తెలంగాణలో ఉన్న ప్రతి సమస్యను పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తాం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణలో ఉన్న ప్రతి సమస్యను పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తాం  :  ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దేశవ్యాప్తంగా నియంతృత్వ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.  గత పది ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గొంతు విప్పి మాట్లాడే పరిస్థితి లేదన్నారు.  తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను పార్లమెంట్లో  గట్టిగా వినిపిస్తామని చెప్పుకొచ్చారు.  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా జిల్లాకు వచ్చిన గడ్డం వంశీకృష్ణకు ఘనస్వాగతం పలికారు పార్టీ నాయకులు, కార్యకర్తలు.కాక అభిమానులు.

ఈ సందర్భంంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.  అందరం కలిసి స్పీకర్ ను ప్రశ్నించామని దీనిపై చర్చ జరపాలని కోరామన్నారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వెల్లడించారు.  ఢిల్లీ,అయోధ్యలో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన టెర్మినల్స్,అండర్ పాస్ లు రోడ్లు పలు అభివృద్ధి పనులు ఎన్నికల కంటే ముందే తాము అభివృద్ధి చేశామని గొప్పగా చెప్పుకున్నారన్నారు.

ఇలాంటి జిమ్మిక్కులు వాడుకొని బీజేపీ మెజారిటీ సీట్లు సాధించిందని విమర్శించారు.  కాక ఆశీర్వాదంతో పెద్దపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని  చెప్పిన వంశీకృష్ణ..  తన గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.