ఉమ్మడి ఖమ్మం జిల్లాలో .. తొలి విడత రుణమాఫీకి  అంతా సిద్ధం!

ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో .. తొలి విడత రుణమాఫీకి  అంతా సిద్ధం!
  • రూ.లక్ష లోపు రుణాలున్న  రైతులకు ముందుగా వర్తింపు  
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 85,875 మంది అర్హులు
  • ఇవాళ సాయంత్రం రైతు వేదికల్లో సంబురాలు
  • నియోజకవర్గ కేంద్రాల్లోని సంబురాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యేలు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడతలో రైతు రుణమాఫీకి అంతా సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ ఇచ్చిన హామీలో భాగంగా రూ.లక్షలోపు రుణాలున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం రుణమాఫీని అమలు చేయనుంది. ఇందుకు రెండు జిల్లాల్లో కలిపి అర్హులైన 85,875 మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమకానున్నాయి.

ఇందులో ఖమ్మం జిల్లాలో 57,857 మంది రైతులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 28,018 రైతులకు లబ్ధి జరగనుంది. అయితే ఈ రైతులకు రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు ఎంత మొత్తంలో నిధులను రిలీజ్​చేస్తున్నారనేది అధికారులు బయటకు చెప్పడం లేదు. గురువారం ఉదయం 10.30 గంటలకు బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్​​సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో నిధులకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్సుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

రుణాలు తీసుకున్నోళ్లు 5,58,191మంది.. 

రుణమాఫీ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు లోపు 5,58,191మంది రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాంతీయ, సహకార బ్యాంకుల ద్వారా రుణాలు రూ.6,123.93 కోట్లు ఉన్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 26 బ్యాంకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 బ్యాంకుల ద్వారా రుణాలు పొందినట్టు గుర్తించారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు బ్యాంకుల వారీగా ఒక నోడల్ ఆఫీసర్​ ను నియమించనున్నారు. 2018 డిసెంబర్​ 13 నుంచి 2023 డిసెంబర్​ 9 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించనుంది.

రేషన్​ కార్డును ప్రామాణికంగా తీసుకొని కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున మాఫీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్​ కార్డు లేని వారికి కూడా మాఫీని వర్తింపజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆఫీసర్లు చెబుతున్న ప్రకారం ఖమ్మం జిల్లాలో 3,73,157 మంది రైతులకు సంబంధించి రూ.4307.58 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,85,034 మంది రైతులకు సంబంధించి రూ.1816.35 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 1,47,393 మంది రైతులను రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. వారికి పూర్తి స్థాయిలో రుణమాఫీకి రూ.1400.24 కోట్లు అవసరమని లెక్కతేల్చారు. ఖమ్మంలో ఎంత మంది రైతులకు, ఎన్ని కోట్లు రుణమాఫీ వర్తిస్తుందనేది త్వరలోనే తేలనుంది. 

ఇవాళ రైతు వేదికల్లో సంబురాలు 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ రైతు వేదికల్లో రుణమాఫీ సందర్భంగా సంబురాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు క్లస్టర్ల వారీగా నిర్వహించే ఈ సంబురాల్లో పాల్గొనాలని రైతులను కూడా అధికారులు ఆహ్వానించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సంబురాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. వి.వెంకటాయపాలెం రైతు వేదికలో నిర్వహించే సంబురాల్లో కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్ పాల్గొంటారు. పాలేరు నియోజకవర్గంలో రూ.లక్షలోపు రుణమాఫీని హర్షిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రైతులు ట్రాక్టర్​ ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస​ రెడ్డి క్యాంప్​ కార్యాలయ ఇన్​చార్జి తుంబూరు దయాకర్​ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.