అప్పుడు శివన్ ఎక్కెక్కి ఏడ్చిండు. ఇప్పుడు సోమనాథ్ నవ్విండు. ఎగుర్కుంట డ్యాన్స్ కూడ జేసిండు. గిది ఓల్డ్ వీడియో అని తర్వాత తెలిసింది. అయినా.. గీ సంబురంతోటి శివన్ నాలుగేండ్ల బాధ గూడ తీరిపోయే ఉంటది. గందుకే మాపటీలి ఎంత లేట్ అయినా గానీ రోవర్ చంద్రుని మీదికి దిగేదాకా చూసి గాని ఇంటికి పోలేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక డ్యూటీ కాదు.. గంతకంటే ఎక్కువనే వాళ్లకు. ఎవలకైనా గిసొంటప్పుడే వస్తయి మళ్ల కన్నీళ్లయినా.. ఆనందబాష్పాలైనా! చంద్రయాన్ 3 సక్సెస్ ను విక్రమ్ సారాభాయ్ గూడ పైనుంచి చూసే ఉంటరు. తన పేరు పెట్టిన విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ కావడం చూసి మస్త్ సంబురపడి ఉంటరు.
సైకిల్ పై రాకిట్లను మోసుకుపోయి ప్రయోగాలు చేసిన కాలం నుంచి.. హాలివుడ్ సిన్మాల కన్నా తక్కువ బడ్జెట్ తోటే ఏకంగా చంద్రుడిపై ల్యాండర్ ను దింపే స్థాయికి ఇస్రో ఎదగడం జూసి గర్వంతో ఉప్పొంగిపోయే ఉంటరు. గట్లనే విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ పై కామెంట్లుపెట్టే నెపంతోటి జనమంతా సోషల్ మీడియాల వాదులాటలకు దిగడం గూడ ఆయన చూసే ఉంటరు. ఇదేం తరీఖరా నాయినా.. సైన్స్ అండ్ టెక్నాలజీల మనం ఎక్కడి నుంచి ఎక్కడికో చేరినం. అది ఇడ్సిపెట్టి ఇట్ల కొట్లాడుకుంటున్నరేందిరా? ఇదేం పోయేకాలం అని గూడ జరంత నొచ్చుకునే ఉంటరు!
ఎవరి ఎజెండా వాళ్లదే..
నిజానికి వేరే దేశపోళ్లతోటి పోటీ అంటేనే సాలు ప్రతి ఒక్కలకూ దేశభక్తి గుండెల నుంచి ఆటోమేటిగ్గా తన్నుకొస్తది. గట్లనే కిర్కెట్ అయినా ఇంకో ఆట అయినా.. పక్క దేశపోళ్లతోటి కొట్లాటలైనా.. రాకిట్ల ప్రయోగాలైనా ప్రతి ఒక్కలకూ దేశభక్తి పొంగుకొస్తది. చంద్రయాన్ విషయంల గూడ గట్లనే అందరూ పొద్దుగాల లేసినప్పటి సంది మాపటీల పండుకునేదాంక పరమ దేశభక్తులైపోయిన్రు. సోషల్ మీడియాల పోస్టుల మీద పోస్టులు పెట్టి దేశభక్తి చాటుకున్నరు. ఇదంతా బాగనే ఉంది గానీ.. చంద్రయాన్ ను అడ్డంబెట్టుకుని ఎవల ఎజెండాను వాళ్లు ఎత్తుకునుడుతోటే ఒచ్చింది
చిక్కంతా! ఫేస్బుక్ ల గదే లొల్లి, వాట్సాప్‌ల జూస్తే గదే గడ్బడ్ నడిచింది. ట్విట్టర్ల గదే తీరున పోస్టులు కనవడ్డయి. లెఫ్టిస్టులు రైటిస్టుల మీద జోకులేస్తే.. రైటిస్టులు లెఫ్టిస్టులను తగుల్కుంటన్రు. సెంటరిస్టులది మరో గోల. ఇగ సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులు, మేధావులు, హేతువాదులు, జన విజ్ఞాన వేదికోళ్లు.. ఒకలనిగాదు, అందరూ అసలు ముచ్చట వెనుక ఎజెండాను బట్టి పోస్టులు పెడుతున్రు, వాదులాటలకు దిగుతున్రు.
పాపం ప్రకాష్ రాజ్
గట్లనే ప్రకాష్ రాజ్ ముచ్చట గూడ జరంత జెప్పుకోవాలె. పాపం.. అప్పుడెప్పుడో కేరళల ఎవలో వేసిన పాత కార్టూన్ ఒకటి దీస్కొచ్చి ట్విట్టర్ల వెట్టిండు. కేరళోళ్లు దునియాల ఏడికిబోయినా కన్పిస్తరని.. చంద్రుడి మీద గూడ ఉంటరని పాత జోకులు ఉన్నయి. చంద్రుడిపైన గురుత్వాకర్షణ తక్కువ గదా.. అక్కడ కేరళాయన ఒకరు చాయ్ తయారు జేయనీకి తంటాలు పడుతున్నట్లుగా ఉంటది ఒక కార్టూన్ల. గందుకే పనిలో పనిగా చంద్రయాన్ సాకుతో పాత కార్టూన్ తో కొత్తగా మోదీని గిచ్చాలని చూసిండు ప్రకాష్ రాజ్.
కానీ ఇదేమో దేశభక్తి పొంగిపొర్లే టైమాయె. ఇగ జనం ఊకుంటరా? ఇస్రో మీదనే జోకులేస్తవా? అని పొట్టు పొట్టు దిట్టిన్రు. మోదీని ప్రకాష్ రాజ్ గిచ్చాలని జూస్తే.. ప్రకాష్ రాజ్ ను జనాలు మీదవడి తొడపాశాలు పెట్టినంత పనిచేసిన్రు. అయినా ఆయన మోనార్క్ గదా గవన్నీ పట్టిచ్చుకుంటడా ఏందీ? మాపటీల విక్రమ్ అట్ల ల్యాండ్ కాంగనే ఇట్ల శభాష్ ఇస్రో అని ట్వీట్ జేసిండు. ఇగ ఈ ట్వీట్ తోటి బారా ఖూన్ మాఫ్ అనుకుంట నిమ్మలంగ మంచమెక్కి నిద్రవోయిండు!
క్రెడిట్ మావోళ్లదే.. కాదు మావోళ్లదే
ప్రధాన పార్టీల లీడర్లు గూడ మస్త్ వాదులాటలకు దిగిన్రు. గప్పుడు మా లీడర్లు బాటలు వేయకుంటే గిప్పుడు చంద్రయాన్ చంద్రుడి మీదకు ఎట్ల పోయేదని వాళ్లు అంటే, గిప్పుడు చంద్రయాన్ చంద్రుడి మీదకు పోయేతందుకు వెనకుండి సైంటిస్టులను ప్రోత్సహించింది, మిషన్ కు సర్కారు తరఫున సహకారం అందజేసిందీ మా లీడరేనంటని వీళ్లు కౌంటర్లు ఇచ్చుకున్నరు. గిన్నేండ్లు మీరే ఏలితిరి.. గిప్పుడు మా ఏలుబడి ఒచ్చేసరికి దొంగ ఏడుపులు షురూ జేసిన్రా? అని గూడ అర్సుకున్నరు.
పేదరికం పోతదా?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి75 ఏండ్లు దాటినా, ఇప్పటికీ తిండి కోసం చెత్తకుండీలల్ల ఎంకులాడే ప్యాదలున్నరు. ఈ రాకిట్లు, ల్యాండర్లు ఆళ్ల ఆకలి తీరుస్తయా? అంటని కొందరంటే.. ఇండ్లు లేక రోడ్ల మీద బతుకుతున్న పేదలకు నీడనిస్తయా? అని కొందరు పెదవిరిసిన్రు. ఈ రాకిట్లు, గీకిట్లు జనానికి తిండి పెడ్తయా? అసలు ఈటితోటి డెవలప్మెంట్ ఏమన్నా అయితదా? అంటని ప్రశ్నలేసిన్రు. ఇగ హేతువాదులైతే.. ముహూర్తాలు కుదిరినయా? రాహుకాలంల ఎట్ల సక్సెస్ అయిందబ్బా? అంటని ఎటకారాలు జేసిన్రు.
గట్లనే జన విజ్ఞాన వేదిక వాళ్లు రంగంలోకి దిగిన్రు. చంద్రుడి పేరుతో ఉన్న కథలన్నీ కట్టుకథలని, మూఢ నమ్మకాలని గిప్పటికైనా నమ్మాలె అనుకుంట హితబోధ జేసిన్రు. అక్కడ రాళ్లు, మట్టి తప్ప ఏమీ లేదని విక్రమ్ పంపిన ఫొట్వలే చెప్తున్నయని రుజువులు గూడ జూపెట్టి చేతులు దులుపేసుకున్నరు.
ఆఖరు ముచ్చట
ఇవన్ని ఎట్లున్నా.. ఆఖరుగా ఒక ముచ్చట అయితే సోచాయించాల్సినదే ఉన్నది. ఒక పక్క దేశంల ఇంకా పేదలున్నరు. ఇండ్లు లేనోళ్లున్నరు. ఉద్యోగాలు లేనోళ్లున్నరు. ఈ రాకిట్లతోటి ఏం లాభం? అంటే.. కండ్ల ముందే అన్నీ కన్పిస్తున్నయనే చెప్పుకోవాలె. రాకిట్ ప్రయోగాలు వద్దనుకుంటే ఇయ్యాల ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా, ఈ చర్చలు సుతా ఉండేటియి గావు. గట్లనే రాకిట్లు పంపుడే డెవలప్మెంటా? అంటే.. దానికి, దీనికి ముడిపెట్టుడు కరెక్ట్ కాదు. ఒకపక్క డెవలప్మెంట్ పేరుతోటి కాళ్ల కింద నేలను ఎడారిగా మార్చుకుంటున్నం.. మరోపక్క నెత్తి మీద జాబిల్లి కోసం చేయి చాస్తున్నం. ఒక్క ఇండియా మాత్రమే గాదు.. అగ్ర దేశాలన్నింటిదీ ఇదే తీరు. కానీ ఇందుట్ల గూడ తప్పుపట్టే పనిలేదు. మానవాళి మనుగడ కోసం విశ్వ శోధన ఎప్పుడూ జరుగుతూనే ఉండాలె. అది అనివార్యం. గట్లనే.. ఉన్న భూమిని సుతా కాపాడుకోవాలె. ఇది గూడ అనివార్యమే!
ప్రతి ఒక్కలూ ఒక సైంటిస్టే..
న్యూస్ చానళ్ల హడావుడి అంతా ఇంతా గాదు. కొన్ని చానళ్ల వాళ్లు అయితే ముందే చంద్రుడి మీదకు బోయి ఈసారి పక్కాగా ఎట్లా ల్యాండ్ కావాల్నో విక్రమ్ ల్యాండర్ కు పాఠాలు గూడ జెప్పిన్రు. ఊరందరిదీ ఓ దారి అయితే ఉలిపికట్టెది ఇంకో దారి అన్నట్ల ఓ చానల్ ఎప్పట్లెక్కనే భజన పోగ్రాం నడిపింది. మధ్య మధ్యల వాళ్లకే బోర్ కొట్టినట్లయి విక్రమ్ చంద్రుడిపై దిగిందని బ్రేకింగ్ లు ఏసిన్రు. జనాలు గీ ముచ్చటను గూడ సోషల్ మీడియాల బాగానే అర్సుకున్నరు. యూట్యూబ్ చానళ్ల హడావుడి అయితే చెప్పతరంగాదు. ప్రతి ఒక్కలూ ఒక సైంటిస్టే అయిపోయిన్రనుకోరాదూ.
హన్మిరెడ్డి యెద్దుల సీనియర్ జర్నలిస్ట్