కొలీగ్స్ ను కాపాడుకోలేకపోయా..
వనపర్తి, వెలుగు: ప్రాణాలకు తెగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సహచరులను కాపాడుకోలేకపోయానని వనపర్తికి చెందిన జెన్‌కో డీఈ పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే డ్యూటీలో ఉన్న పవన్.. మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఫైర్ సిలిండర్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే.. మిగతా వారిని అలెర్ట్ చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా తన కొలిగ్స్‌ను దక్కించుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు.
నెలన్నర కిందటే వచ్చారు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంలో చనిపోయిన కిరణ్ కుమార్.. నెలన్నర కిందటే ట్రాన్స్‌ఫర్ అయి శ్రీశైలం వచ్చారు. పాల్వంచకు చెందిన కిరణ్.. అక్కడి కేటీపీఎస్ లో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ గా పనిచేశారు. పాత ప్లాంట్లను మూసివేయడంతో ఆయన్ను యాదాద్రి పవర్ ప్లాంట్ కు బదిలీ చేశారు. నెలన్నర కిందట ఆఫీసర్లు డిప్యూటేషన్‌పై శ్రీశైలం పంపించారు. ఆయన చనిపోవడంతో పాల్వంచలోని కేటీపీఎస్ కాలనీలో విషాదం అలుముకుంది. కిరణ్ అందరితో కలుపుగోలుగా ఉండేవారని తోటి ఉద్యోగులు, ఇరుగుపొరుగు చెప్పారు. కిరణ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కరోనాను గెలిచినా ..
సూర్యాపేట కలెక్టరే ట్, వెలుగు: సూర్యాపేట జిల్లా జగన్ నాయక్ తండా వాసి దరావత్ సుందర్ నాయక్ శ్రీశైలం ప్లాంట్ లో ఏఈగా పని చేస్తున్నారు. నెల రోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంతో ఊర్లోనే క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందారు. కోలుకుని గురువారం సాయంత్రమే శ్రీశైలం వెళ్లి రాత్రి డ్యూటీలో చేరారు. పని ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ప్రమాదం జరిగి నాయక్ చనిపోయారు.
ట్రాన్స్‌ఫర్ అయ్యుంటే..
కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన ఎట్టి రాంబాబు(40).. 2006లో శ్రీశైలం పవర్ హౌజ్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరారు. 2013లో ఆయన సర్వీసు ను జెన్ కో రెగ్యు లరైజ్ చేసింది. ప్లాంట్ అటెండెంట్ గా పని చేస్తున్న ఆయన.. పాల్వంచలోని కేటీపీఎస్ కు బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే రాంబాబు ప్రాణాలు కోల్పోయారు.
పేద కుటుంబం నుంచి వచ్చి ..
మధిర, వెలుగు: ఏఈ మరసకట్ల వెంకటరావు సొంత ఊరు ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురం. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటరావు కష్టపడి జెన్ కోలో ఉద్యోగం సంపాదించారు. 25 ఏండ్లు పాల్వం చలో పనిచేశారు. ఈ మధ్యనే శ్రీశైలం ప్లాంట్ కు ట్రాన్స్‌ఫర్ మీద వెళ్లారు. ప్రమాదంలో కన్నుమూశారు.