వరంగల్‌‌లో ప్రజాపాలనకు సర్వం సిద్ధం .. గ్రామ సభలకు స్పెషల్‌‌ ఆఫీసర్ల నియామకం

  • ఒకే ఫామ్‌‌తో ఐదు పథకాలకు అప్లికేషన్‌‌
  • అవసరాన్ని బట్టి కౌంటర్ల ఏర్పాటు

హనుమకొండ/వరంగల్‌‌/జనగామ/ములుగు, వెలుగు : కాంగ్రెస్‌‌ సర్కార్‌‌ ప్రవేశపెట్టిన పథకాల కోసం అప్లికేషన్లు తీసుకునేందుకు నిర్వహించే ‘ప్రజా పాలన’ సభలకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రామాలు, మున్సిపల్‌‌ వార్డుల వారీగా టీమ్‌‌లను ఏర్పాటు చేసి ఇన్‌‌చార్జులను నియమించారు.

గ్రామాల్లో అవసరాన్ని బట్టి ఒకటి నుంచి పది కౌంటర్ల వరకు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామసభలు నిర్వహించి అప్లికేషన్లు తీసుకోనున్నారు. 

మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆధార్‌‌, రేషన్‌‌ కార్డు, ఫొటోతో కలిపి అప్లై చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌‌ సిక్తా పట్నాయక్‌‌, వరంగల్‌‌ కలెక్టర్‌‌ ప్రావీణ్య చెప్పారు. ఒకే అప్లికేషన్‌‌తో ఐదు పథకాలకు అప్లై చేసుకోవచ్చన్నారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒక్కో గ్రామానికి ఒక్కో టీంతో పాటు మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా నోడల్‌‌ స్పెషల్‌‌ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. అలాగే ఒకే ఫ్యామిలీకి ఒకే అప్లికేషన్‌‌ తీసుకోవాలని, అప్లికేషన్‌‌ తీసుకున్న వెంటనే రిసిప్ట్‌‌ ఇవ్వాలని సూచించారు. ప్రతి సెంటర్‌‌ వద్ద హెల్ప్‌‌డెస్క్‌‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామసభ వద్ద సౌలత్‌‌లు కల్పించాలన్నారు.

 ఏ రోజు రిపోర్టును అదే రోజు సాయంత్రంలోగా నిర్ణీత ప్రొఫార్మాలో అందజేయాలని సూచించారు. జనగామ జిల్లాలో ప్రజాపాలన గ్రామసభల షెడ్యూల్‌‌ను కలెక్టర్‌‌ శివలింగయ్య విడుదల చేశారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్‌‌ ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకోనున్నట్లు చెప్పారు. గ్రామసభల్లో అప్లికేషన్లు ఇవ్వని వారు ఆ తర్వాత మండల ఆఫీసుల్లో అందజేయవచ్చన్నారు. ప్రజాపాలన గ్రామసభల నిర్వహణపై ములుగులో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ పి.శ్రీజ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ప్రజాపాలన సభల్లో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. వార్డు సభల నిర్వహణ కోసం వరంగల్‌‌ ఐఎంఏ హాల్‌‌లో కమిషనర్‌‌ షేక్‌‌ రిజ్వాన్‌‌భాషా బుధవారం మీటింగ్‌‌ నిర్వహించారు. 

మహబూబాబాద్‌‌ జిల్లాలో 98 టీంలు

మహబూబాబాద్, వెలుగు : ప్రజాపాలన గ్రామ సభల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌  శశాంక చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 98 టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అప్లికేషన్‌‌ ఫారాలను గ్రామాల్లో ఫ్రీగా పొందవచ్చని చెప్పారు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్‌‌తో పనిచేస్తూ కార్యక్రమాన్ని సక్సెస్‌‌ చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ డేవిడ్, జడ్పీ సీఈవో రమాదేవి, హార్టికల్చర్‌‌ ఆఫీసర్‌‌ సూర్యనారాయణ, డీఆర్డీవో సన్యాసయ్య పాల్గొన్నారు.