బీసీ రిజర్వేషన్లపై అందరి అభిప్రాయాలు తీసుకుంటం: కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవనల్ లోని కమిషన్ కార్యాలయంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా పలువురు చైర్మన్ కు వినతిపత్రాలు అందచేశారు.

అనంతరం చైర్మన్ బూసాని మాట్లాడుతూ.. పబ్లిక్ హియరింగ్ లో ప్రజలు, వివిధ సంఘాల నేతల నుంచి విలువైన సమాచారం వచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ధారించడం కోసం అవసరమైన నివేదికను తయారు చేయడానికి  మంగళవారం పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు పబ్లిక్ హియరింగ్ లో పాల్గొంటాయని వివరించారు. జిల్లాలు కూడా పర్యటించి  అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారు చేస్తామన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ లో 13న పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.