ఉమ్మడి నల్గొండ జిల్లాలో .. రుణమాఫీకి అంతా రెడీ 

  • నేడు ఫస్ట్​ ఫేజ్​లో రూ.లక్షలోపు మాఫీ
  • రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధిక మంది రైతులకు లబ్ధి
  • సూర్యాపేటలో 56 వేల మంది అన్నదాతలకు రుణవిముక్తి
  • యాదాద్రిలో 36,420 మందికి బెనిఫిట్​
  • పంద్రాగస్టులోపు రూ. 2 లక్షలలోపు రుణాలు 

‘పంద్రాగస్టులోగా రూ. 2 లక్షల రుణాల మాఫీ చేస్తాం’.. ఇది ఎన్నికలప్పుడు సీఎం రేవంత్​ రెడ్డి చెప్పిన మాట. ఇచ్చిన మాట ప్రకారం నెల ముందుగానే రుణమాఫీకి అంతా రెడీ అయ్యింది. మూడు విడతలుగా అమలు చేయనున్న ఈ పథకం ఫస్ట్​ ఫేజ్​లో గురువారం రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో దాదాపు 1.75 లక్షల మంది రైతులకు రుణవిముక్తి కలగనుంది.

యాదాద్రి/ సూర్యాపేట/ నల్గొండ, వెలుగు: రైతు రుణమాఫీని పండగలా జరిపేందుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతు వేదికల వద్దకు అన్నదాతలను ఆహ్వానించాలని, వారితో తాను నేరుగా ఇంట్రాక్ట్​ అవుతానని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పడంతో అందుకు తగ్గట్టుగా ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు అంతా సిద్ధం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణ మాఫీకి కొన్నేండ్లు పట్టింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే రెండు లక్షల రుణ మాఫీ చేస్తోంది. మొదట లక్ష లోపు, ఈ నెలాఖరునాటికి లక్షన్నర, ఆగస్టు 15 నాటికి రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం 
ప్రకటించింది. 

యాదాద్రి, సూర్యాపేటలో ఇదీ లెక్కా..

గత ప్రభుత్వ హయాంలో యాదాద్రి జిల్లాలో మాఫీ అయినవిపోనూ సెప్టెంబర్​ 2023 నాటికి ఇంకా 58,325 మంది రైతులకు చెందిన రూ. 599.60 కోట్ల రుణాలతోపాటు వడ్డీలు పెండింగ్​లో ఉన్నాయి.  వీరికి తోడుగా డిసెంబర్​వరకూ రుణాలు తీసుకున్న రైతులు అదనం. ఫస్ట్​ ఫేజ్​లో యాదాద్రి జిల్లాలోని 17 మండలాలకు చెందిన 36,420 మందికి చెందిన దాదాపు రూ. 220 కోట్లను మాఫీ చేయనున్నారు. వలిగొండ మండలంలో అత్యధికంగా 3,315 మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి.  సూర్యాపేట జిల్లాలో 56 వేల మందికి చెందిన సుమారు రూ. 300 కోట్లకు పైగా రుణాలను 
మాపీ చేయనున్నారు. 

రుణమాఫీ సంబురాలు నిర్వహించాలి

రైతు రుణమాఫీ నేపథ్యంలో రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించనున్నట్లు నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రుణమాఫీ పొందిన రైతులు గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా రైతు వేదికల వద్దకు ర్యాలీలు, డప్పులతో  చేరుకుంటారన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పొందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు  అవసరమైన ఎల్​ఈడీ స్క్రీన్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

 నల్గొండలో మంత్రి చేతుల మీదుగా..

నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో రైతులకు లబ్ధిచేకూరనుంది. ఆరు నియోజకవర్గాల్లో కలిపి 82,041 మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ కానున్నాయి. అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో 4,093 మంది, నేరేడుగొమ్మ మండలంలో 1,314 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే దేవరకొండలో 17,239 మందికి అత్యధికంగా, నల్గొండలో అత్యల్పంగా 8,358 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.