మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కుపై స్టార్ క్యాంపెయినర్ జబర్దస్త్ రాజమౌళి, స్పెషల్ ప్రకటనలు, వాయిస్ మెసేజ్ ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఓటుహక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఆర్వో ప్రేమలత, సాంస్కృతిక సారథి బృందం సభ్యులు మెరుగు రవీందర్, బండ వెంకన్న, ఆశ, కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.