ఆ ఊళ్ళో అంతా  కోటీశ్వరులే.!

పల్లేటూరు అన‌గానే  చిన్న చిన్న ఇళ్లు,   రోడ్లు, చెరువులు, పంట పొలాలు కళ్ల ముందు మెదులుతాయి. కానీ,  కొన్ని ఊళ్లలో  అభివృద్ధే ఉండదు. రోడ్లు, బస్సులు, స్కూళ్ల జాడ ఉండదు. బ్యాంకులకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. కానీ.. గుజరాత్​లో ఓ ఊరుంది. అది పేరుకే ఊరైనా... సంపన్నమైన గ్రామం.  వేలకోట్ల ఆస్తులున్న ఆ గ్రామంలో ప్రత్యేకంగా బ్యాంకులు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లోని మహా సంపన్న గ్రామాల్లో  అది ఒకటి గుజరాత్​లో కచ్​ జిల్లాలో ఉంది ఆ ఊరు పేరు మదపర్​.

తల్లిదండ్రులు జన్మనిస్తే... ఊరు జీవితాన్ని ఇస్తుంది. వ్యవసాయం చేయడానికి భూమి, డబ్బులు సంపాదించుకోవడానికి పని, బతకడానికి కావాల్సిన అన్ని వనరుల్ని  ఊరు ఇస్తుంది. అక్కడ పుట్టి పెరిగి చదువుకొని, విదేశాలకు వెళ్లిన వాళ్లంతా ఊరు గురించి ఆలోచించారు. పుట్టిన ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఇది నలభై ఏండ్ల కిందటే ఆలోచించారు. విదేశాల్లో స్థిరపడి, ఊరి గురించి వాళ్లు తీసుకున్న చొరవే ఇప్పుడు ఆ ఊరిని ధనిక గ్రామంగా మార్చింది. ఎంతోమందికి మంచి భవిష్యత్తును ఇచ్చింది. 

మదప‌ర్‌ మన దేశంలోనే కాకుండా ద‌క్షిణ ఆసియాలోనే  డబ్బున్న గ్రామంగా నిలిచింది. ఈ ఊళ్లో మొత్తం 7,600 ఇళ్లు ఉన్నాయి. అందరికీ కోట్ల ఆస్తి ఉంది. కోట్ల విలువైన ఫిక్స్​డ్ డిపాజిట్లు ఉంటాయి.  సాధారణంగా ఊరివాళ్లు బ్యాంకుకు వెళ్లాలంటే.. ఖ‌చ్చితంగా తాలుకా హెడ్​ క్వార్టర్స్​కు వెళ్లాల్సిందే. కొన్ని కేంద్రాల్లో ఒక‌టీ రెండు బ్యాంకుల‌కు సంబంధించిన బ్రాంచీలు  మాత్రమే ఉంటాయి.  కానీ.. మదపర్​లో 17 బ్యాంకుల బ్రాంచీలు ఉన్నాయి. వాటిలో ఐదు వేల కోట్ల  డిపాజిట్లు ఉన్నాయి. గ్రామంలోని పోస్టాఫీసులోనూ  200  కోట్ల రూపాయలపైనే డిపాజిట్​ సొమ్ము ఉంది. 

ఆధునిక సౌకర్యాలు

ఈ గ్రామంలో హిందీ,  ఇంగ్లీష్ మీడియం  స్కూళ్లతో పాటు ఇంటర్​ కాలేజీలున్నాయి. ఒక షాపింగ్ మాల్ కూడా ఉంది ఇక్కడ. ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్రాండ్ల ఐటమ్స్ అన్నీ  దొరుకుతాయక్కడ. ఈ ఊళ్లో చెరువంత  స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ కాలేజీలు, స్కూల్​ ప్రపంచ స్థాయి స్టాండర్డ్​తో నడుస్తాయి.   మోడర్న్​​ టెక్నాలజీతో పనిచేసే  హాస్పిటల్​ కూడా ఉంది. అయితే ఈ ఊళ్లో ప్రతి కుటుంబం నుంచి  ఒక్కరైనా విదేశాలకు వెళ్లి ఉంటారు.

వ్యవసాయాన్ని మరువలే..

ఈ ఊరు వాళ్లు ఇంత ధనవంతులైనా వ్యవసాయాన్ని మాత్రం వదులుకోలేదు. రోజూ పొలం పనులకు వెళ్తుంటారు. విదేశాల్లో ఉన్నవాళ్లు ఇక్కడి రైతులకు టెక్నాలజీ సాయం అందిస్తారు. మార్కెటింగ్​ సపోర్ట్​ ఇస్తుంటారు. ఇక్కడ ప్రధానంగా మామిడి, మొక్కజొన్న, చెరకు పండిస్తారు. వాటిని ముంబైకి ఎగుమతి చేసి డబ్బు సంపాదిస్తారు. 

1968కి ముందు ఈ గ్రామం నుంచి చాలా మంది లండన్​కి వెళ్లి  స్థిరపడ్డారు. లండన్​లో ఈ గ్రామం పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ‘మదపర్ విలేజ్ అసోసియేషన్’ అని పేరు పెట్టి  ఊరి కల్చర్, వ్యవసాయం గురించి మాట్లాడుకుని భవిష్యత్తు  తరాలకు వాళ్ల వంతు చేయాల్సిన  పనుల గురించి ఒక అంచనకు వస్తారు. కొన్ని రోజుల తర్వాత  మదపర్ విలేజ్ అసోసియేషన్ ఆఫీస్​ను సొంత ఊళ్లో కూడా మొదలుపెట్టారు.  దీంతో లండన్​లో ఉన్న వాళ్లు, గ్రామస్తులతో కమ్యూనికేట్​ కావడం​ మరింత ఈజీ అయ్యింది. అక్కడి విషయాలు, ఇక్కడి విషయాలు అన్నీ మాట్లాడుకొనే వాళ్లు. విదేశాల్లో ఉన్నవాళ్లు, ఊళ్లో వాళ్లు లోకల్​గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్లు. అలా కొన్ని రోజుల తర్వాత మదపర్ విలేజ్ అసోసియేషన్ లండన్​లోనే కాకుండా వేరే  దేశాల్లో  కూడా మొదలైంది. వేరువేరు దేశాల్లో  ఉన్న ఊరివాళ్లు అసోషియేషన్​లో భాగమయ్యారు.  అలా అందరూ కలిసి ఊరిని కాపాడాలని, ఊరి కల్చర్​ని, వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని సంకల్పించారు. 

యువకులను ఎడ్యుకేట్​ చేస్తూ, ఉద్యోగాల కోసం విదేశాలకు తొవ్వ చూపించారు. అలాగే వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్లకు డబ్బు సాయం చేస్తూ అండగా నిలిచారు.  అందరూ కలిసి  ఊరి  ఇంపార్టెన్స్​ని గుర్తించి అభివృద్ధి చేశారు. అందరికి ఆదర్శంగా నిలిచారు.  

మహిళలు కాపాడిన రక్షక్​ వన్​

మదపర్​ ఊరి శివారులో ఉండే సరస్పర్​ గ్రామంలో రక్షక్ వన్​ అని పిలిచే  గార్డెన్​ ఉంది. కచ్​లో దీన్ని మినీ ఫారెస్ట్​ అంటారు. కొన్నేళ్లుగా అధికారులు, స్థానికులు కలిసి ఈ ఫారెస్ట్​ను కాపాడుతున్నారు.1971లో ఇండోపాక్​ యుద్ధ సమయంలో ఈ ప్రాంతంలో పాకిస్తాన్ 14 బాంబులు వేసింది. ఆ దాడిలో ‘రక్షక్​ వన్’ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అయితే అధికారులు మళ్లీ ఆ వనాన్ని మళ్లీ పచ్చగా మార్చాలి అనుకున్నారు. అప్పుడు మదపర్​ గ్రామానికి చెందిన మహిళలే కూలీలుగా మారి రక్షక్​ వన్​ను​ మూడు రోజుల్లో శుభ్రంచేసి. చెట్లు పెరిగేందుకు భూమిని అనువుగా మార్చారు. అసలక్కడ బాంబు దాడి జరిగిన ఛాయలు లేకుండా చేశారు. వాళ్లందరి కృషి ఫలితంగానే రక్షక్​ వన్​ ఇప్పటికీ పచ్చగా ఉంది.