ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మునుగోడు బై ఎలక్షన్​ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి విజయ రామారావు

మునుగోడు, వెలుగు: నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీఆర్ఎస్​పార్టీ విఫలమైందని  మునుగోడు బై ఎలక్షన్​కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్యే విజయరామారావు విమర్శించారు. మంగళవారం మునుగోడు  మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి , కోతులారం, పలివెల, కచలాపురం, జక్కలవారి గూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ‘మన మునుగోడు మన కాంగ్రెస్’  లో భాగంగా టీఆర్ఎస్​, బీజేపీలపై కాంగ్రెస్​రిలీజ్​చేసిన చార్జిషీట్​ను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బైఎలక్షన్స్​లో ఓట్లు అడిగేందుకు వస్తున్న టీఆర్ఎస్​లీడర్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో  రైతులు అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో చేనేత కార్మికుల పొట్ట కొడుతోందని, నిత్యావసర వస్తువులు పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు నిలబడి గెలిపించాలని కోరారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఏఐసీసీ మెంబర్​పాల్వాయి స్రవంతి, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్, సర్పంచ్​లు శ్రీను యాదవ్​, వెంకటేశ్​యాదవ్​ పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

మునగాల, వెలుగు : జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని  సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కోరారు. మంగళవారం మునగాల మండలంలోని గణపవరం, వెంకటరామపురం, తాడువాయి గ్రామాల్లో  నిర్వహించిన అవగాహన సదస్సులకు ఆయన హాజరై మాట్లాడారు. ఆయా గ్రామాల్లో కొత్త ఓటర్ల నమోదు,  సవరణలు, తొలగింపు కార్యక్రమంలో సంబంధిత బీఎల్​వోలు , ఇతర అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా ఆధార్ కార్డు అనుసంధానం చేయించాలని ఆఫీర్లను ఆదేశించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. ఎంపీపీ బిందు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ
 

ప్రకటించి ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు    డిమాండ్​ చేశారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నర్సింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులతో ప్రజలు తల్లడిల్లుతుంటే వైద్యారోగ్య శాఖ అధికారులు  పట్టించుకోవడం లేదని యుద్ధ ప్రాతిపదికన వైద్యసేవలందించాలని డిమాండ్ చేశారు. ప్రైమరీ హెల్త్​సెంటర్ల ద్వారా 24 గంటలు ప్రజలకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ వైద్యమందక ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో  ఉద్యమిస్తామని హెచ్చరించారు.  జిల్లా ఉపాధ్యక్షుడు పులుసు సత్యం, జిల్లా సహాయ కార్యదర్శి  అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


 బీజేపీ గెలుపు కోసం పనిచేయండి

చండూరు (మర్రిగూడ) వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం చండూరు మండలం కుదాబక్షిపaల్లి గ్రామానికి చెందిన ఒకే వర్గానికి చెందిన 50 కుటుంబాలు  మాజీ ఎంపీపీ అనంత రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్​రెడ్డి వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీతోనే నియోజకవర్గం అభివృద్ధి  జరుగుతుందని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్​రెడ్డి చెప్పారు.  ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని   పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తుమ్మల వరప్రసాద్ తదితరులు ఉన్నారు. 


మద్యం మత్తులో వినాయకుడి  విగ్రహం ధ్వంసం

గరిడేపల్లి, వెలుగు: మండల కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఎస్సై కొండల్ రెడ్డి వివరాల ప్రకారం..  మండల కేంద్రానికి చెందిన కారింగుల వీరస్వామి.. సోమవారం అర్ధరాత్రి సినిమా హాల్ బజారులోని బండ రంగారెడ్డి ఇంటి ముందు వినాయకుడి  విగ్రహం వద్దకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉండి  ‘మైక్ పెట్టండి.. డాన్స్ చేస్తా’ అని  నిర్వాహకులతో గొడవకు దిగాడు. వారు  వారించి  ఇంటికి పంపించారు. మంగళవారం 
తెల్లవారు జామున  వీరస్వామి వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చి విగ్రహాన్ని కింద పడేశాడు. కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై తెలిపారు.

స్టూడెంట్​ మృతిపై విచారణ జరపాలి

మిర్యాలగూడ, వెలుగు :  పట్టణంలోని ఎస్టీ గర్ల్స్ హాస్టల్​స్టూడెంట్​జటావత్​ అఖిల  మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ గిరిజన సంఘం, ఎస్ఎఫ్​ఐ నాయకులు డిమాండ్​చేశారు.  మంగళవారం హాస్టల్​కు విచారణకు వచ్చిన ఏటీబ్యూవోకు,  ఆర్డీవో ఆఫీస్​లో  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మూడావత్​ రవి నాయక్ మాట్లాడారు. ఇక్కడి హాస్టల్​లో ఉంటూ  జడ్పీ హైస్కూల్​లో  టెన్త్​ చదువుతున్న అఖిలకు ఈ నెల 25న ఫీవర్ రాగా.. ఇక్కడి వార్డెన్​తో పాటు ఇతర ఆఫీసర్లు  నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. స్టూడెంట్​పేరెంట్స్​ హాస్పిటల్​కు తీసుకెళ్లి ట్రీట్​ మెంట్​ అందించే ప్రయత్నం చేసినా పరిస్థితి విషమించి  చనిపోయిందన్నారు. వార్డెన్, ఇతర ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.  టీజేఎస్​జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్, ఎస్​ఎఫ్​ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేశ్​, ఖమ్మంపాటి శంకర్ పాల్గొన్నారు.

గుర్తు తెలియని కారు​ ఢీకొని వ్యక్తి మృతి

గరిడేపల్లి, వెలుగు: మండలంలోని రాయిని గూడెం వద్ద గుర్తు తెలియని కారు బైక్​ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి  చనిపోయాడు. ఎస్సై కొండల్ రెడ్డి  వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సుతారి మేస్త్రీ.. కోల్లపూడి సుందర్​రావు (50) రోజు వారి పనిలో భాగంగా ఆగస్టు 30న హుజూర్ నగర్ నుంచి గరిడేపల్లి మండలంలోని రంగాపురం బైక్ పై వెళ్లాడు. రాయినిగూడెం  వద్దకు  వెళ్లగానే గుర్తు తెలియని కారు  వెనుక నుంచి ఢీకొట్టింది. సుందర్​రావు తల, మెడ, కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108 లో హుజూర్​నగర్​ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు.  మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్​ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సుందర్​రావు మంగళవారం చనిపోయాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మునుగోడులో టీఆర్ఎస్ ​గెలుపు ఖాయం

చండూరు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్​ గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం చండూరులో పార్టీ కార్యకర్తలతో కలిసి  మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ  లీడర్​రాజగోపాల్​రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన తీరు మార్చుకోకపోతే మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని  హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్​రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి కాలిగోటికి కూడా రాజగోపాల్​రెడ్డి సరిపోడని ఎద్దేవా చేశారు.  22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం మునుగోడు ప్రజలను తాకట్టు పెట్టి బీజేపీ లో చేరాడని ఆరోపించారు. నియోజకవర్గంలో అంగడిలో గొర్రెలు, మేకలను కొన్నట్లుగా నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన  పలువురికి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. సమావేశంలో బొమ్మరబోయిన వెంకన్న, కోడి వెంకన్న, పెదగాని వెంకన్న, కురుపాటి సుదర్శన్, బరిగల అశోక్ తదితరులు పాల్గొన్నారు. 

కొనసాగుతున్న సాగర్​ నీటి విడుదల

హాలియా, వెలుగు:  శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో.. ఇరిగేషన్​అధికారులు మంగళవారం 8 గేట్లను 5 ఫీట్ల ఎత్తు  మేరకు ఎత్తి 76,543 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌‌కు 1,12,563 క్యూసెక్కుల ఇన్​ఫ్లో  వస్తోందని, కుడికాల్వకు 10,036 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,748 , ఎస్​ఎల్​బీసీకి 1,800, వరదకాల్వకు 400 క్యూసెక్కులు, మెయిన్ పవర్ హౌస్ ద్వారా 29,937 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఆర్యవైశ్యులంతా సంఘటితంగా ఉండాలి

మేళ్లచెరువు, వెలుగు : ఆర్యవైశ్యులంతా సంఘటితంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ  అధ్యక్షుడు మాశెట్టి అనంతరాములు చెప్పారు.  మంగళవారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఆర్యవైశ్యుల వాసవీ భవన్ లో వినాయక ఉత్సవాల్లో భాగంగా  నిర్వహించిన  సత్యనారాయణ స్వామి వ్రత పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేళ్లచెరువు వాసవీ భవన్ నిర్మాణానికి  కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  అనంతరం మేళ్లచెరువు ఆర్యవైశ్యులు అనంతరాములును ఘనంగా సత్కరించారు. మేళ్లచెరువు జిల్లా కార్యవర్గ సభ్యుడు బండారు రాజా, ట్రెజరర్​ వెంకటేశ్వర్లు, డాక్టరేట్ సాధించిన నాళ్ల రామకృష్ణ, ఉత్తమ ఆర్ఐ వాసుదేవరావులను  సన్మానించారు. 

విద్యతోనే ఉన్నత శిఖరాలు

యాదాద్రి, వెలుగు: విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని డీఈవో కే నారాయణరెడ్డి అన్నారు.  మంగళవారం రోటరీ క్లబ్​ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన బెస్ట్​టీచర్ల సన్మాన కార్యక్రమానికి డీఈవో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో టీచర్ తమ సర్వీసులో వేలాది మంది  స్టూడెంట్లను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతారని చెప్పారు. ఎంఈవో  బి.లక్ష్మీనారాయణ, రోటరీ  క్లబ్​ మెంబర్లు సద్ది వెంకట్ రెడ్డి, ఎంపల్ల బుచ్చిరెడ్డి, గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఫక్కీర్ కొండల్ రెడ్డి, దిడ్డి బాలాజీ ఉన్నారు.  

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి

యాదాద్రి, వెలుగు: జిల్లా పరిషత్​ నుంచి శాంక్షన్​ అయిన  అభివృద్ధి పనులను  స్పీడ్​గా పూర్తి చేయాలని యాదాద్రి జడ్పీ సీఈవో సీహెచ్​ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. 2020–-21, 2021-–22 ఫైనాన్స్​ఇయర్స్​లో వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై పంచాయతీ రాజ్​, ఆర్​డబ్ల్యూఎస్​ ఇంజినీర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆఫీసర్లు లేచి కొన్ని పంచాయతీల్లో  పనులపై ఇంకా తీర్మానం కాలేదని వివరించారు. ప్రజా ప్రతినిధుల సహకారం అందుతలేదని సీఈవోకు చెప్పారు.  సీఈవో మాట్లాడుతూ తీర్మానం, సహకారం విషయంలో ప్రజా ప్రతినిధులతో చర్చించాలని సూచించారు. కచ్చితంగా పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మీటింగ్​లో డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, ఇంజినీర్లు ఉన్నారు.