తెలంగాణపై స్పెషల్ ఫోకస్..ఇయ్యాల్టి(సెప్టెంబర్ 16) నుంచి సీడబ్ల్యూసీ మీటింగ్

  • తరలిరానున్న 300 మంది కీలక నేతలు
  • నేటి మధ్యాహ్నం ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక రాక
  • తాజ్ కృష్ణలోనే నేతలందరికీ బస
  • సోనియా ఫ్యామిలీకి మూడో  ఫ్లోర్​లో ప్రెసిడెన్షియల్ సూట్
  • కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు
  • తొలి రోజు సీడబ్ల్యూసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌
  • రెండో రోజు పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలతో భేటీ
  • ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే ఫోకస్
  • ‘ఇండియా’ కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించే చాన్స్

హైదరాబాద్, వెలుగు: సీడబ్ల్యూసీ (కాంగ్రెస్‌‌ వర్కింగ్ కమిటీ) సమావేశాలకు అంతా సిద్ధమైంది. కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్‌‌లో నిర్వహిస్తుండటంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో తాజ్ కృష్ణ హోటల్ వేదికగా జరగనున్న మీటింగ్స్‌‌కు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా మొత్తం 300 మంది దాకా అతిథులు తరలిరానున్నారు. 

ఈ నేపథ్యంలో సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నేతలతో కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ తదితరులు తాజ్ కృష్ణ హోటల్‌‌లో శుక్రవారం పొద్దుపోయేదాకా సమీక్షించారు. మరోవైపు ఇప్పటికే వీవీఐపీ, వీఐపీ పాస్‌‌లను జారీ చేశారు. ఫుడ్ దగ్గర్నుంచి సెక్యూరిటీ వరకు అన్ని విధాలుగా కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు. సమన్వయం కోసం ఆరు కమిటీలను పీసీసీ ఏర్పాటు చేసింది. ఇటు ఏఐసీసీ కూడా ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూంను, వాట్సాప్ నంబర్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. అకామిడేషన్, ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌కు కో ఆర్డినేటర్లను నియమించింది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీడబ్ల్యూసీలోని 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు తొలి రోజు సమావేశాలకు హాజరుకానున్నారు. తొలి రోజు కేవలం సీడబ్ల్యూసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌ను నిర్వహించనున్నారు. అధికారంలో లేని 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్ అబ్జర్వర్లు, ఆఫీస్ బేరర్లతో రెండో రోజు సమావేశం నిర్వహించనున్నారు. అందుకోసం 159 మందిని పార్టీ ఆహ్వానించగా.. అందులో 149 మంది హాజరు కానున్నారు. 

శుక్రవారం ఉదయం కేసీ వేణుగోపాల్, సాయంత్రం జైరాం రమేశ్ హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రికి దాదాపు యాభై మంది వరకు ముఖ్య నేతలు సిటీకి చేరుకున్నట్టు తెలిసింది. సోనియా, ప్రియాంక, రాహుల్, మల్లికార్జున ఖర్గే తదితరులు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

కాంగ్రెస్ నేతల కోసం తాజ్ కృష్ణ మొత్తం బుక్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా వీఐపీ నేతలందరికీ తాజ్ కృష్ణలోనే బస ఏర్పాట్లను చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హోటల్ మూడో ఫ్లోర్‌‌లో సోనియా గాంధీ ఫ్యామిలీకి ప్రెసిడెన్షియల్ సూట్‌లో అకామడేషన్ కల్పించారని తెలుస్తున్నది. మిగతా నేతలందరి కోసం కాంగ్రెస్ దాదాపు హోటల్ మొత్తాన్ని బుక్ చేసినట్టు చెప్తున్నారు. నేతల అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది కోసం పార్క్ హయత్ హోటల్‌లో అకామడేషన్​ కల్పించినట్టు సమాచారం. 

కాంగ్రెస్ కీలక నేతలంతా హైదరాబాద్‌కు వస్తుండడంతో సీఆర్పీఎఫ్, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ తాజ్ కృష్ణ హోటల్‌ను తమ అదుపులోకి తీసుకున్నాయి. సోనియా గాంధీకి జడ్ ప్లస్ భద్రత ఉండడం, మిగతా కొంతమంది నేతలకు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఇటు రాష్ట్ర పోలీస్ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలోనూ బందోబస్తు కల్పిస్తున్నారు. మరోవైపు హోటల్ వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

భారత్ జోడో యాత్ర–2పై ప్రకటన?

కేంద్రంలోని అధికార ఎన్డీయేపై పోరాడేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు ఈ సమావేశాల్లోనే పదును పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నది. జమిలి, పోలరైజేషన్, కార్పొరేట్ సంస్థలకు లోన్లను క్లియర్ చేయడం, అదానీ సంస్థలకు ప్రాజెక్టులను అప్పజెప్పడం వంటి వాటిపైనా చర్చించనున్నట్టు తెలిసింది. ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేయడం, కూటమిలోని అన్ని పక్షాలకు సీట్లను సర్దుబాటు చేయడం వంటి వాటిపైనా నేతలు చర్చిస్తారని చెప్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన రావడంతో.. జోడో యాత్ర 2.0కు సంబంధించిన అంశాలపైనా సీడబ్ల్యూసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్​లో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. యాత్ర డేట్​ను ఈ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉంది.

ఆరు గ్యారెంటీలను జనాల్లోకి తీసుకెళ్లేలా..

సీడబ్ల్యూసీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న విజయభేరి సభపై నేతలు చర్చించనున్నట్టు తెలుస్తున్నది. తుక్కుగూడలో సభ పూర్తయిన తర్వాత అక్కడి నుంచే పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు వారికి అప్పగించిన నియోజకవర్గాలకు ర్యాలీగా బయల్దేరి వెళ్లనున్నారు. తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో ఆయా నేతలు చేయాల్సిన పనులు, ప్రచారాలపై మరోసారి సీడబ్ల్యూసీ సమావేశంలో వివరించనున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా సోనియా గాంధీ ప్రకటించే ఆరు గ్యారెంటీలను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పూర్తిగా వారిపైనే పెడ్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. కమ్యూనిటీ లంచ్ ప్రోగ్రామ్ ద్వారా నేతలు.. ప్రజలకు దగ్గరయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలనూ వివరిస్తారని అంటున్నారు.

తెలంగాణపై స్పెషల్ ఫోకస్

సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, మిజోరాం, రాజస్థాన్​లకు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్​లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సీడబ్ల్యూసీలో చర్చిస్తారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో.. దానికి ఎట్ల కౌంటర్ ఇవ్వాలన్న దానిపై కసరత్తులు చేస్తారని తెలుస్తున్నది.

 తెలంగాణ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్.. రాష్ట్ర సర్కారును టార్గెట్​గా చేసుకుని రూపొందించాల్సిన కార్యక్రమాలపైనా చర్చ జరపనున్నట్లు చెప్తున్నారు. తెలంగాణను ఇచ్చిన పార్టీగా జనాల్లోకి కాంగ్రెస్​ను తీసుకెళ్లేలా ప్రచార వ్యూహాలను రూపొందిస్తారని అంటున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి చేశారంటూ జనాలకు వివరించే అంశంపైనా చర్చ ఉంటుందని చెప్తున్నారు.