ప్రతిరోజు హైదరాబాద్ నగర వార్తలలో చెరువుల ఆక్రమణ వార్త నిత్యకృత్యం అయిపోయింది. తెలంగాణావ్యాప్తంగా ఇతర నగరాలలో కూడా ఇదే పరిస్థితి. మెట్ట ప్రాంతం, సముద్రానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశం, డెక్కన్ పీఠ భూమిలో.. చుట్టూ భూమి, ఇతర రాష్ట్రాలు ఉన్న తెలంగాణా రాష్ట్రం స్వతహాగా వర్షపు నీరు మీద ఆధారపడాల్సిందే. వర్షం పడితేనే నీరు, లేకుంటే కరువు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికే చెరువుల నిర్మాణానికి మన పూర్వీకులు శ్రీకారం చుట్టారు.
ఆధునిక కాలంలో సాంకేతికత వాపుని బలుపుగా భావించి అహంకారంతో నీటి వనరులను ధ్వంసం చేసుకుంటున్నాం. వర్షపు నీరు పట్టుకుని వాడుకునే వ్యవస్థలో చారిత్రాత్మకంగా, ఇప్పటికీ చెరువుది కీలక భూమిక ఉన్నది. చెరువులు ఉంటేనే చల్లదనం, పచ్చదనం, ఆహారం, జీవ వైవిధ్యం నిలుస్తాయి. అటువంటి చెరువులకు మన రాష్ట్రంలో ప్రాధాన్యత లేకపోవడం విచారకరం.
వ్యాపార వస్తువుగా ‘భూమి’
చెరువుల దురాక్రమణ ఎవరు చేస్తున్నారు? చెరువులను కలుషితం చేస్తున్నది ఎవరు? చెరువుల మీద భవనాలు, వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. నీటి వనరులను భూములుగా మార్చే ప్రక్రియను భూమిని వ్యాపార వస్తువుగా భావించే రియల్ ఎస్టేట్ రంగం చేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో అన్ని రకాల వ్యాపారస్తులు ఉండవచ్చు. కొందరు మాత్రం చెరువులను ఆక్రమించి వ్యాపారం చేయడాన్ని ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల సంఘం ఖండించలేదు. స్వీయ నియంత్రణ అసలే లేని ఈ రంగం పోటీపడి ప్రభుత్వ భూములను, సామూహిక అవసరాలకు ఉపయోగపడే భూమిని తమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. వీరిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. రాజకీయ నేతల జీవనోపాధిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మారింది. వీళ్లకు తోడుగా అవినీతి అధికారులు అన్ని స్థాయిలలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి పనిచేస్తూ, అడ్డగోలు సం పాదన కోసం ప్రకృతి విధ్వంసానికి తోడ్పడుతున్నారు.
అమలుకాని రక్షణ చట్టాలు
చెరువుల రక్షణకు చట్టాలు ఉన్నా అమలు కావడం
లేదు. కొన్ని లొసుగులు అడ్డం పెట్టుకుని చెరువులను కలుషితం చేస్తున్నారు, ఆక్రమిస్తున్నారు. దాదాపు 30 ఏండ్ల క్రితం ప్రభుత్వమే బస్ స్టాండ్లు, రోడ్ల విస్తరణకు, రైలు మార్గానికి చెరువులను ఉపయోగించుకున్నది. ఇప్పటికీ చెరువు కంటే రోడ్డుకు ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తున్నాం. అన్ని రకాల ఉపయోగాలకు, దుర్వినియోగాలకు చెరువుల భూములను వాడుకోవడం సాధారణం అయిపోయింది. నీటి లభ్యత గురించి ఆందోళన పడితే ఇంకొక ఆనకట్ట కట్టి, వందల కిలోమీటర్ల పైపులైన్లు వేసి నీళ్లు ఇవ్వడానికి, దాని మీద వేల కోట్లు పెట్టడానికి సిద్ధపడే ప్రభుత్వం దగ్గరలో నీటి వనరుల రక్షణకు సిద్ధంగా లేదు. చెరువుల వల్ల వచ్చే ప్రయోజనాల గురించి అవగాహన లేక కాదు. వారికి వచ్చే ద్వంద్వ ప్రయోజనాల మీద దృష్టి సారించడం పాలకులకు అలవాటు అయిపోయింది. చెరువు భూమి వ్యాపారానికి పనికివస్తుంది, అక్కడ ఆనకట్ట నిర్మాణం పేరిట కోట్ల రూపాయిలను దండుకోవచ్చు. ఆశ్చర్యం ఏమంటే.. నీటి ప్రాజెక్టులు కట్టడానికి గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించే పాలకులు చెరువుల ఆక్రమణలను పట్టించుకోకపోవటం గర్హనీయం.
నీటివనరులు ఎన్ని ఉన్నాయి?
కేంద్ర జల మంత్రిత్వ శాఖ 2017-–19 మధ్యలో నిర్వహించిన చిన్న నీటి వనరుల గణనలో తెలంగాణలో కుంటలు (27,003), చెరువులు (16,292), సరస్సులు (289), రిజర్వాయర్లు (111), ఇంకుడు గుంతలు లేదా చెక్ డ్యామ్‌లు (19,239), ఇతర (1,121) సహా మొత్తం నీటి వనరుల సంఖ్య 64,055గా ఉన్నట్లు తేలింది. ఇదివరకు ఇట్లాంటి గణన చేయలేదు కనుక మాయమైన వాటి గురించిన సమాచారం లేదు. దేశంలో ఉన్న మొత్తం నీటి వనరులు 24.24 లక్షలు. వాటిలో 97.1% (23,55,055) గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2.9% (69,485) ఉన్నాయి. 96% పైగా ఆక్రమణలు తెలంగాణలో జరిగినట్లు వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 2,920, పట్టణ ప్రాంతాల్లో 112 సహా రాష్ట్రంలో 3,032 నీటి వనరులు ఆక్రమణలకు గురయ్యాయని అధ్యయనంలో వెల్లడైంది. తెలంగాణా హైకోర్టు చెరువులు, సరస్సులపై డిసెంబర్ 2016 నాటికి సర్వే చేయమని ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదు. కేంద్ర జల మంత్రిత్వ శాఖ గణనకు రాష్ట్రాలవారీగా సమాచార సేకరణ జరిగిన దరిమిలా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రం మీద ప్రత్యేక నివేదిక ప్రభుత్వం తయారు చేయాల్సింది. కానీ చేయలేదు. హైదరాబాద్ నగర అభివృద్ధి పరిధిలో 3,532 చెరువులు ఉన్నట్లు తాత్కాలికంగా 2017లోనే ప్రకటించిన HMDA, వాటిలో 2,449 మాత్రమే గుర్తించింది. దాదాపు వెయ్యి చెరువుల విషయంలో అధికారిక ఉత్తర్వులు రాలేదు.
ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు లేవు
తెలంగాణా ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం కేవలం 19,314 చెరువులకు సంబంధించింది. 2015లో 46 వేల చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.22 వేల కోట్లు కేటాయించింది. మిషన్ కాకతీయ పథకం అమలు తీరు పక్కన పెడితే ప్రభుత్వం దగ్గర ఈ చెరువుల సమాచారం ఉండే అవకాశం ఉంది. ప్రతి చెరువుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి అంచనా వేయడానికి ఈ పట్టిక ఉంటే ఉపయోగపడుతుంది. 2021లో మీడియాలో వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీర్- ఇన్- చీఫ్, చీఫ్ ఇంజినీర్ల ప్రాదేశిక పరిధులలో ఉన్న 43,870 చెరువులలో 21,552 చెరువులు అలుగులు పారినాయి, 13,451 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం వరకు నింపడమైంది. ఈ చెరువుల సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు మనం భావించాలి. చెరువుల సంఖ్య ఎంత అనేది ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు లేవు అనేది స్పష్టం.
చెరువులు ఉమ్మడి ఆస్తి
గ్రామాల్లో ప్రజలు వివిధ కట్టుబాట్లతో తమ చెరువును కాపాడుకునేవారు. చెరువులతో ముడిపడిన అనేక సంప్రదాయాలు, సామాజిక నిర్వహణ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. ఎప్పుడైతే చెరువులు ప్రభుత్వాల పరిధిలోకి వచ్చినాయో అప్పటి నుంచి ప్రజలు తమ ఆస్తి గురించి పట్టించుకోవడం మానేశారు. పాలక వ్యవస్థలో ఉండే నియంత్రణ సంస్థలు చెరువు బాగోగులు చూసుకుంటాయని భావించి చెరువులను ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే, చెరువులను ఇప్పటికీ కాపాడుకుంటున్న గ్రామాలు ఉన్నాయి. సంఘం, సమాజం, పరస్పర సహకారం ఉన్న గ్రామాలలో చెరువులకు ప్రమాదం రాలేదు. నిర్లక్ష్యం చేసి, తమ తప్పు తెలుసుకుని చెరువులను బాగు చేసుకున్న ఇంకొన్ని గ్రామాలు నీటితో కళకళలాడుతున్నయి. చెరువుల ఆక్రమణ ప్రాథమిక దశలోనే గుర్తించి, నివారించే ప్రయత్నాలు చేస్తున్న మహనీయులకు ప్రభుత్వం నుంచి, శాసన వ్యవస్థ నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి సరైన సహకారం లేదు. కోర్టులలో చెరువుల పరిరక్షణకు వేసిన కొన్ని వ్యాజ్యాలు ఎన్నో ఏండ్లకొద్దీ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా కోర్టులు ఇచ్చిన తీర్పుని అమలుపరిచే పటిష్ట వ్యవస్థ కూడా లేదు.
చెరువుల రక్షణకు ప్రత్యేక విభాగం అవసరం
కోర్టులు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలు గురించి తెలంగాణా హైకోర్టు విచారణ చేసి, అమలు చేయని పరిస్థితులను సమీక్ష చేసి బాధ్యులను శిక్షించాలి. ఆయా ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని అవసరం బట్టి కొత్త ఉత్తర్వులు జారీ చేయాలి. భూ వినియోగ విధానాలను సునిశితంగా పరిశీలించే కమిటీ ఏర్పాటు చేయాలి. పట్టణాభివృద్ధి సంస్థల పాత్ర మీద దృష్టి పెట్టాలి. చెరువుల రక్షణకు, నిర్వహణకు ప్రత్యేక శాఖ లేదా విభాగం ఏర్పాటు గురించి పరిశీలన చేయాలి. చెరువులు అన్యాక్రాంతం, కలుషితం కాకుండా సంపూర్ణ ప్రణాళిక రచనకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించి, అమలు చేయాలి. చెరువుల సంరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చెరువుల పరిరక్షణలో చెరువుల పరీవాహక ప్రాంతం, చెరువులకు వర్షపునీరు చేరవేసే వాగులు, పిల్ల కాలువలను కూడా పరిరక్షణ పరిధిలోకి తేవాలి. చెరువుల పరిరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యం పెంచే విధి విధానాలు రూపొందించాలి.
దొంతి నరసింహారెడ్డి
పాలసీ ఎనలిస్ట్