వినాయకుడిని లంబోదరుడు, గణపతి, విజ్ఞానాధిపతి, గజాననుడు, గణేశుడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఏ పేరుతో పిలిచినా భక్తుల జీవితాల్లో కలిగే ఆటంకాలు, బాధలను తొలగిస్తాడని నమ్ముతారు. అయితే, వినాయకుడ్ని పిలిచే ప్రతీ పేరుకో అర్థం ఉంది. దాని నుంచి జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.
గణపతి అనేది రెండు పదాల కలయిక. ‘గణ’ అంటే ‘సమూహం’. ‘పతి’ అంటే ‘ఆధిపత్యం’. అందుకే, ఏదైనా ఒక సమూహం మీద ఆధిపత్యం చేసేవాన్ని లేదా అందరినీ కలిపి పనిచేసేలా చేసే సంఘటిత శక్తిని ‘గణపతి’ అంటారు. మనిషిలో, విశ్వంలో కూడా గణపతి తత్వం ఉంది. విశ్వంలోని గ్రహాలు, ఉపగ్రహాలు వేరు వేరు దారిలో వెళ్లకుండా చేసి, వాటి కక్ష్యలో తిరిగేలా చేస్తాడు సూర్యుడు. అందుకని సూర్యుడు ఒక గణపతి. ఆకలిగా ఉన్నపుడు కళ్లు ఒక పదార్థాన్ని చూస్తాయి. దాన్ని తీసుకోవడానికి చేతులు సాయం చేస్తాయి. తినడానికి నోరు సాయం చేస్తుంది. అది జీర్ణం కావడానికి జీర్ణాశయం పని చేస్తుంది. కానీ, వీటన్నింటిని కలిపి ఒకే పని చేసేలా చేస్తుంది మెదడు. అందుకని మెదడు ఒక గణపతి. వేరు వేరుగా ఉన్న అక్షర సముదాయాలు కలిసి, అర్థవంతంగా మారిన పేరు.. గణపతి. అయితే, ఇవి వేరుగా ఉన్నా వాటికి కూడా ఒక గుర్తింపు ఉంటుంది. కాకపోతే కలిసి కట్టుగా పని చేస్తే వాటి విలువ పెరుగుతుంది. ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకని ప్రతీ మనిషి వాళ్లకో సొంత గుర్తింపు తెచ్చుకోవాలి. నలుగురితో కలిసిపోతూ, అవసరమైన పనులు చేసి అందరికీ సాయ పడితే.. ప్రతీ ఒక్కరు గణపతి అవుతారు.