రోజుకో కొత్త మండల ప్రతిపాదన తెరపైకి..

రోజుకో కొత్త మండల ప్రతిపాదన తెరపైకి..

రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు

ఆదిలాబాద్, వెలుగు :  కొత్త మండలాల ఏర్పాటు కోసం ఆదిలాబాద్​ జిల్లాలో రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం   జూలైలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయంతో  రాష్ట్రంలో చాలాచోట్ల కొత్త మండలాల లొల్లి మొదలైంది. అన్ని అనుకూలతలు ఉన్నా తమ గ్రామాలను మండలాలుగా ప్రకటించకపోవడంతో చాలాచోట్ల ఆందోళనలు జరిగాయి.  ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలున్నాయి.  పాలనాసౌలభ్యం, రవాణా తదితర అంశాల ఆధారంగా జిల్లాలో మరిన్ని మండలాలను  ఏర్పాటు చేయాలని అధికారులు పంపిన  ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో ఆయా గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సొనాల, సాత్నాల  మండలాల గురించి ఆ గ్రామాల ప్రజలు పోరాడుతున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ లో  ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సొనాల, సాత్నాల మండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు.  

చొరవ చూపేవారులేక.. 

 కొత్త మండలాల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ దగ్గరకు తమ ప్రపోజల్స్​ తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయించుకున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోన్కల్ మండలం కోసం ఆందోళన చేసిన మండల సాధన సమితి నాయకులను   పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరకు తీసుకెళ్లి హామీ ఇప్పించారు. కానీ ఆదిలాబాద్ జిల్లా నేతలు మాత్రం చొరవ చూపడంలేదు.  సొనాలలో  దీక్షలు చేస్తున్న వారికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మొదట్లో  సంఘీభావం తెలిపారు. కానీ ఆతర్వాత మౌనం వహించారు.  ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్  నియోజకవర్గాల్లో కొత్త  మండలాల కోసం ఆరు చోట్ల ఉద్యమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు  సర్కార్ మీద  ఒత్తిడి చేయకపోవడంవల్లే రెండు నెలలుగా తాము పోరాడాల్సివస్తోందని మండల సాధన కమిటీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త మండలాల కోసం తీర్మానాలు 

బోథ్ మండలంలోని సోనాల, జైనథ్ మండలంలోని సాత్నాల కేంద్రంగా కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందటే ప్రతిపాదనలు పంపినా..   కార్యరూపం దాల్చలేదు. గత రెండు నెలల నుంచి సోనాల మండలం కోసం రిలే దీక్షలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.  జైనథ్ మండలంలోని సాత్నాల,  భోరజ్ లను మండలాలుగా  ఏర్పాటు చేయాలని ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ ను మండలంగా ప్రకటించాలని ఈనెల 14న ఆయా గ్రామాల ప్రజలు, సర్పంచ్, ఎంపీటీసీలు తీర్మానం చేశారు. ఇదే మండలంలో నాగోబా ఆలయమున్న కేస్లాపూర్ ను మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇందుకోసం నాగోబా దర్బార్ లో బుధవారం సమావేశం కానున్నారు.  చుట్టుపక్కల 60 ఊళ్లలో గ్రామాల్లో కేస్లాపూర్ పెద్ద గ్రామమని,  దీన్ని మండలంగా ప్రకటించాలన్న  డిమాండ్ పెరుగుతోంది.  

సొనాల మండలం అవసరమే

సొనాలను మండలం కోసం  రెండు నెలలుగా ఆందోళన  చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మండలంగా ఏర్పడితే  ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.  గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇక్కడి ప్రజాప్రతినిధులు సర్కార్ పై ఒత్తిడి తీసుకురావాలి. కొత్త మండలంగా ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమం ఆగదు. 

– దామెర్ల రాంరెడ్డి, సొనాల