యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) దేవాలయం ఉద్ఘాటనకు సర్వం సిద్ధమైంది. కొండపైన శివాలయంలో బుధవారం నుంచి 25 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25న ఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్రం మిథున లగ్నంలో శ్రీరాంపురం(తొగుట) పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి చేతుల మీదుగా శివాలయంలో రామలింగేశ్వరస్వామి స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. మహాకుంభాభిషేక ఉత్సవాల్లో భాగంగా 21 నుంచి 25 వరకు పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే పంచకుండాత్మక రుద్ర యాగం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. శివాలయం ఎదుట ఐదు కుండలాలతో యాగశాల ఏర్పాటు చేశారు. శివాలయంతో పాటు నవగ్రహ మండపం, యాగశాల, గణపతి, పర్వతవర్ధిని, సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామి, కుమారస్వామి, రాహుకేతు, సూర్యనారాయణుల ఉపాలయాలను కూడా సిద్ధం చేశారు. 54 మంది ఆచార్య బ్రహ్మ వేదపారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారక బృందంతో పంచకుండాత్మక రుద్ర యాగం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
25న కేసీఆర్ దంపతుల రాక
ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగే శివాలయ ఉద్ఘాటన పూజలకు అందరూ ఆహ్వానితులేనని ఈఓ గీతారెడ్డి చెప్పారు. శివాలయ ప్రారంభోత్సవం కోసం ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వలేదన్నారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి సూచనల ప్రకారం స్మార్త ఆగమ శాస్త్ర పద్ధతిలో ఉద్ఘాటన పర్వాలు జరుగుతాయ్నారు. 25న శివాలయ ప్రారంభోత్సవంలో సీఎం దంపతులు పాల్గొంటారన్నారు. 25 మధ్యాహ్నం నుంచి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. పూజల న్యూస్ కవరేజీకి మీడియాకు అనుమతి లేదన్నారు. ఎస్ మీడియా ద్వారా లైవ్ కవరేజీ ఏర్పాటు చేశామన్నారు.
నరసింహుడి హుండీ ఆదాయం రూ.1.87 కోట్లు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునఃప్రారంభం అయ్యాక.. 22 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. రూ. కోటి 87 లక్షల 17,937 నగదు, 62 గ్రాముల బంగారం, 3 కిలోల 550 గ్రాముల వెండి సమకూరినట్లు ఈఓ గీతారెడ్డి చెప్పారు. ఫారిన్కరెన్సీ కూడా బాగానే వచ్చింది. ఆస్ట్రేలియా కరెన్సీ 150 డాలర్లు, అమెరికా కరెన్సీ 903 డాలర్లు, సౌదీ అరేబియా కరెన్సీ 102 రియాల్స్, ఖతార్ కరెన్సీ 1 రియాల్, కెనడా కరెన్సీ 25 డాలర్లు, ఇంగ్లాండ్ కరెన్సీ 50 పౌండ్లు వచ్చాయి.
స్వర్ణ తాపడానికి కిలో బంగారం... ఈఓకు అందజేసిన మంత్రి పువ్వాడ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి ఏర్పాటు చేసే స్వర్ణతాపడం కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కిలో బంగారం విరాళంగా ఇచ్చారు. మంగళవారం ఆలయ ఈఓ గీతారెడ్డికి బంగారాన్ని అందజేశారు. మంత్రికి ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. తర్వాత ఫ్యామిలీతో కలిసి ఆయన లక్ష్మీనరసింహస్వామికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అద్దాల మండపంలో ఆయనకు ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు వేదాశీర్వచనం చేశారు.