సింగరేణిని కాపాడుకునే బాధ్యత అందరిది.. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

సింగరేణిని కాపాడుకునే బాధ్యత అందరిది..  ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  • లక్ష్యాలను సాధించినప్పుడే సంస్థకు మనుగడ: వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • సంస్థ బాగుపడితేనే ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందుతారని వెల్లడి
  • ‘ఉజ్వల సింగరేణి - ఉద్యోగుల పాత్ర’ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు:రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అనుకున్న విధంగా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించినప్పుడే సంస్థకు మనుగడ ఉంటుందన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే-5, కాసీపేట, శ్రీరాంపూర్ ఏరియా ఇందారం-1ఏ బొగ్గు గనులు, జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌‌‌‌లో వేర్వేరుగా నిర్వహించిన ‘ఉజ్వల సింగరేణి- - ఉద్యోగుల పాత్ర’పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఛీప్ గెస్టులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ మాట్లాడారు. సింగరేణి ప్రగతి, ఆర్థిక స్థితిగతులు, విస్తరణ అవకాశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. 1995లో 25 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలిగిన సింగరేణి.. ఇప్పుడు 70 మిలియన్ టన్నులు దాటిపోయిందని, ఇది ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషికి నిదర్శనమన్నారు. భవిషత్తులో 100 మిలియన్ టన్నులకు చేరుకునేలా చూడాలన్నారు. సంస్థ బాగుపడితే ఈ ప్రాంతం, ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. 

400 కోట్లు ఇప్పించి సింగరేణిని కాపాడిన కాకా..

సింగరేణి నష్టాల్లోకి వెళ్తే మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుతో మాట్లాడి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం ఇప్పించి సంస్థను కాపాడిన ఘనత తన తండ్రి కాకా వెంకటస్వామికి దక్కుతుందని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఆయన చొరవ వల్లే లక్ష మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కలిగిందని పేర్కొన్నారు. కార్మికులకు పెన్షన్ స్కీం కూడా తీసుకొచ్చారని చెప్పారు. ప్రస్తుతం రిటైర్డ్‌‌‌‌ కార్మికుల పెన్షన్‌‌‌‌ను పెంచే అంశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

సింగరేణిలో కాలానికి అనుగుణంగా టెక్నాలజీ అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, బోనస్ ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరానని చెప్పారు. తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేలు చొప్పున ఇన్సెంటివ్స్‌‌‌‌ ఇచ్చామని తెలిపారు. రిటైర్డు కార్మికుల వైద్య ఖర్చుల మొత్తాన్ని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని తాను కోరగా.. డిప్యూటీ సీఎం అంగీకరించారని వెల్లడించారు. సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే ఇవ్వాలని తాను ఎమ్మెల్యే కాగానే సీఎం రేవంత్ రెడ్డిని కోరానని, దీంతో ఆయన వెంటనే సింగరేణి సీఎండీతో ఉత్తర్వులిప్పించారని వివేక్ గుర్తుచేశారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో మరిన్ని కొత్త కోర్సులను తీసుకురావాలని ఆ ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.

పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో సింగరేణి ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక రూ.40 కోట్ల డీఎంఎఫ్‌‌‌‌టీ ఫండ్స్‌‌‌‌తో అభివృద్ధి పనులు చేపడుతున్నానన్నారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో శ్మశాన వాటికల కోసం ల్యాండ్ కేటాయించాలని సింగరేణిని కోరినట్లు చెప్పారు. జైపూర్ పవర్ ప్లాంట్‌‌‌‌లో 800 మెగావాట్ల మూడో యూనిట్‌‌‌‌కు చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ నిర్వాసితులు, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఎస్టీపీపీ జీఎం రాజశేఖర్​రావును ఆదేశించారు. 

సింగరేణి కోసం పార్లమెంటులో గళమెత్తిన: ఎంపీ వంశీకృష్ణ

సింగరేణి సంస్థ మనుగడను కాపాడటంతో పాటు కార్మికుల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే సింగరేణి డ్రెస్ వేసుకొని పార్లమెంట్‌‌‌‌లో అడుగుపెట్టి సంస్థ కోసం గొంతెత్తినట్టు చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణను విరమించుకోవాలని, బొగ్గు బ్లాక్‌‌‌‌ల టెండర్ల విధానం రద్దు చేయాలని పార్లమెంటులో డిమాండ్ చేశానని గుర్తుచేశారు.

సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడం, పెర్క్స్‌‌‌‌పై ఐటీ మినహాయింపుకు కృషి చేస్తానని చెప్పారు. తన తాత కాకా వెంకటస్వామి పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడిన వీడియోలు చూస్తుంటే.. ప్రజల కోసం సింహంలా గర్జించిన తీరు కనిపించిందన్నారు. కాగా, ప్రజలు, కార్మికులు దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో భాగంగా కార్మికులు, ఉద్యోగులతో కలిసి విందు భోజనాలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, అక్బర్ అలీ, బాజీసైదా, దాగం మల్లేశ్, మందమర్రి, శ్రీరాంపూర్, ఎస్టీపీపీ జీఎంలు దేవేందర్, సంజీవరెడ్డి, రాజశేఖర్ రావు, అధికారుల సంఘం బాధ్యులు రమేశ్, శ్రీనివాస్, ఐకే ఓసీపీ పీవో ఏవీ రెడ్డి, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లీడర్లు, గనుల మేనేజర్లు పాల్గొన్నారు.