విగ్రహం మంచిదే, ఆశయాల్నీ మరువొద్దు : పరమేశ్ అనంగళ్ల

ప్రతిసారి అంబేద్కర్ జయంతి, వర్ధంతి రోజున అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని నినాదాలు చేసి, ఆ తర్వాత మరిచిపోతే అంబేద్కర్ ఆశయాలను ఎప్పటికీ సాధించలేం. అంబేద్కర్ కలలుగన్న అద్భుతమైన దేశాన్ని మనం చూడాలంటే ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి. మరి అద్భుత ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కలలుగన్న అంబేద్కర్ లాంటి నాయకుల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నదెవరు? డబ్బులకు మన ఓటును అమ్ముకొని నేరచరితుల్ని చట్టసభల్లోకి పంపుతున్నాం. ఐదేండ్లకోసారి వచ్చే ఎన్నికల్ని బాధ్యతగా చూడకుండా విందు, వినోదాల వేడుకగా మారుస్తున్నాం. ఎన్నికలు అంటేనే కోట్ల రూపాయల వ్యవహారంగా మారిపోయింది. సామాన్యుడు ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేదు. మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలిచిందనే వార్తలు వచ్చాయి. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం కదా! మరి ఈ వందల కోట్ల రూపాయలతో పని ఏమిటి? వందల కోట్లు ఖర్చుపెట్టినోడు ప్రజాసేవ చేసుకుంటూ ఖాళీగా కూర్చుంటాడా? ఖర్చుపెట్టిన వందల కోట్ల రూపాయలను వడ్డీతో సహా సంపాదించుకోడా? దేశంలో కేవలం కొద్ది శాతం మంది దగ్గరే మొత్తం సంపద పోగుపడింది. ఈ ఆర్థిక అసమానతలకు రాజకీయ తోడ్పాటు తప్పకుండా ఉంటుంది. మరి ఆ రాజకీయం అడ్డదారులు తొక్కడానికి డబ్బులు తీసుకుని ఓట్లేసి అక్రమార్కులను చట్టసభల్లోకి పంపిస్తున్నది మనమే కదా! ఐదు వందలకో, వెయ్యికో ఓటును అమ్ముకునే మనం అంబేద్కర్ ఆశయాలను సాధించగలమా? గుండెమీద చెయ్యేసి ఆలోచించుకుందాం.

తెలంగాణలో  ప్రజాస్వామ్యం ఉందా?

పోరాటాల ద్వారా ప్రజల న్యాయమైన డిమాండ్ లను సాధించుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ప్రత్యేక రాష్ట్రం కోసం యావత్తు తెలంగాణ సమాజం కొట్లాడింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ స్ఫూర్తి క్రమంగా కొరవడుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు నిరాశలోనే ఉన్నాయి. ముఖ్యంగా అణగారిన, దళిత వర్గాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయి. నేడు దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నగరంలో ఆవిష్కరణ కాబోతోంది. సంతోషం. కానీ అతి పెద్ద విగ్రహం ఆవిష్కరిస్తే అంబేద్కర్ ఆశయాలు సాధించినట్టు కాదు. సమాజంలో అట్టడుగు వర్గాలకు మొదటి ప్రాధాన్యం ఉండాలని కోరుకున్నవాడు అంబేద్కర్. కానీ స్వరాష్ట్రంలోనూ అట్టడుగు వర్గాలు పాలకుడి చేతిలో మోసపోతూనే ఉన్నాయి. దళిత సీఎం నుంచి మొదలు దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు వరకు అన్నింటా మోసమే. ఇంత అన్యాయం జరుగుతున్నా నేటి తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో ప్రశ్నించడం లేదు. నాటి పోరాట స్ఫూర్తి క్షీణిస్తున్నది. ఇకనైనా మేల్కొందాం. ఓటర్లుగా మన ఓటును అమ్ముకోవద్దు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం.

- పరమేశ్ అనంగళ్ల,సోషల్​ ఎనలిస్ట్