ఆర్టీఐని బలోపేతం చేయాలి

సమాచార హక్కు అనేది 2005లో చేసిన భారత పార్లమెంట్ చట్టం. ఇది పౌరుల సమాచార హక్కుకు సంబంధించిన నియమాలు, విధానాలను నిర్దేశిస్తుంది. పూర్వపు సమాచార స్వేచ్ఛ చట్టం 2002 స్థానంలో దీన్ని తెచ్చారు. ఆర్టీఐ నిబంధనల ప్రకారం భారతదేశంలోని ఏ పౌరుడైనా పబ్లిక్ అథారిటీ నుంచి సమాచారాన్ని అభ్యర్థించవచ్చు, దీనికి త్వరితగతిన లేదా30 రోజులలోపు సమాధానం ఇవ్వాలి. దరఖాస్తుదారు జీవితం స్వేచ్ఛకు సంబంధించిన అంశం విషయంలో, 48 గంటల్లో సమాచారాన్ని అందించాలి. పౌరులు అధికారికంగా సమాచారం కోసం అభ్యర్థించడానికి అవసరమయ్యేలా, ప్రతి పబ్లిక్ అథారిటీ విస్తృత వ్యాప్తి కోసం వారి రికార్డులను కంప్యూటరీకరించాలని, నిర్దిష్ట వర్గాల సమాచారాన్ని ముందస్తుగా ప్రచురించాలని చట్టం చెబుతున్నది. 2020 సెప్టెంబర్ 20న అశ్వనీ కె. సింగ్ కేసులో సమాచార హక్కు ప్రాథమిక హక్కు అని నిర్ధారణ అయింది. 

ప్రతి పబ్లిక్ అథారిటీ పనిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడమే ఆర్టీఐ లక్ష్యం. ఈ చట్టం మొత్తం దేశానికి వర్తిస్తుంది. ఇది కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థతో సహా అన్ని రాజ్యాంగ అధికారాలను కవర్ చేస్తుంది. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా స్థాపించబడిన ఏదైనా సంస్థ, ప్రైవేట్ సంస్థలు ఈ చట్టం పరిధిలోకి రావు. సర్బ్‌‌‌‌జిత్ రాయ్ వర్సెస్ ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయంలో ప్రైవేటీకరించబడిన ప్రజాప్రయోజనం కలిగిన కంపెనీలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ కూడా పునరుద్ఘాటించింది. 

విస్తృత అవగాహన అవసరం

ఇటీవల, సతార్క్ నాగ్రిక్ సంగతన్  సమాచార హక్కు చట్టం 2021-–22 ప్రతిస్పందన నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. తమిళనాడు ఆర్టీఐ ప్రతిస్పందనలో అత్యంత అధ్వానంగా ఉందని, కోరిన సమాచారంలో 14% మాత్రమే అందించిందని తేలింది. అడిగిన సమాచారంలో 23% షేర్ చేసుకుంటూ మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఈ మదింపులో భాగంగా దాఖలైన ఆర్టీఐ దరఖాస్తులకు10 రాష్ట్రాలు మాత్రమే పూర్తి సమాచారాన్ని అందించాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, నాగాలాండ్, త్రిపుర ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తమకు అందిన అప్పీళ్లు లేదా ఫిర్యాదులలో దాదాపు 40% తిరిగి వచ్చాయి. 18 మంది సమాచార కమిషనర్లలో 11 మంది ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే అప్పీళ్లు లేదా ఫిర్యాదులను తిరిగి ఇచ్చినట్లు అంచనా. సమాచార హక్కును రాజకీయ పోరాటాల్లో ఉపయోగించడం, రాజకీయ ప్రత్యర్థుల విద్యా స్థాయిలను అడగడం లాంటి చర్యలతో దుర్వినియోగం చేస్తున్నారనే అపవాదు వినబడుతున్నది. 

కొన్ని చోట్ల ఆర్టీఐ కార్యకర్తలు దాడులు, హత్యలకు గురయ్యారు. ఆర్టీఐ సమర్థవంతంగా అమలు కావడం కోసం ప్రభుత్వ సంస్థలు తమ వెబ్‌‌‌‌సైట్లలో బహిర్గతం చేయదగిన మొత్తం సమాచారాన్ని ఉంచాలి. నకిలీ కేసులను తొలగించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పిటిషన్ దాఖలు చేయడానికి కారణాన్ని తెలుసుకునే నిబంధనను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్టీఐ దుర్వినియోగాన్ని కొంత వరకు నిరోధించవచ్చు. సమాచార కమిషనర్ విలువైన సమయాన్ని వృథా చేసినందుకు జరిమానా విధించే నిబంధన ఉండాలి. సమాచార హక్కు, చట్టం పరిధిలోని గోప్యత హక్కుతో సమతుల్యత కలిగి ఉండాలి. సంబంధిత స్థానిక ప్రాంతాల్లో ప్రాంతీయ భాషల్లో రేడియో, టెలివిజన్, ప్రింట్ మీడియా ద్వారా అవగాహన ప్రచారాలను ప్రారంభించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలి. చట్టం పనితీరు దేశంలో ఎప్పటికీ సమాచార హక్కుకు సంబంధించిన కార్యకలాపాల్లో ప్రజల అవగాహన, భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది.

అనుకూలతలు - ప్రతికూలతలు

రాజకీయ పార్టీలు ప్రజా అధికారాలనీ, సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులకు జవాబుదారీగా ఉంటాయని కేంద్ర సమాచార కమిషన్ పేర్కొంది. కానీ 2013 ఆగస్టులో ప్రభుత్వం సమాచార హక్కు(సవరణ) బిల్లును ప్రవేశపెట్టింది. ఇది చట్టం పరిధి నుంచి రాజకీయ పార్టీలను తొలగిస్తుంది. ప్రస్తుతం ఏ పార్టీలూ ఆర్టీఐ చట్టం కింద లేవు. అన్ని రాజకీయ పార్టీలను దాని పరిధిలోకి తీసుకురావడానికి కేసు నమోదైంది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తెస్తూ ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని 13 నవంబర్ 2019న భారత సుప్రీంకోర్టు సమర్థించింది.

 ఈ చట్టం ప్రయోజనాలు చూస్తే దేశం లోని సామాన్యులు చొరవ ద్వారా ఏదైనా సమాచారం గురించి తెలుసు కునేందుకు పూర్తి హక్కులను పొం దడం, సమయ పరిరక్షణ, సమాచార రక్షణ, బాధ్యతా యుతమైన అధికారి ద్వారా సమా ధానాన్ని పొందడం, అవినీతికి అవకాశాలు తగ్గడం లాంటివి చెప్పుకోవచ్చు. ప్రతికూలతలు చూస్తే తప్పుడు సమాచారాన్ని పొందడం, వివిధ స్థాయిల్లో వివిధ అధికారుల నుంచి ఆకస్మిక సమాచారం అడగడంపై కేసులు నమోదు చేయడం, ప్రక్రియను నిర్వహించడం అధికారులకు అదనపు భారం లాంటివి ఉంటాయి. 

వివిధ రాష్ట్రాల్లో ఆర్టీఐ

చట్టం పనితీరు చూస్తే ఆర్టీఐ అభ్యర్థనలు తిరస్కరించబడటమే గాక అధికార వ్యవస్థలు లక్షలాది అభ్యర్థనలతో కూరుకుపోవడంతో ప్రభుత్వాన్ని పారదర్శకంగా, జవాబుదారీగా చేయాలనే సమాచార హక్కు చట్టం అసలు ఉద్దేశం కుంటుపడుతోందనేది మేధావుల మాట. ఢిల్లీలోని సమాచార కమిషనర్‌‌‌‌లకు చేసిన ఆర్టీఐ అప్పీళ్లలో 60 శాతం అప్పీళ్లు టైప్ చేయకపోవడం లేదా ఇంగ్లీషులో రాయకపోవడం లేదా జత చేసిన పేపర్‌‌‌‌ల సూచిక లేక తేదీల జాబితా లేకపోవడం వంటి వివిధ కారణాలతో తిరస్కరణకు గురవుతున్నాయి. చాలా మంది పౌరులు తమ ఆర్టీఐలను ఫైల్ చేయడానికి ఎన్జీవోలు, ఆర్టీఐ కార్యకర్తలు లేదా న్యాయవాదులను సంప్రదించాల్సి వస్తుంది. బీహార్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ సమాచార హక్కు చట్టం, 2005 కింద సంవత్సరానికి గరిష్ట సగటు దరఖాస్తులను స్వీకరించిన మొదటి ఐదు భారతీయ రాష్ట్రాలు. బీహార్ రాష్ట్ర సమాచార కమిషన్ పనితీరు బాగుంది. 2022 ఏడాదిలో దరఖాస్తుదారులు కోరిన సమాచారంలో 67% అందించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,00,000 సమాచార హక్కు అప్పీళ్లు పెండింగ్​లో ఉన్నాయి. గుజరాత్ సమాచార కమిషన్  గత రెండేళ్లలో ఆర్టీఐ కింద దరఖాస్తులను దాఖలు చేయకుండా తొమ్మిది మంది దరఖాస్తుదారులను బ్లాక్ లిస్ట్ చేసి నిషేధించింది. అలాగే 44% సమాచార కమిషనర్ల కొరత ఉన్నది. తెలంగాణ పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. దేశంలోని అత్యధిక జనాభాలో పేదలు ఉండటం, అక్షరాస్యత పూర్తిగా లేకపోవడం, ఉన్నా ఆర్టీఐపై అవగాహన లేకపోవడం వల్ల చట్టం ఉద్దేశాలు ఆశించిన స్థాయిలో నెరవేరడం లేదు. 

- డా. పీఎస్ చారి,ప్రొఫెసర్