- హాజరుకానున్న కేజ్రీవాల్, మాన్, విజయన్, డి.రాజా
- సభకు 2 వేల బస్సులు, 5 వేలకు పైగా ప్రైవేట్ వాహనాలు
ఖమ్మం, వెలుగు: బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అంతా సిద్ధమైంది. ఖమ్మం సమీపంలోని వెంకటాయపాలెంలో కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ఆనుకొని 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అటెండ్ అవుతుండడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. వివిధ జిల్లాల నుంచి 5 వేల మంది పోలీసులు ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు. వాహనాల పార్కింగ్ కోసం 448 ఎకరాల్లో 20 బ్లాకులుగా విభజించి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్కు చెందిన 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరుకానున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వారం రోజులుగా ఖమ్మంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, సురేశ్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, సత్యవతిరాథోడ్ తో పాటు పలువురు నేతలు సభావేదికను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట జిల్లాల నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. ఏపీ నుంచి జనా న్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. 2వేల బస్సులు బుక్ చేశారు. మరో 5వేలకు పైగా ప్రైవేట్ వెహికల్స్ పంపిస్తున్నారు. సభా ప్రాంగణాన్ని 16 బ్లాక్‌లుగా విభజించారు. మహి ళల కోసం 2ప్రత్యేక బ్లాక్‌లు కేటాయించారు. జాతీయ మీడియా కోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి రప్పిస్తున్నారు. జాతీయ నేతలకు బహుకరించేందుకు కరీంనగర్ నుంచి సిల్వర్ఫిలిగ్రీ వీణలను స్పెషల్ గా సిద్ధం చేస్తున్నారు. సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర సాంస్కృతిక సార థి రసమయి బాలకిషన్, సాయి చంద్ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నారు.
రూ.53.20 కోట్లతో కొత్త కలెక్టరేట్ సిద్ధం
ఖమ్మం – వైరా మెయిన్ రోడ్డును ఆనుకొని వి. వెంకటాయపాలెం దగ్గర 20.10 ఎకరాల విస్తీర్ణంలో రూ.53.20 కోట్ల ఖర్చుతో జీ ప్లస్2 విధానంలో కొత్త కలెక్టరేట్ నిర్మించారు. 4బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో 20 వరకు ఆఫీసుల చొప్పున, మొత్తం 56 ప్రభు త్వ శాఖలకు గదులను కేటాయించారు.