వరంగల్, వెలుగు: కరోనా తో బతుకు భయమే కాదు, బతకడమూ బరువైతంది. లాక్‌డౌన్‌తో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి కొందరు, సగం సగం జీతాలతో ఇంకొందరు భారంగా కుటుంబాలను సాకుతాంటే పెరుగుతున్న రేట్లు వారిని ఆగం చేస్తున్నయి. కిరాణ సామాను నుంచి బట్టలు, వెహికిల్స్ స్పెయిర్పార్ట్స్, మెకానిక్ చార్జీలు, ఆటోరేట్లు, ఇస్త్రీ, హెయిర్ కటింగ్చార్జీలు .. ఇట్ల అన్నీపెరిగినయ్. లాక్డౌన్ వల్ల ట్రాన్స్పోర్ట్ కష్టమై రేట్లు పెంచుతున్నామని వ్యాపారులు చెబుతాంటే, తాము ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నందున పెంచక తప్పడం లేదని మెకానిక్‌లు, ఆటోవాలాలు, బార్బర్స్అంటున్నరు.
తిండి సామాన్లకు తిప్పలే..
మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్డౌన్ పెట్టాక కిరాణషాపులు, మాల్స్‌లలో ఏ సామాను కొనాలన్నా సగటు వ్యక్తి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. పప్పు, ఉప్పు, చెక్కర, గోధుమ పిండి, ఇడ్లిరవ్వ, బియ్యం.. ఇట్ల అన్నింటి రేట్లు పెరిగినయ్. పప్పుల ధరలు కిలోకు గతంలో కంటే రూ.20 నుంచి రూ.50 దాకా పెంచిన్రు. లాక్డౌన్ కంటే ముందు కిలోకు రూ.80 ఉన్న కందిపప్పును ఇప్పుడు 100 కుపైగా అమ్ముతున్నరు. కిలోకు రూ.90 ఉన్నపెసరపప్పును రూ.130కి అమ్ముతున్నరు. ఆయిల్ప్యాకెట్ల మీద గతంల కంటే రూ.20 నుంచి రూ.30 దాకా ఎక్కువ తీసుకుంటున్నరు. కూల్‌డ్రింకుల మీద రూ.5 నుంచి రూ.10 దాక ఎక్కువేస్తున్నరు. పొద్దుగాల కొనే పాలప్యాకెట్ మీదకూడ రూపాయో, రెండురూపాయలో ఎక్కువ గుంజుతున్నరు.
కటింగ్ డబుల్..
కటింగ్, షేవింగ్ కలిపి టౌన్లు, సిటీల్లో గతంలో100 రూపాయలు తీసుకునేవాళ్లు. ఏసీ షాపుల్లో 150 దాక వసూలుచేసేది. గ్రామాల్లో 50 నుంచి 80 రూపాయల్లో కథ ఒడిసేది. కానీ ఇప్పుడు ఏ సెలూన్‌కు వెళ్లినా రేట్లు డబుల్ చేశారనే మాట వినిపిస్తాంది. కటింగ్, షేవింగ్ కలిపితే రూ.250 దాకా వసూలు చేస్తున్నరు. గతంలో కటింగ్ చేసేటప్పుడు ఒకే క్లాత్‌ను అందరికీ కప్పేవాళ్లు. కానీ ఇప్పుడు యూస్ అండ్ త్రో క్లాత్ వాడుతున్నరు. శానిటైజర్లు ఎక్కువగా యూజ్ చేస్తున్నరు. మరోవైపు ఇస్త్రీ రేట్లను కూడా ఒక్కోజతకు రూ.5నుంచి రూ.10 దాకా పెంచిన్రు.
బట్టలు, వెహికిల్స్ స్పేర్‌పార్ట్స్..
పుట్టిన రోజుకో.. పెళ్లి రోజుకో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రెస్ కొందామని వెళ్లేవారికి కొన్ని బట్టలషాపుల్లో చుక్కలు కనిపిస్తున్నయి. గతంలో ఉన్నరేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నరని కస్టమర్లు అంటున్నరు. ఇక బైకులు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వెహికిల్స్ స్పేర్‌పార్ట్స్ రేట్లను పెంచి అమ్ముతున్నరు. వ్యవసాయ సీజన్ కావడంతో ట్రాక్టర్లు, దుక్కి దున్నే యంత్రాల స్పేర్ పార్ట్స్ దొరకట్లేదు. దీంతో బ్లాక్‌లో తెప్పించుకోవాల్సి వస్తోందని అంటున్నరు. భవన నిర్మాణ, కార్పెంటర్ తదితర రంగాలకు చెందిన మెటీరియల్ కూడా ఎక్కువరేట్లకు అమ్ముతున్నరనీ, మెకానిక్‌లు కూడా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నరని జనం చెబుతున్నరు.
For More News..