తాగునీటి పనుల కోసం జిల్లాకు రూ.కోటి

తాగునీటి పనుల కోసం జిల్లాకు రూ.కోటి
  • కలెక్టర్లకు స్పెషల్ ఫండ్ కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ 
  • మోటార్లు, పైపుల రిపేర్లు, ట్యాంకర్లతో సరఫరాకు వినియోగించాలని ఆదేశాలు 
  • తాగునీటి సరఫరా తీరుపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సరఫరాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.  మారుమూల పల్లెల్లో సైతం తాగునీటికి  ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నది. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.  

అంతేకాకుండా, జిల్లాల్లో తాగునీటి అత్యవసర పనుల కోసం స్పెషల్ ఫండ్ కేటాయించింది.  జిల్లాకు రూ.కోటి చొప్పున పంచాయతీ రాజ్ శాఖ మంజూరు చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలకు రూ.32 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇచ్చింది.  చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఆధారపడకుండా కలెక్టర్ల వద్ద ప్రత్యేక నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఈ నిధులను  కేవలం తాగునీటికే కేటాయించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదేశించారు. 

 గ్రామాల్లో మోటార్ల రిపేర్లు, పైప్ లైన్, గేట్ వాల్స్ మరమ్మతులకు వినియోగించాలని సూచించారు. తాగునీటికి సంబంధించి ఏ అవసరమున్నా ఇందులో నుంచి ఖర్చు చేయవచ్చని,  గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఆటంకం కలిగినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా వారి అవసరాల కోసం వాటర్ ట్యాంకర్ల ద్వారా  నీటిని అందించేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని చెప్పారు.  

ఫిర్యాదులకు కాల్​ సెంటర్​

 వేసవి కాలంలో  ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహుబూబ్ నగర్  వంటి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారు.  ఇలాంటి ప్రాంతాల్లో అవసరమైతే బోర్లు వేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.  నీటి సమస్య తలెత్తినా స్థానికంగా అధికారులు స్పందించకపోతే..  ఫిర్యాదు చేసేలా హైదరాబాద్ మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్​లో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ ను సైతం ఏర్పాటు చేశారు.  కాల్ సెంటర్ కు వచ్చే  సమస్యలను నోట్ చేసుకొని సంబంధిత అధికారులను పంపిస్తున్నారు. వారు స్పందించి వెంటనే ఆ సమస్య పరిష్కరించేలా చర్యలు  చేపడుతున్నారు.  

పల్లెల్లో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా.. వెంటనే  పరిష్కరించేలా మిషన్ భగీరథ సిబ్బంది, అధికారులను  అప్రమత్తం చేస్తున్నారు. ప్రతిరోజూ గ్రామాలవారీగా తాగునీటి సరఫరా తీరు, సమస్యలు, లోపాలపై రిపోర్ట్​ను హెడ్ ఆఫీస్ కు పంపించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు వాటర్ సప్లై రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు.  నీటి సరఫరాలో ఆటంకం కలిగితే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు.   మేజర్ సమస్య అయితే మండల, జిల్లా అధికారులను అక్కడి పంపించి.. నీటి సరఫరా చేసేలా  హెడ్ ఆఫీస్ నుంచి ఫాలో అప్ చేస్తున్నారు.  చిన్న సమస్య అయితే  త‌‌‌‌క్షణమే ప‌‌‌‌రిష్కరించేలా  గ్రామాల్లో మంచి నీటి స‌‌‌‌హాయ‌‌‌‌కుల‌‌‌‌ను నియ‌‌‌‌మించారు. వీరికి గతంలో శిక్షణ ఇచ్చారు.