అధికారుల పాలన ఆగమాగం.. సొంత యావలో పాలకులు! : కల్లూరి శ్రీనివాస్​రెడ్డి

తెలంగాణలో పాలకులకు తమ సమస్యలు తప్ప ప్రజల సమస్యలు ఎప్పుడూ ముఖ్యం కావని అడుగడుగునా రుజువవుతూనే వస్తున్నది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తున్నదా? అనేది సహజ ప్రశ్నగా మారింది. ఈ ప్రభుత్వానికి పరిపాలన ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం. తమ కుటుంబం ముఖ్యం. తమపై ఈగ వాలినా ప్రభుత్వమే పోరాడుతుంది. ఢిల్లీ దాకా ప్రభుత్వమే కదిలివెళుతుంది. కానీ ప్రజల కోసం పనిచేసే తీరిక మాత్రం ప్రభుత్వానికి లేదు. కవిత ఈడీ విచారణ కోసం రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వమే ఢిల్లీలో తిష్టవేసింది. అరడజనుకు పైగా మంత్రులు, ఎంపీలు, సుమారు50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్​ఎస్​ నేతలు ప్రజాధనం వెచ్చించి మరీ వెళ్లారు. రాష్ట్రంలో పరిపాలన సంగతి అటుంచితే.. టీఎస్​పీఎస్సీ పరీక్షల పేపర్ల లీకుల నిర్వాకం బయట పడ్డాక కూడా ప్రభుత్వం తరఫున ఒక్క వివరణ లేకపోవడం గమనించొచ్చు. అంటే 20 లక్షల మంది నిరుద్యోగుల బతుకుల కన్నా కవిత విచారణే ఈ ప్రభుత్వానికి ముఖ్యమైందని తేలిపోయింది. ప్రజల సమస్యలపై ప్రభుత్వమే సమీక్షలు చేయకపోతే.. అధికారుల్లో బాధ్యతారాహిత్యం, అవినీతి పెరగకుండా ఉంటుందా? పాలనా వ్యవస్థలో ఎక్కడైనా..  భయమూ, భక్తి కనిపిస్తున్నాయా? స్వామి పట్ల భక్తి తప్ప ప్రజల పట్ల భక్తి ఎక్కడ? 

టీ ఎస్ పీఎస్సీ పరీక్షల పేపర్ల లీకుల ఉదంతం 25 లక్షల మంది విద్యార్థులను ఆందోళనలో పడేసింది. పాలకులేమో ‘ఈడీ, మోడీకి భయపడం’ అనే  రాజకీయంలో మునిగితేలుతుండగా, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు మాత్రం న్యాయం చేయాలని రోడ్లపై ఆందోళన చేస్తూ అరెస్టులవుతున్నారు. 8 ఏండ్లలో ఓ స్థాయిలో నియామకాలే లేవు. 80 వేల ఉద్యోగాలకు 15 రోజుల్లో నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించి సుమారు 8 నెలలు దాటింది. వచ్చిన నోటిఫికేషన్లే కొన్ని అంటే వాటినీ సరిగా నిర్వహించలేని అధ్వాన్న వ్యవస్థను చూస్తున్నాం. పాలకులవి గాలి మాటలు, అధికారులవి బాధ్యతారాహిత్యాలు. యథారాజా తథా అధికారులు అన్నట్టు ఉన్నది పరిస్థితి. గ్రూప్1 ప్రిలిమ్స్​సహా మరికొన్ని పరీక్షల రద్దుతో యావత్తు నిరుద్యోగులు, అభ్యర్థులు ఆందోళనలో ఉంటే.. ఈడీ విచారణపై ఉన్న శ్రద్ధ గాడి తప్పిన పరిపాలనపై కనిపించదు. టీఎస్​పీఎస్సీ చైర్మన్ ది సివిల్​ సర్వెంట్​గా 32 ఏండ్ల అనుభవం. కాన్ఫిడెన్షియల్​సెక్షన్​ఎవరి ఆధీనంలో ఉండాలి? తన ఆఫీసులో ఏం జరుగుతున్నదో చూసుకోవాల్సిన అవసరం లేదా? ప్రశ్నపత్రాలు అన్నీ ఏకంగా పెన్ డ్రైవ్​లోకి ఎక్కించుకొని.. మార్కెట్​లో అమ్మకానికి పెడుతూ.. అమ్మాయిలను వంచింస్తుంటే ఏం చేస్తున్నట్టు? నిందితుల మధ్య గొడవ జరిగి.. విషయం పోలీసుల ద్వారా బయటకు వస్తే తప్ప గుర్తించలేనంత గాఢ నిద్రలో టీఎస్​పీఎస్సీ ఉన్నదా? కింది స్థాయి ఉద్యోగులను బాధ్యుల్ని చేసినంత మాత్రాన.. సంస్థపై విశ్వాసం నిలబడేనా? సర్కారు ఏర్పాటు చేసిన సిట్​లీకేజీ వ్యవహారంలో ఎవరైనా పెద్దలు ఉంటే బయటపెట్టగలుగుతదా? ఇవన్నీ సామాన్య జనం, నిరుద్యోగులు సంధిస్తున్న ప్రశ్నలే.. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం, టీఎస్​పీఎస్సీదే. 

ఇంటర్​ బోర్డులో గ్లోబరీనా గోల్​మాల్​

రాష్ట్రంలో లీక్​లు, ఫెక్​లు, నకిలీ దందాలకు కొదవలేదు. అడ్మినిస్ట్రేటివ్​ సిస్టంపైన పాలకుల నిర్లక్ష్యధోరణి, అధికారులకు ఆటవిడుపుగా మారిపోతున్నది. ఇంటర్​పరీక్ష ఫలితాల బాగోతం ఈ ప్రభుత్వానికి అనుభవంలోనే ఉంది. గ్లోబరీనా చేసిన పాపానికి పదుల సంఖ్యలో ఇంటర్​విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో కొందరు తర్వాత మంచి మార్కులతో పాసయ్యారని తేలింది. అయినా పోయిన ఆ విద్యార్థుల ప్రాణాలు మాత్రం తిరిగి రాలేదు కదా! ఇంతటి నిర్లక్ష్య ధోరణి అధికారుల్లో ఉంటే ఎవరి తప్పందాం? 

నకిలీ బర్త్​ సర్టిఫికెట్లు

ఇటీవల జీహెచ్ఎంసీలో నకిలీ బర్త్, డెత్​ సర్టిఫికెట్ల బాగోతం బయటపడ్డది. జనన మరణాలు కూడా ఈ రాష్ట్రంలో నకీలీలేనా? పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నదో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. హైదరాబాద్​లో ఉంటున్న మయన్మార్​కు చెందిన రోహీంగ్యాలు సైతం నకీలీ బర్త్​, డెత్​సర్టిఫికెట్లు పొందుతున్నారని వార్తలొచ్చాయి! రోహింగ్యాలు వాటి ఆధారంగా రేషన్​కార్డు, ఆధార్​ కార్టు కూడా పొందగలుగుతున్నారని తెలుస్తున్నది. ఓటు కూడా పొందవచ్చు! శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలకు ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లు దేశంలో నకిలీ పౌరసత్వాన్ని కూడా కల్పిస్తున్నాయంటే, ఇది పట్టరాని విచ్చలవిడి పాలన కాదందామా? జీహెచ్ఎంసీలో నకిలీ ఇంటి నంబర్ల వ్యవహారం కూడా నడుస్తోందని వార్తలున్నాయి. జీహెచ్​ఎంసీపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమేరకు ఉన్నదందాం? నకిలీ బర్త్​, డెత్​సర్టిఫికెట్ల అమ్మకం జరుగుతున్నదంటే, జీహెచ్​ఎంసీలో ఉన్నతాధికారుల పనితీరు ఎలా ఉన్నదనుకోవాలి? ఆ ఉన్నతాధికారుల పట్ల పాలకుల నిర్లక్ష్యధోరణిని ఏమనుకోవాలి?

పాలనను గాడిలో పెడ్తారా?

పసి బాలుడు బయటకు వచ్చిన పాపానికి అంబర్​పేటలో వీధి కుక్కలు పీక్కుతింటాయి.. పట్టుమని పాతికేండ్లు కూడా నిండని ఆరుగురు ఇంజనీరింగ్​గ్రాడ్యుయేట్లు ఫైర్​సెఫ్టీ ప్రమాణాలు లేని సికింద్రాబాద్​లో(స్వప్నలోక్ కాంప్లెక్స్)ని ఓ గదిలో పొగతో ఊపిరాడక చనిపోతారు? పాలకులు మాటకు ముందు విశ్వనగరం అని గొప్పలు చెప్పే హైదరాబాద్ లో ఇంత పాలనా వైఫల్యమా? పాలకులు రాజకీయాలు, ఇంటి వ్యవహారాలే లక్ష్యంగా పాలనా వ్యవస్థను మార్చుకుంటే.. ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు స్వామిభక్తి కోసం ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. అధికారులకు ప్రజల కన్నా పాలకుడే ముఖ్యంగా మారిపోయాడు. ఆ అధికారులు రాజకీయాల్లోకి రావడానికి క్యూ కడుతున్నారు కూడా. పాలకుడు గాడి తప్పినపుడు వ్యవస్థలు కూడా గాడి తప్పుతాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్​సిస్టమ్​కు ట్రీట్​మెంట్​చేస్తారా? తెలియదు!

ప్రతి శాఖలో అదే నిర్లక్ష్యం

ధరణి రాకముందు ఊరికి 20 భూ సమస్యలు ఉంటే.. పోర్టల్​వచ్చాక అవి 200 వరకు పెరిగాయని ఓ అంచనా. బాధిత రైతులది అరణ్యరోదన. కలెక్టర్ల వద్ద లక్షల్లో దరఖాస్తులు. ఏండ్లు గడుస్తున్నా పరిష్కారాలు ఉండవు. అధికారులు చేసిన తప్పిదాలకు.. డబ్బులు చెల్లించి అర్జీలు పెట్టుకున్నా.. ఆఫీసర్లు కనికరం చూపడం లేదు. అసలు ధరణిలో ఇన్ని తప్పిదాలు ఎందుకు జరిగాయి? ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రజలు బాధితులుగా ఎందుకు మారారు? ధరణి వచ్చి ఏండ్లు గడుస్తున్నా.. లక్షలాది దరఖాస్తులు ఇంకా అపరిష్కృతంగా పెండింగ్​లోనే ఉంటే ఏమిటి అర్థం? ధరణిలోనూ అక్రమాలు జరుగుతున్నాయనే వాదన ప్రజల్లో ఉంది! ధరణిని ఆపరేట్​చేసే ఓ ఉద్యోగిని మొన్ననే మెదక్​ జిల్లాలో సస్పెండ్​చేసినట్లు వార్త! ధరణిలో ఎవరూ ఏదీ మార్చలేరని సీఎం అప్పట్లో గొప్పగా చెప్పారు. ఇప్పటికీ ఒకరి భూమి మరొకరికి మార్చరనే ఆరోపణలు, ఆవేదనలు బాధితుల నుంచి ఎందుకు వినిపిస్తున్నాయి? అధికారులపై పట్టేది? ప్రతిశాఖలో అదే నిర్లక్ష్యం. పరిపాలన గాడి తప్పంది. విధిలేక ప్రజలు పనుల కోసం దళారులను ఆశ్రయించే పరిస్థితులు స్వరాష్ట్రంలో ఇంకా ఎందుకు పెరుగుతున్నాయో పాలకులు సమాధానం చెప్పాలి.

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్​