తెలంగాణలో ప్రతి ఓటు అమూల్యమైంది : కలెక్టర్ బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు: ప్రతి ఓటూ అమూల్యమైనదని, అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. సోమవారం జిల్లాలోని కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ పీపుల్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుతో దేశ స్థితిగతులను మార్చవచ్చని, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశాన్ని అభివృద్ది చేసుకోవచ్చన్నారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో  227, బెల్లంపల్లిలో 227, మంచిర్యాలలో 289 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, సంక్షేమశాఖ అధికారి చిన్నయ్య, స్నేహ సొసైటీ రూరల్ రీ కన్సస్ట్రక్షన్స్, స్నేహ టీఐ ప్రాజెక్టు ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

ఎన్నికల నియమావళి పాటించాలి

ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ సూచించారు. జిల్లా పోలీసు పరిశీలకులు ఇలంగోతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు అందిచనున్న శిక్షణ తరగతుల ఏర్పాట్లను ఎన్నికల అధికారి సంతోష్ మంచిర్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాములుతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు