అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలె : వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: కాంగ్రెస్ ​ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అందించేందుకు చేపట్టిన ప్రజా పాలన సభల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​వివేక్​వెంకటస్వామి సూచించారు. బుధవారం జైపూర్​మండలంలోని బెజ్జల, పౌనూర్​ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన కలెక్టర్​బదావత్​ సంతోష్​తో కలిసి పాల్గొని మాట్లాడారు. 

మిషన్​భగీరథ ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ నెల రోజుల్లో తాగునీరు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ​మాట్లాడుతూ.. కొత్త రేషన్​ కార్డులకు కూడా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు నింపేందుకు ఎవరైనా డబ్బులు డిమాండ్ ​చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 

ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించగా ఎమ్మెల్యే, కలెక్టర్​ స్వీకరించారు. ఎమ్మెల్యే వివేక్ ​వెంటకస్వామిని ఆఫీసర్లు, కాంగ్రెస్ ​లీడర్లు, స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్​డీవో శేషాద్రి, వెటర్నరీ జేడీ రమేశ్, ఏఓ మార్క్ ​గ్లాడ్​స్టన్, ఎంపీడీవో సత్యనారాయణ, బెజ్జాల, పౌనూర్, టేకుమట్ల​ గ్రామ సర్పంచులు సారయ్య, గోపాల్, సుమలత, కాంగ్రెస్​ లీడర్లు చల్లా సత్యనారాయణ, రిక్కుల శ్రీనివాస్​ రెడ్డి, ఫయాజ్, చల్లా విశ్వంబర్​రెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 వధూవరులకు వివేక్​ ఆశీర్వాదం 
 

జైపూర్​ మండలం ఇందారం గ్రామంలో జరిగిన వైద్య నర్సయ్య, రమాదేవి దంపతుల కూతురు తేజస్విని–-రాజశేఖర్​ వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.