- తొలిసారి ఓ పోడ్కాస్ట్లోమాట్లాడిన ప్రధాని
- ‘నేషన్ ఫస్ట్’.. నా ఐడియాలజీ
- చంద్రయాన్–2 లాంచ్కునన్ను వెళ్లొద్దన్నరు ఓటమికి ఏడ్వను.. రిస్క్
- తీసుకునేందుకు సిద్ధంగా ఉంటా
- గుజరాత్ ఎన్నికలు, బాంబు పేలుళ్లు,గోద్రా ఘటన అతిపెద్ద సవాళ్లని వెల్లడి
న్యూఢిల్లీ: జీవితంలో తాను కూడా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, తానూ మనిషినేనని, దేవుడ్ని కానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే ఎన్నడూ, ఏ తప్పూ చెడు ఉద్దేశంతో చేయలేదని తెలిపారు. మోదీ తొలిసారి పాల్గొన్న ఓ పోడ్కాస్ట్ శుక్రవారం రిలీజ్ అయింది. ఆన్ లైన్ బ్రోకరేజ్ సంస్థ ‘జెరోధా’ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ‘పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్’ సిరీస్‌లో భాగంగా నిర్వహించిన ఈ పోడ్కాస్ట్లో అనేక అంశాలపై మోదీ మాట్లాడారు.
తన బాల్యం, విద్య, రాజకీయాలు, అనుభవాలను పంచుకున్నారు. చిన్నప్పుడు తాను ఇంట్లో అందరి బట్టలనూ ఉతికేవాడినని.. అందుకే తనను చెరువుకు వెళ్లనిచ్చేవారని గుర్తు చేసుకున్నారు.స్కూలులో తాను యావరేజ్ స్టూడెంట్ గానే ఉండేవాడినని, కానీ వివిధ యాక్టివిటీల్లో మాత్రం చాలా చురుకుగా ఉండేవాడినన్నారు.
రెండు గంటల పాటు సాగిన ఈ పాడ్‌కాస్ట్ లో ముందుగా నిఖిల్ కామత్ మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన తనకు హిందీ అనర్గళంగా రాదని, తప్పులు మాట్లాడితే క్షమించాలని మోదీని కోరారు. తొలిసారి ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు భయంగా ఉందన్నారు. అయితే, తనకు కూడా ఇది తొలి పాడ్‌కాస్ట్ అని, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంత బెరుకుగానే ఉందని బదులిచ్చారు.
చంద్రయాన్2 లాంచ్ కు వెళ్లొద్దన్నరు..
రాజకీయాల్లో అనుకోని సంఘటనలు ఎన్నో జరిగాయని, అలాగే ఎన్నో వైఫల్యాలను చవి చూశానని మోదీ తెలిపారు. ‘‘కొంతమందిలా ఓటమి ఎదురైనప్పుడు నేను ఏడ్చేవాడిని కాను. జీవితంలో ప్రతి క్షణం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండేవారిలో ఒకడిని” అని ఆయన చెప్పారు. 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం ఫెయిల్ అయిన సందర్భాన్ని కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ రోజు లాంచ్ ఈవెంట్ కు నన్ను వెళ్లవద్దని చాలా మంది అన్నారు. చాలా దేశాలు ఫెయిల్ అయ్యాయి. ఆ దేశాలు నాలుగు లేదా ఆరో ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాయి.
ALSO READ : రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
ఒకవేళ ఈ ప్రయోగం ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. నా బాధ్యత ఉందని వెళ్లాను. అయితే, చంద్రయాన్ 2 ఆఖరి నిమిషంలో క్రాష్ అయింది. ప్రతి ఒక్కరూ బాధలో ఉన్నారు. ఆ విషయాన్ని ప్రధానికి చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయారు. కానీ నేను ఓటమికి ఏడుస్తూ కూర్చుని ఉండిపోయే రకం కాదు. అందుకే మరునాడు ఉదయం ఇస్రో సైంటిస్టులను కలిశాను. ఓటమికి నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పా. వారిపై నమ్మకం ఉందని, ధైర్యంగా ముందడుగు వేయాలన్నా. ఆ తర్వాత ఇస్రో సైంటిస్టులు కష్టపడి చంద్రయాన్ 3ని సక్సెస్ చేశారు” అని ప్రధాని వివరించారు.
సీఎంగా చేయగలిగిందంతా చేశా..
జీవితంలో అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కలిగే ఆందోళన, ఒత్తిడిని మేనేజ్ చేయడం గురించీ మోదీ వివరించారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటూ నిరంతరం పని చేసుకుంటూ పోతానని చెప్పారు‘‘సవాళ్లను ఎదుర్కోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో సామర్థ్యం, విధానం ఉంటుంది. నేను భావోద్వేగాలను నియంత్రించుకుని పని చేసుకుంటూ పోవాల్సిన స్థానంలో ఉన్నా. అందుకే అన్ని ఎమోషన్స్ నుంచీ దూరంగా ఉన్నా” అని వెల్లడించారు. ‘‘నా జీవితంలో అతిపెద్ద సవాల్ 2002 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు. ఫలితాల రోజు నేను టీవీ కూడా చూడలేదు. మధ్యాహ్నం సమయంలో సీఎం బంగ్లా బయట డ్రమ్స్ మోగిస్తూ వేడుకలు షురూ అయ్యాయి.
ఆ తర్వాతే ఎన్నికల్లో గెలిచామన్న విషయం నాకు తెలిసింది. బాంబు పేలుళ్లు జరిగినప్పుడు సీఎంగా ఉన్నా. రిస్క్ ఉంటుందని చెప్పినా.. హాస్పిటల్స్ కు వెళ్లి బాధితులను పరామర్శించా. పోలీస్ కంట్రోల్ రూంకు వెళ్లి పరిస్థితిని సమీక్షించా. 2002లో నేను రాజ్ కోట్ బైఎలక్షన్ లో ఎమ్మెల్యేగా గెలిచిన మూడు రోజులకే గోధ్రా రైలు దహనం ఘటన జరిగింది. అప్పుడు కూడా భద్రతా పరంగా ప్రమాదమని తెలిసినా.. సంఘటనా స్థలానికి వెళ్లాను. ఎక్కడ చూసినా కాలిన మృతదేహాలు కనిపించాయి. అయినా, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాను. సీఎంగా చేయగలిగిందంతా చేశాను” అని మోదీ తెలిపారు.
జిన్ పింగ్ మా ఊరొచ్చారు..
గుజరాత్ లోని తన హోమ్ టౌన్ వాద్ నగర్ కు చైనా యాత్రికుడు హ్యుయెన్ త్సాంగ్ 1,400 ఏండ్ల క్రితం వచ్చి కొన్నాళ్లు ఉన్నారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఆయన చైనాలోని జియాన్ గ్రామంలో నివసించారన్నారు. తాను 2014లో ప్రధాని అయిన సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా జిన్ పింగ్ ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు.
హ్యుయెన్ త్సాంగ్ కు వాద్ నగర్ తో లింక్ ఉన్నందున అక్కడికి వస్తానని చెప్పారని, అనుకున్నట్టే 2014లోనే ఆయన వాద్ నగర్ కు వచ్చారన్నారు. ఆ మరుసటి ఏడాది తాను కూడా చైనా పర్యటనలో భాగంగా జియాన్ ను సందర్శించానని వివరించారు. వాద్ నగర్ అప్పట్లో ఆనంద్ నగర్ అనే పేరుతో, ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా ఉండేదన్నారు.
గాంధీజీ టోపీ పెట్టుకోకపోయినా..
రాజకీయాల్లో కమ్యూనికేషన్, డెడికేషన్, ప్రజలతో కనెక్ట్ అయి ఉంటేనే విజయం సాధ్యమని మోదీ అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ నాయకత్వ లక్షణాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. ‘‘ప్రజలతో బాగా కనెక్ట్ అయ్యే సామర్థ్యం గాంధీజీకి ఉండేది. తన వ్యక్తిత్వం, ఆచరణల ద్వారానే ఆయన దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చారు.
ఆయన ఎన్నడూ టోపీ ధరించలేదు. కానీ ప్రపంచం గాంధీ టోపీని గుర్తు పెట్టుకుంది. నిజమైన కమ్యూనికేషన్, లీడర్షిప్ కు ఇదే నిదర్శనం” అని చెప్పారు. రాజకీయాల్లోకి రావడం చాలా ఈజీ అని, కానీ విజయం సాధించడమే కష్టమన్నారు.
మీమ్స్ పట్టించుకోను..
గత ఒకటి రెండేండ్లుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న మీమ్స్ పైనా మోదీ స్పందించారు. ప్రధానంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని, తనను కలిపి చేసిన ఎన్నో మీమ్స్ వైరల్ కావడంపై నిఖిల్ కామత్ ప్రశ్నించగా.. ‘‘మీమ్స్ వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోను” అని ప్రధాని చెప్పారు.
నా సిద్ధాంతం.. ‘నేషన్ ఫస్ట్’
‘నేషన్ ఫస్ట్’ అన్న సిద్ధాంతాన్నే తాను ఫాలో అవుతున్నానని, ఇందుకోసం పాత ఆలోచనలను వదులుకుని, కొత్త ఆలోచనలను స్వీకరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మోదీ చెప్పారు. ప్రస్తుతం దేశం కోసం కష్టపడి పని చేస్తున్న యువ నాయకులు అనేక మంది ఉన్నారన్నారు. దేశం కోసం పాటుపడే ఆలోచనలున్న యువత మరింత మంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పుడు దేవుడు పంపాడన్నారు: కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్
తాను కూడా మనిషినేనని, దేవుడిని కానంటూ పోడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. కొన్ని నెలల క్రితం లోక్ సభ ఎన్నికల సమయంలో తాను దేవుడు పంపించిన దూతను అని మోదీ అన్నారని.. ఇప్పుడేమో తాను కూడా మనిషినే అని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తనను దేవుడు పంపాడని చెప్పడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చినందుకే.. ఇప్పుడు ఆ నష్ట నివారణలో భాగంగా తానూ మనిషినే అని మోదీ చెప్పుకుంటున్నారని విమర్శించారు.
కాగా, లోక్ సభ ఎన్నికల సమయంలో మోదీ మాట్లాడుతూ.. తన తల్లి మరణించిన తర్వాత ఎదురైన అనుభవాలను బట్టి తనను దేవుడు పంపించినట్టుగా భావిస్తున్నానని మోదీ అన్నారు. తనకు దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడని, ఆ శక్తితోనే దేశానికి సేవ చేస్తున్నానన్నారు.