
- అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
- పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే..
- ఇతర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు చాన్స్
- భారీ పోలీసు బందోబస్తు
నెట్వర్క్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈవీఎంలను ఆదివారం పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఆదిలాబాద్ పార్లమెంట్పరిధిలో కలెక్టర్ రాజర్షి ఆధ్వర్యంలో స్థానిక టీటీడీసీ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలను పంపింణీ చేశారు. అనంతరం వాటిని ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్, సిర్పూర్ లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మిగతా ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఎండ తీవ్రత దృష్ట్యా ఈసారి గంట ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 2200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,637 మంది పీవోలు, 2637 మంది ఏపీవోలు, 5,274 మంది ఓపీవోలను నియమించారు. మొత్తం 10,548 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
భారీ బందో బస్తు..
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిఘా పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1100 మంది జిల్లా పోలీసులతోపాటు 400 ఫారెస్ట్, ఫైర్ యూనిఫాం సర్వీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. వీరితో పాటు 27 సెక్షన్ల కేంద్ర బలగాలు, 15 సెక్షన్ల తెలంగాణ స్పెషల్ పోలీసులు ఎన్నికల బందోబస్తు చేపట్టనున్నారు. నిర్మల్ జిల్లాలో 1719 మంది పోలీసులు, కేంద్ర బలగాలకు ఎన్నికల విధులు కేటాయించారు.
ఆ ప్రాంతాల్లో 2 గంటల ముందే ముగింపు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఇతర ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని ఎలక్షన్ కమిషన్ పెంచింది. కానీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి పొడిగింపులు ఇవ్వ
లేదు. దీంతో మంచిర్యాల
కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 గంటల ముందే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్లు సకాలంలో పోలింగ్ సెంటర్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పోలింగ్ సెంటర్లకు తరలిన సిబ్బంది..
చెన్నూరులో 1,93,778, బెల్లంపల్లిలో 1,76,514, మంచిర్యాలలో 2,78,738 మంది ఓటర్లు ఉండగా.. వారి కోసం 227, 227, 287 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. చెన్నూరులో 27, బెల్లంపల్లిలో 33, మంచిర్యాలలో 39 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు. చెన్నూరులో 6, బెల్లంపల్లిలో 8 పోలింగ్ సెంటర్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని.. ఏవైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1950కు ఫోన్ చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. పోలింగ్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని హెచ్చరించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 4 గంటల వరకే..
ఆసిఫాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2,27,025 మంది ఓటర్లు ఉండగా, సిర్పూర్ లో 2,29,101 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పీటీజీ స్కూల్, కాగజ్ నగర్ పట్టణంలోని సెయింట్ క్లారెట్ స్కూళ్లలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు.
సెంటర్ ను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఇతర అధికారులు పరిశీలించారు. పంపిణీ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఓటింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా అదనంగా ఓటింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సిబ్బంది..
సెగ్మెంట్ పోలింగ్ స్టేషన్లు పీవోలు ఏపీవోలు ఓపీవోలు
ఆసిఫాబాద్ 356 427 427 854
సిర్పూర్ 320 384 384 768
ఆదిలాబాద్ 292 350 350 700
బోథ్ 306 367 367 734
నిర్మల్ 306 367 367 734
ఖానాపూర్ 309 369 369 738
ముథోల్ 311 373 373 746
మంచిర్యాల 287 344 344 688
చెన్నూర్ 227 272 272 544
బెల్లంపల్లి 227 272 272 544