ప్రతి గుండె నిండా.. ఎగరాలి మువ్వన్నెల జెండా

ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే త్రివర్ణ పతాకపు రెపరెపలు ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక అనిర్వచనీయమైన అనుభూతిని సృష్టిస్తాయి. అది కేవలం మూడు రంగులున్న పతాకం కాదు. ఒక భావోద్వేగం, ప్రైడ్. నా నీడన స్వేచ్ఛగా జీవించండని ఇచ్చే అభయం జాతీయ జెండా. మన పూర్వీకులు రక్తం చిందించి సాగించిన సుదీర్ఘ స్వాతంత్య్ర సమరాన్ని నిరంతరం జెండా గుర్తుచేస్తుంది. సైనికుడు దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాడంటే అందుకు  ప్రేరణ కలిగించేది జాతీయ జెండానే. ‘‘శత్రు మూకలపై విజయం సాధించి, జాతీయ పతాకాన్ని గగన సీమలో ఉవ్వెత్తున ఎగురవేసి వస్తాను. లేదా ఈ జాతీయ జెండాలో చుట్టిన అమరుడిగానైనా తిరిగి వస్తా’’ అంటూ కెప్టెన్  విక్రమ్ బాత్రా (పరమవీరచక్ర విజేత) చెప్పిన మాటలు ఈ మహోన్నత సత్యాన్నే చాటిచెబుతున్నాయి. బరితెగించి ముందుకు వచ్చిన చైనా సైనికులను నిలువరించి, ఆ పోరాటంలో 2020 జూన్ 15 న అసువులు బాసిన మన  తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు ప్రేరణ ఈ త్రివర్ణ పతాకమే. క్రీడల్లో విజయానంతరం జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడం ద్వారా ఆటగాళ్లు పంచే ఆనందోత్సాహమే కాదు, పెంచే సమరోత్సాహమూ ఎంతో! ఈ త్రివర్ణ పతాకమే రక్షణ కవచంగా మారి భీకర రష్యా-‌‌–ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ విద్యార్థులతో పాటు పాకిస్తాన్ స్టూడెంట్లు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడానికి ఉపకరించింది.   

నాటి ఉత్సాహం మళ్లీ వచ్చింది

ఉద్యోగంలో  చేరాక జాతీయ పండగలంటే కేవలం సెలవు దినాల కింద జమపడ్డాయి. ఇండ్ల మీద జెండాలెందుకు, గుండెల్లో ఉండాలి గానీ? అనే మూర్ఖపువాదులూ లేకపోలేదు. జాతీయ పతాక ఆవిష్కరణకు సంబంధించిన చట్టాలు క్రమేణా మారుతూ వచ్చాయి. వ్యక్తులు, సంస్థలు తమ ఇండ్లు, ఆఫీసులు, కర్మాగారాలు, ఇతర భవనాల మీద జాతీయ పతాకం ఎగురవేసే అనుమతి ఉండేది కాదు. దీంతో జాతీయ పతాకంతో ప్రజల బంధం లాంఛనంగా మిగిలిపోయింది తప్ప, ఏమాత్రం బలపడలేకపోయింది. ఈ పరిస్థితిని  మార్చాలంటూ 1995లో ఢిల్లీ  హైకోర్టు  తీర్పు చెప్పింది. 2004లో సుప్రీంకోర్టు ఆ తీర్పును బలపరిచింది. జాతీయ పతాకాన్ని స్వేచ్ఛగా, గౌరవంగా, గర్వంగా ఎగురవేసే ప్రాథమిక హక్కు రాజ్యాంగం ప్రకారం  భారతీయులందరికీ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ పౌరులంతా జాతీయ భావంతో ఒక్కటి కావాలంటే,  జాతీయ పతాకాన్ని స్వేచ్ఛగా ఎగురవేసే అవకాశం ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ కేసును సుప్రీంకోర్టు సమీక్షిస్తున్న సమయంలోనే 2002లో వాజపేయి ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్ తెచ్చింది. దాంతో, జాతీయ పతాకాన్ని  స్వేచ్ఛగా ఎగురవేసే  అవకాశం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి లభించింది. జాతీయ పర్వాన్ని అందరం కలిసికట్టుగా జరుపుకొనకపోతే, మన మధ్య అడ్డుగోడలు మరింత పెరుగుతాయి. నేషనల్​ ఫ్లాగ్​ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని భారీఎత్తున చేపట్టింది. ఆజాదీకా అమృత్​మహోత్సవ్​ వేళ దేశ ప్రజలంతా తమ నివాసాలు, కార్యక్షేత్రాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ఎంతో వెసులుబాటు కల్పించింది. జాతీయ పతాక రూపకర్త  మన పింగళి వెంకయ్యే కనుక, తెలుగువారిగా మనకందరికీ గర్వకారణమైన సమయమిది. గడచిన అయిదేళ్లుగా క్రమం తప్పకుండా ఉమ్మడిగా ఉదయాన్నే జాతీయ గీతాలాపన చేస్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట పౌరులను చూస్తే హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఉదయం సరిగ్గా 7.58 గంటలకు పట్టణంలోని డజనుకు పైగా లౌడ్ స్పీకర్ల ద్వారా జాతీయ గీతాలాపన ప్రకటన వెలువడుతుంది. అంతే, ఎక్కడి ప్రజలు అక్కడే నిలబడిపోయి, రెండు నిమిషాల్లో జాతీయ గీతాలాపనకు సిద్ధమవుతారు. 

- పోరెడ్డి కిషోర్ రెడ్డి,
 బీజేపీ తెలంగాణ 
రాష్ట్ర అధికార ప్రతినిధి