మీద, చుట్టు పక్కల వారి మీద నేరుగా ప్రభావం చూపితే, విమానం పొగ ప్రభావం విస్తృత స్థాయిలో ఉంటుంది. ఒక దేశ విమానం సరిహద్దులు దాటి ఇంకెక్కడో కాలుష్యం చేస్తోంది. సాధారణ ప్రయాణికుల విమానాలతో పాటు, రవాణా, రక్షణ శాఖ, ప్రైవేటు విమానాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
కాలుష్యం ఏ విమానం వల్ల ఎక్కువ జరుగుతోందనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు.. ప్రయాణికులకు ఆపాదించడం ఒక ఆనవాయితీగా మారింది. ఒక విమానం 200 మంది ప్రయాణికులతో బయలుదేరితే జరిగే కాలుష్యం ఈ 200 మందితో గుణించి సగటు లెక్కలతో అంచనా వేస్తారు. 200 మంది ప్రయాణికుల విమానం కన్నా ఒకరిద్దరిని తీసుకువెళ్లే విమానాల వల్ల కాలుష్యం పెరుగుతున్నది. ఒక్కరు ఇద్దరు కొరకు ఇంత ‘ఖర్చు’ అవసరమా అనే ప్రశ్న వస్తున్నది. సంపన్నుల ఇంట్లో నలుగురు ఉంటే 4 లేక 5 కార్లు వాడుతున్నట్లు, వ్యక్తిగత విమానాల మీద, వ్యక్తిగత విమాన ప్రయాణాల మీద మోజు ప్రపంచమంతా పెరిగింది. ప్రపంచ కుబేరులు తమ సొంత విమానంలోనే ప్రయాణిస్తున్నారు.
2021 లో COP26 క్లైమేట్ చేంజ్ మీద జరిగిన సదస్సుకు ప్రైవేటు జెట్లలో వెళ్లిన ప్రపంచ నేతలు, ఇతర ప్రతినిధుల సంఖ్యపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కార్గో, సాధారణ లేదా స్థానిక ప్రయాణాలను మినహాయించి, ఆ సదస్సు సమయంలో దాదాపు182 వ్యక్తిగత విమానాలు నడిచాయని తేలింది. ఇందులో బైడెన్ విమానం, ఎయిర్ఫోర్స్ వన్ వంటి కొన్ని జాతీయ చార్టర్డ్ విమానాలు ఉన్నాయి. నవంబర్1 వరకు నాలుగు రోజుల్లో గ్లాస్గో పరిసర ప్రాంతాలకు ప్రైవేట్ జెట్ లేదా వీఐపీ విమానాలతో కూడినవి మొత్తం76 చేరుకున్నాయని ఏవియేషన్ ఎనలిటిక్స్ సంస్థ సిరియం తెలిపింది.
టన్నుల్లో కార్బన్డయాక్సైడ్
విమానాలు ఇంధనాన్ని కాల్చడం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు, కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఇవి భూమి ఉష్ణోగ్రత పెంచుతున్నాయి. ప్రైవేట్ జెట్లు సాధారణంగా వాణిజ్య విమానాల కంటే ఒక ప్రయాణికుడికి సగటున గణనీయంగా ఎక్కువ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రైవేట్ జెట్లలో సెస్నా సైటేషన్ ఎక్స్ఎల్ఎస్ నమూనా- అత్యంత ప్రాచుర్యం పొందిన నమూనాల్లో ఒకటి. ఇది సగటున గంటకు189 గ్యాలన్ల (857 లీటర్లు) విమాన ఇంధనాన్ని మండిస్తుంది. COP26 సదస్సుకు చేరుకోవడానికి జీ20 నాయకుల్లో కొంతమంది రోమ్ నుంచి గ్లాస్గోకు ప్రైవేట్ జెట్ లో చేసిన ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 2.45 గంటలు. దీనికి 2,356 లీటర్ల జెట్ ఇంధనం అవసరం.
ప్రతి లీటర్ ఏవియేషన్ టర్బైన్ ఇంధనానికి 2.52 కిలోల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుందని అంచనా. ఆ విమానం 5.9 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. విమానాల ‘గరిష్ట వాతావరణ ప్రభావాన్ని పట్టుకోవడానికి’ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల గణాంకాలను1.9తో గుణించాలని శాస్త్రీయ సిఫారసు ఉన్నది. అధిక ఎత్తులో విమానాలు విడుదల చేసే నాన్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది వార్మింగ్ ప్రభావాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా వ్యక్తిగత విమానం వల్ల మొత్తం ఉద్గారాలు11.3 టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానం. తొమ్మిది మంది ప్రయాణికులు ఉంటే, సగటున ఒక్కరు1.2 టన్నులకు
బాధ్యత వహిస్తారు.
కుబేరులు వాడుతున్న విమానాలతో..
2022 మే నెలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు1,040 ప్రైవేటు విమానాలు వచ్చాయి. ఈ విమానాలు విడుదల చేసిన కాలుష్య ఉద్గారాల పరిమాణం దాదాపు 9.7 కిలోటన్నుల కార్బన్ డై ఆక్సైడ్. పారిస్ నుంచి దావోస్ (సుమారు 750 కిలోమీటర్లు)కు 35,000 సగటు కార్లు ప్రయాణిస్తే ఇంతే మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అంటే, వెయ్యి అంత కంటే లోపు ఉన్న ప్రతినిధుల(కొందరు 2-3 ట్రిప్పులు చేశారు) ప్రయాణం 35 వేల కార్ల సరి సమాన స్థాయి కాలుష్యానికి కారణం అయ్యారు. విమానయానం వల్ల వాతావరణ దుష్ప్రభావం ఎక్కువ అవుతున్నది. వేగంగా పెరుగుతోంది. విస్తుగొలిపే విషయం ఏమిటంటే, కేవలం కొద్ది మంది వ్యక్తుల వల్ల కలుగుతున్నది.
ప్రపంచ వైమానిక ఉద్గారాల్లో 50% కాలుష్యం కేవలం1% జనాభా చేస్తున్న ప్రయాణాల వల్ల అవుతున్నది. ఎందుకు వీళ్లు ఇట్లా చేస్తున్నారు? ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ప్రైవేటు విమానంలోనే ప్రయాణం చేస్తాడు. తమ విలాసవంతమైన జీవితం కోసం, అహంభావం ప్రదర్శిస్తూ, సగటు వాణిజ్య విమానాల ప్రయాణాలను నిరాకరిస్తున్నారు. భూగోళం మీద కాలుష్యం మేఘాలు కమ్ముకోవడానికి కారణమవడంలో నిస్సిగ్గుగా ముందుంటున్నారు.
బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి..
ఈ రకం సంపన్న ప్రయాణికుల్లో సినిమా తారలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, దేశాధినేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ప్రపంచ కుబేరులు తమ సంపద ప్రదర్శనకు ప్రైవేటు విమానాలను వాడుతుంటే, రాజకీయ నాయకులు ప్రజా ధనం వాడి దర్పం ప్రదర్శిస్తున్నారు. మన దేశంలో కూడా ప్రైవేటు విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. ఈ తోవలో తెలంగాణ సీఎం కూడా ఉన్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి 2022లో 1,607 ప్రైవేటు విమానాలు ఎగిరాయని అందుబాటులో ఉన్న సమాచారం చెబుతున్నది. శంషాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు ఒప్పందంలో 150 కిలోమీటర్ల పరిధిలో వేరే వాణిజ్య విమానాశ్రయానికి అనుమతి లేదు. అందువల్ల, నగరం నడిబొడ్డులో ఉన్న బేగంపేట విమానాశ్రయం నుంచి కేవలం ప్రైవేటు విమానాలకు మాత్రమే అనుమతి ఉన్నది.
ఒప్పందం ప్రకారం అది కూడా సాధ్యం కాదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు జీఎంఆర్బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రైవేటు విమానాల రాకపోకలు ఇక్కడ నుంచి అధికమయ్యాయి. ఎవరు ఈ ప్రైవేటు విమానాలను ఉపయోగిస్తున్నారు? ఎవరివి ఈ విమానాలు? కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విమానం ఇన్ని ట్రిప్పులు చేస్తున్నదా? సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినా ఈ ప్రశ్నలకు జవాబు దొరకలేదు. కొందరు తెలుగు సినీ తారలకు ప్రైవేటు విమానాలు ఉన్నాయని తెలుసు. వాళ్లతో పాటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఈ సదుపాయం ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. 2022లో ప్రతి ట్రిప్పుకు ఇద్దరు మాత్రమే సగటు ప్రయాణికులు ఉన్నారు. 2023 మొదటి ఆరు నెలలకు ఇది మూడుకు చేరింది. ఫిబ్రవరిలో కేవలం 29 విమాన ట్రిప్పులకు 29 మంది మాత్రమే ప్రయాణించారు.
ఆశ్చర్యంగా జూన్ లో 125 ట్రిప్పులకు 440 ప్రయాణికులు ఉన్నారు. బహుశ అధికార పార్టీ మహారాష్ట్ర నుంచి కొందరిని హైదరాబాద్ కు తీసుకొచ్చిన సందర్భంలో ఈ సంఖ్య వచ్చినట్లుంది. 2021లో జులై – డిసెంబర్ మధ్య 1,089 ట్రిప్పులకు1,695 ప్రయాణికులు ఉన్నారు. అంటే, రోజుకు 6 విమానాలు బేగంపేట ఎయిర్పోర్ట్నుంచి రాకపోకలు సాగిస్తున్నాయన్నట్టు.
మరో ఎయిర్పోర్ట్ ఎందుకు?
భారతదేశంలో వ్యక్తిగత విమాన ప్రయాణాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే వ్యక్తిగత వాహనాల వల్ల కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విధానాల్లో మార్పు తేకుండా, సమగ్రత, సుస్థిరత ప్రణాళిక గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విమానాల ఉపయోగానికి ప్రోత్సాహం అందించాలని ఉత్సాహపడుతున్నది. అధిక కాలుష్యం విడుదల చేసే భారీ ఎస్యూవీ వాహనాలను మాత్రమే ఉపయోగించే సంపన్నులకు ఈ ధోరణి అవకాశంగా మారనుంది. ఇప్పటికే, హైదరాబాద్ నగరంలో కొన్ని కుటుంబాలకు 20 నుంచి 30 కార్లు ఉన్నాయి.
అలాంటి వారికి, ఒక విమానం కొనడం పెద్ద సమస్య కాదు. 700 ఎకరాల్లో బేగంపేట విమానాశ్రయం, 5,500 ఎకరాల్లో శంషాబాదు విమానాశ్రయం ఉండగా రక్షణ శాఖ వాడుతున్న హకీంపేట్ విమానాశ్రయం కావాలని రాష్ట్ర మంత్రి కోరినందున ప్రైవేటు విమానాల వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని అర్థమవుతున్నది. ఇదే మంత్రి ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు పోవడం మనం చూస్తున్నాం. ఎక్కడైతే సంపన్నులు, సంపన్న దేశాధినేతలు ఒక్కొక్కరు ఒకే విమానంలో వస్తుంటారో, అలాంటి హంగు, ఆర్భాట జీవనశైలి మీద ఆశ మన తెలంగాణ రాష్ట్ర ప్రతినిధికి కలిగితే అది మన దురదృష్టం. హైదరాబాద్ మీద కప్పుతున్న వాయు కాలుష్యంలో వ్యక్తిగత వాహనాలే కాదు, విమానాల పాత్ర కూడా ఉన్నది.
- డా. దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్