జైపూర్: డాక్టర్లు చనిపోయినట్టు ప్రకటించిన ఓ వ్యక్తి దహన సంస్కారానికి కొన్ని క్షణాల ముందు స్పృహలోకి రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోహితాశ్ కుమార్(25) అనే చెవిటి, మూగ వ్యక్తి షెల్టర్ హోమ్‌లో ఉండేవాడు. గురువారం అతడి ఆరోగ్యం క్షీణించడంతో నిర్వాహకులు ఝుంఝునులోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసినా పరిస్థితి విషమించి మధ్యాహ్నం 2 గంటలకు రోహితాశ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. పోలీసులు వచ్చి పంచనామా పూర్తిచేశాక క్రిమటోరియంలో అంత్యక్రియలు చేస్తుండగా రోహితాశ్ సడెన్ ఊపిరి పీలుస్తుండడం గుర్తించి తిరిగి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం జైపూర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు వైద్యులను కలెక్టర్ సస్పెండ్ చేశారు.