ప్రతీ నీటి బొట్టు మాదే: సింధు జలాలపై పాకిస్తాన్ కీలక ప్రకటన

ప్రతీ నీటి బొట్టు మాదే: సింధు జలాలపై పాకిస్తాన్ కీలక ప్రకటన

ఇస్లామాబాద్: పహల్గాంలో అత్యంత క్రూరమైన రీతిలో ఉగ్రదాడికి ఊతం అందించిన దాయాది దేశం పాకిస్తాన్ సింధు జలాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పడం కోసం సింధు జలాల ఒప్పందం(ఇండస్ వాటర్స్ ట్రీటీ) నుంచి భారత్ వైదొలిగిన తరుణంలో పాకిస్తాన్ జల వనరుల శాఖ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్ లెఘరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తీసుకున్న సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయం చట్ట విరుద్ధమని చెప్పారు.

సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందని.. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్ లెఘరీ చెప్పడం గమనార్హం. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ భద్రతా వ్యవస్థలో కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్ లెఘరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడింది తామేనని లష్కరే ఈ తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టాన్స్ ఫ్రంట్’ (TRF) ఇప్పటికే ప్రకటించింది.

సింధూ నది (ఇండస్ రివర్) టిబెట్‎లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3,180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కలుస్తుంటాయి. అయితే, దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో తలెత్తిన వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. 

Also Read:-టెర్రరిస్టులపై యుద్ధం మొదలుపెడుతున్నాం: ఫస్ట్ టైం ఇంగ్లీష్లో ప్రపంచానికి చెప్పిన మోదీ

సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్న భారత్ ఆ నదీ జలాలు పాక్ కు వెళ్లకుండా ఆనకట్టలు కట్టుకోవచ్చు. లేదా భారత్ లోని ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు. ఇదే గనక జరిగితే.. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధు ప్రావిన్స్ లు ఎడారిగా మారే ప్రమాదంలో పడతాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లోని వ్యవసాయ భూముల్లో 80% (పంజాబ్, సింధు ప్రావిన్స్ లోనే ఉన్నాయి) భూములకు సింధు జలాలే కీలకం. ఈ రెండు ప్రావిన్స్ లలో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్లు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది (23.7 కోట్ల మంది) ఇండస్ బేసిన్ లోనే నివసిస్తున్నారు.

కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నదీ వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అంతేకాకుండా తర్బెలా, మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్ కు కరెంట్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండస్ బేసిన్ లో పండే గోధుమలు, వడ్లు, చెరకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, ఝీలం, చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్ లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. 

వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతుంది. అనేక సిటీలకు నీటి సప్లై నిలిచిపోయి గందరగోళం తలెత్తుతుంది. ఇండ్లకు, ఇండస్ట్రీలకు కరెంట్ సప్లైకి ఇబ్బందులు వస్తాయి. ఉపాధి పడిపోతుంది. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్స్ లు కాలక్రమంలో ఎడారులుగా మారతాయని అంటున్నారు.  చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజల వలసపోయే పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు.