
- జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. 25న రిజల్ట్
- ఓటర్లు 112 మంది.. బరిలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ హెడ్డాఫీసులో బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది. శుక్రవారం జీహెచ్ఎంసీ ఆఫీసులోనే కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు వేర్వేరుగా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు సహాయకులను నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నలుగురు చొప్పున సిబ్బంది ఉండనున్నారు. మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో ఎక్స్‌అఫీషియో సభ్యులు 31 మంది, కార్పొరేటర్లు 81 మంది ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు. కాగా, పోలింగ్ సందర్భంగా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 500 మంది అధికారులు, సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో ఉండనున్నారు. పోలింగ్ జరిగే జీహెచ్ఎంసీ ఆఫీసు చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనురాగ్ జయంత్
ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంత్ తెలిపారు. ఆయన మంగళవారం జీహెచ్‌ఎంసీ హెడ్డాఫీసులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు మినహా జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో పనిచేసే మిగతా ఉద్యోగులకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిపారు. వాళ్లంతా జూన్ రెండో శనివారం విధులకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు.
‘‘ఓటర్లు ఫస్ట్, సెకండ్ ప్రయార్టీ ఓట్లు వేసేందుకు అవకాశం ఉంది. తమకు ఇష్టమైన అభ్యర్థికి పెన్‌తో 1, 2 అంటూ సంఖ్యలు రాయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులిచ్చిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. కేవలం ఒక్క అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనుకునేవారు 1 నెంబర్ మాత్రమే రాయాలి. ఒక్కరికి ఓటు వేసినా చెల్లుబాటు అవుతుంది. బ్యాలెట్ పేపర్లపై సంతకం చేస్తే ఓటు చెల్లదు. ఎవరికీ మెజారిటీ రాకపోతే సెకండ్ ప్రయార్టీ ఓట్లు లెక్కిస్తాం” అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో నోటా ఉండదని, అలాగే పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉండదని తెలిపారు.
ఎంఐఎం పార్టీకి ఓటు వేయొద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపామని చెప్పారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఓటు వేయడం, వేయకపోవడమనేది ఓటర్ల వ్యక్తిగత హక్కు అని అన్నారు.
పార్టీల వారీగా బలాబలాలు..
హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు. జిల్లా పరిధిలో మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు. ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఎంఐఎంకు 50 మంది, కాంగ్రెస్‌కు 14 మంది, బీఆర్ఎస్‌కు 24 మంది, బీజేపీకి 24 మంది ఉన్నారు.