- ఈ సక్సెస్, స్టార్‌డమ్‌తో పొంగిపోను
- ఇండియాకు లాంగ్‌టైమ్ ఆడతా
- హైదరాబాద్ తిరిగొచ్చిన సిరాజ్
- నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళి
తండ్రిని కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగాడు..! ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయానన్న బాధను భరించాడు..! ప్రత్యర్థి అభిమానులు దూషించినా ఏకాగ్రత కోల్పోకుండా లక్ష్యంపైనే గురిపెట్టాడు..! సీనియర్ల గైర్హాజరీలో బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను నడిపించడమే కాకుండా అత్యద్భుతంగా రాణించాడు..! ఆస్ట్రేలియా గడ్డపై హిస్టారికల్ టెస్టు సిరీస్ విక్టరీలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ యంగ్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన తండ్రి కలను నిజం చేయడమే కాకుండా యావత్ దేశం గర్వపడేలా చేశాడు..! ఈ సిరీస్‌లో ఇండియా తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన సిరాజ్ గురువారం హైదరాబాద్ తిరిగొచ్చాడు..! ఎంతగానో ప్రేమించే తండ్రి లేడన్న బాధను రెండు నెలలుగా తన గుండెల్లోనే దాచుకున్న సిరాజ్ ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులతో పంచుకొని కొంత రిలీఫ్ దక్కించుకున్నాడు..! ఎయిర్‌పోర్టులో దిగగానే నేరుగా తన తండ్రి మహ్మద్ గౌస్ సమాధి వద్దకు వెళ్లినివాళి అర్పించాడు. నాన్నతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. అక్కడి నుంచి టోలిచౌకిలోని తన ఇంటికి చేరుకుని పుట్టెడు దు:ఖంలో ఉన్న తల్లిని ఓదార్చాడు..! అనంతరం మీడియాతో మాట్లాడిన సిరాజ్.. ఆసీస్ టూర్ గురించి, టెస్టు సిరీస్‌లో తన పెర్ఫామెన్స్ గురించి పలు విషయాలు వెల్లడించాడు.
హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుత పెర్ఫామెన్స్ చేసిన టీమిండియా యంగ్ పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ సిరీస్‌లో తాను తీసిన ప్రతీ వికెట్‌ను తన తండ్రికే అంకితం ఇచ్చానని చెప్పాడు. తండ్రి మహ్మద్ గౌస్ మరణ వార్త విని కుంగిపోయిన తనలో ధైర్యం నింపి బాగా ఆడేలా ప్రోత్సహించిన టీమ్‌మేట్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఈ హిస్టారికల్ సిరీస్ విక్టరీని ఎప్పటికీ మర్చిపోనన్నాడు. ఈ రోజు తన తండ్రి ఉండి ఉంటే చాలా సంతోషించే వారని చెప్పాడు. ‘సిరీస్‌కు ముందు మా నాన్న మరణ వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపించింది. ఆయన నాతో చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఆ టైమ్‌లో నేను ఇంటికి రావాలా లేక ఆసీస్‌లోనే ఉండిపోవాలా అన్న కన్ఫ్యూజన్‌లో పడ్డా. మెంటల్‌గా చాలా డౌన్ అయ్యా. అప్పటికి మేం క్వారంటైన్‌లో ఉండడంతో ఎవ్వరూ నా దగ్గరికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. హోటల్ రూమ్‌లో ఒంటరిగా ఉండడం నరకంలా అనిపించింది. కానీ, టీమ్‌మేట్స్ అంతా ఫోన్‌లో మెసేజ్‌లు పంపిస్తూ నాలో ధైర్యం నింపారు. మా అమ్మతో మాట్లాడితే.. మీ నాన్న కల నెరవేర్చి ఇంటికి రా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫియాన్సి (కాబోయే భార్య) కూడా నన్ను మోటివేట్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ రాగానే నేరుగా గ్రేవ్‌యార్డ్‌కు వెళ్లి మానాన్న సమాధిపై పూలు చల్లా. ఆయన అంత్యక్రియల సమయంలో లేను కాబట్టి చాలా ఎమోషనల్ అయ్యా. ఇంటికి వచ్చిన వెంటనే నన్ను చూసి మా అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. నాకూ కన్నీళ్లూ వచ్చినా ఆమె ముందు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ప్రయత్నించా. అమ్మను ఓదార్చి, ధైర్యం చెప్పా. ఆ తర్వాత అమ్మ నా కోసం స్పెషల్‌గా నిహారి–పాయ కుక్ చేసింది’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
చాన్స్ వస్తుందనుకోలేదు.. కలలా ఉంది..
బ్రిస్బేన్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ ఓ కలలా అనిపిస్తోందని సిరాజ్ అన్నాడు. ‘ఈ సిరీస్‌కు సెలెక్ట్ అయినా నాకు చాన్స్ వస్తుందని అనుకోలేదు. కానీ, మూడు మ్యాచ్‌ల్లో ఆడాను. పైగా నేనింత గొప్ప పెర్ఫామెన్స్ చేస్తానని అస్సలు ఊహించలేదు. కానీ, టెస్టులు ఆడాలని, బాగా రాణించి జట్టును గెలిపించాలని కోరుకుంటూనే ఉన్నా. బ్రిస్బేన్‌లో ఐదు వికెట్లు తీసిన బాల్ నా దగ్గరే ఉంది. దానిపై ఆ రోజు డేట్, బౌలింగ్ ఫిగర్స్ అన్నీ రాసిపెట్టుకున్నా. దాన్ని భద్రంగా దాచుకుంటా’ అని 26 ఏళ్ల యంగ్ పేసర్ తెలిపాడు.
ఆ వికెట్ నా ఫేవరెట్
ఈ సిరీస్‌లో 13 వికెట్లు తీసినప్పటికీ గబ్బాలో మార్నస్ లబుషేన్ వికెట్ తనకు ఫేవరెట్ అన్నాడు. ‘నేను తీసిన ప్రతీ వికెట్ మా నాన్నకే అంకితం చేశా. సీనియర్ పేసర్లకు ఇంజ్యురీలు కావడంతో మేం (యంగ్‌స్టర్స్) బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫోర్త్ టెస్టులో టీమ్‌మేట్స్ అందరూ నాపై నమ్మకం ఉంచారు. నాకు అండగా నిలిచారు. మ్యాచ్‌లో బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను నడిపించాల్సింది నేనే అని చెప్పారు. దాంతో, నాపై చాలా ప్రెజర్ ఏర్పడింది. అయితే, నేను ఇండియాకు ఆడుతున్నానని అనుకోకుండా ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగినట్టుగా భావించి బౌలింగ్ చేశా. గబ్బా వికెట్‌పై రైట్ ఏరియాల్లో బాల్స్ వేయాలని ట్రై చేశా. సక్సెస్ సాధించా’ అని హైదరాబాదీ వివరించాడు.
ఇక్కడితోనే సంతృప్తి చెందను
తన టెస్టు కెరీర్‌కు మంచి ఆరంభం దక్కిందని, అయితే ఇక్కడితోనే తాను సంతృప్తి చెందనని సిరాజ్ స్పష్టం చేశాడు. ‘ఇండియాకు లాంగ్‌టైమ్ ఆడి, బాగా పెర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నా. ఇదే ఊపును కొనసాగించాలని చూస్తున్నా. ఈ సక్సెస్, స్టార్‌డమ్‌తో పొంగిపోను. దీన్ని నేను తలకు ఎక్కించుకోను. ఫ్యూచర్ కోసం మరిన్ని గోల్స్ సెట్ చేసుకుంటా. ఈ కాన్ఫిడెన్స్‌ను వచ్చే సిరీస్‌కు(ఇంగ్లండ్) తీసుకెళ్లాలి. ఆ సిరీస్‌లో టీమ్ నాకు ఎలాంటి బాధ్యత అప్పజెప్పినా.. నా బెస్ట్ ఇస్తా. ఆసీస్ టూర్‌లో బాగా రాణించినప్పటికీ.. నేనిప్పుడే సీనియర్ బౌలర్ల ప్లేస్‌ను భర్తీ చేస్తానని అనుకోవడం లేదు. అలాంటి ఆలోచనే నాకు లేదు’ అని సిరాజ్ వెల్లడించాడు.
ఆసీస్ క్రౌడ్ కామెంట్స్ వల్లే మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యా..
సిడ్నీ టెస్టులో ఆసీస్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేసి రేసిస్ట్ కామెంట్లు చేశారని, అయితే వాటితో కుంగిపోకుండా మెంటల్‌గా మరింత స్ట్రాంగ్ అయ్యానని సిరాజ్ చెప్పాడు. ‘ఆస్ట్రేలియా క్రౌడ్ నాపై రేసిస్ట్ కామెంట్స్ చేశారు. నేనో కోతిలా (బ్రౌన్ మంకీ) ఉన్నానని హేళన చేశారు. వాళ్ల మాటల వల్లే మెంటల్‌గా నేను మరింత స్ట్రాంగ్ అయ్యా. వాళ్ల చర్యలు నా పెర్ఫామెన్స్ దెబ్బతీయకుండా చూసుకున్నా. నేను రేసిజమ్‌కు గురైన విషయాన్ని బాధ్యత ప్రకారం నా కెప్టెన్ రహానెకు తెలియజేశా. విషయం తెలుసుకున్న అంపైర్లు కావాలంటే మ్యాచ్ వదులుకుని గ్రౌండ్ విడిచి వెళ్లిపోవచ్చన్నారు. కానీ మేము ఆటను గౌరవిస్తాం, అలాంటి పని చెయ్యమని అజ్జూ భాయ్ (రహానె)అంపైర్లకు చెప్పాడు. మేం ఎలాంటి తప్పు చేయలేదు. కాబట్టి ఆట కొనసాగించాం. ఈ కేసు (రేసిస్ట్ కామెంట్స్)పై విచారణ జరుగుతోంది. నాకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి’ అని సిరాజ్ తెలిపాడు. ఆసీస్ ఫ్యాన్స్ రేసిస్ట్ కామెంట్లకు తన పెర్ఫామెన్సే సమాధానం అన్నాడు.
కోహ్లీ వెన్నుతట్టాడు..
తన కెరీర్ గ్రోత్‌లో విరాట్ కోహ్లీది కీలక పాత్ర అని సిరాజ్ తెలిపాడు. ‘విరాట్ భయ్యా నన్ను చాలా మోటివేట్ చేస్తున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఇండియాకు ఆడే అవకాశం ఇచ్చాడు. 2018 ఐపీఎల్ నాకు బ్యాడ్ సీజన్. అయినా ఆర్‌సీబీ టీమ్‌తో పాటు కోహ్లీ భాయ్ నాకు అండగా నిలిచాడు. తర్వాతి సీజన్‌లో ఆర్‌సీబీ నన్ను రిటెయిన్ చేసుకుంది. ‘బిగ్ స్టేజ్‌లో ఆడే సత్తా నీలో ఉంది. నీ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించు. అంతకుమించి ఎక్కువగా ఆలోచించకు’ అని కోహ్లీ భాయ్ నాలో భరోసా కలిగించాడు. అలాగే, ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా భాయ్ (జస్‌ప్రీత్ బుమ్రా) కూడా మరో ఎండ్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచాడు. వేరే ఏ ప్రయోగాలూ చేయకుండా బాల్‌ను సరైన ఏరియాలో వేయాలని సూచించాడు. వేరియేషన్స్, యాంగిల్స్, క్రీజ్‌ను ఎలా యూజ్ చేసుకోవాలో టిప్స్ ఇచ్చాడు’ అని పేర్కొన్నాడు.
విరాట్, అజింక్యా ఇద్దరూ మంచి కెప్టెన్లే
ఆసీస్ టూర్‌లో ఫస్ట్ టెస్టు తర్వాత విరాట్ పెటర్నిటీ లీవ్‌తో ఇండియా వచ్చేయగా.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో రహానె టీమ్‌ను నడిపించాడు. అతని సారధ్యంలోనే సిరాజ్ టెస్టు అరంగేట్రం చేశాడు. కోహ్లీ, రహానెలో బెటర్ ఎవరన్న ప్రశ్నకు ఇద్దరూ మంచి కెప్టెన్లే అంటూ సిరాజ్ సేఫ్ గేమ్ ఆడాడు. ‘కోహ్లీ, రహానె ఇద్దరూ మంచి కెప్టెన్లే. అజ్జూ (రహానె) యంగ్‌స్టర్స్‌ను బాగా నమ్మాడు. మాలో కాన్ఫిడెన్స్ నింపాడు. అది కెప్టెన్ నుంచి ఓ యంగ్‌స్టర్‌కు కచ్చితంగా అవసరమైన విషయం. నేనైతే ఇద్దరి కెప్టెన్సీని ఎంజాయ్ చేశా’ అని సిరాజ్ పేర్కొన్నాడు. కాగా, ఆసీస్ టూర్‌లో సత్తా చాటిన సిరాజ్‌ను తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ తన చాంబర్‌లో సన్మానించారు.
సిరాజ్ ఎంగేజ్డ్
సిరాజ్ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తనకు ఎంగేజ్‌మెంట్ అయిందని ఈ యంగ్‌స్టర్ వెల్లడించాడు. అయితే, కాబోయే భార్య ఎవరనే విషయం చెప్పలేదు. గతేడాది జూలైలోనే సిరాజ్‌కు నిశ్చితార్ధం అయిందని అతని సన్నిహితులు చెబుతున్నారు.
For More News..