హైదరాబాద్, వెలుగు: ఉగాది పండుగ కల్లా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేస్తుందని అందరూ అనుకున్నా.. మరో వారంపది రోజుల టైమ్ పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. గ్రూప్ 1 పోస్టులపై ఇంకా 3 డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు అందలేదని తెలిసింది. దీనికితోడు నోటిఫికేషన్లు వచ్చాక లీగల్ సమస్యలకు చాన్స్ ఇవ్వొద్దన్న ఆలోచనతో టీఎస్పీఎస్సీ జాగ్రత్తగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 19 డిపార్ట్మెంట్లలో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో టీఎస్పీఎస్సీ అధికారులు ఆయా శాఖల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్‌రెడ్డి నిత్యం ఆయా డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో సమావేశాలు పెడుతూ వివరాల సేకరణను స్పీడప్ చేశారు. అయితే ఇప్పటికీ 16 రకాల పోస్టుల రిజర్వేషన్లు, రోస్టర్ వివరాలు అందాయని, మరో 3 డిపార్ట్మెంట్ల వివరాలు రావాల్సి ఉందని తెలిసింది. పోస్టులు, రిజర్వేషన్ల వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా, ఒకటికి రెండు సార్లు రీచెక్ చేస్తున్నారు. అందుకే గ్రూప్1 నోటిఫికేషన్ కాస్త ఆలస్యం కావొచ్చని అధికారులు చెప్తున్నారు. కనీసం వారం, పది రోజులైనా టైమ్ పడ్తుందని అంటున్నారు.
ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి
టీఎస్పీఎస్సీ ఓటీఆర్ అప్డేట్కు అభ్యర్థులు ఆసక్తి చూపట్లేదు. 5 రోజుల్లో 20వేల మంది సవరణలు, 6 వేల మంది కొత్తగా క్రియేట్ చేసుకున్నారు. ఒకేసారి అందరూ అప్డేట్ చేసుకుంటే సర్వర్ సమస్యలు తలెత్తుతాయి. ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనితారాంచంద్రన్ కోరుతున్నారు.